తెలుగుదేశాన్ని బొంద‌పెట్టిన హ‌రీశ్‌

తెలుగుదేశంలో టీడీపీ ప‌ని అయిపోయింద‌ని మ‌రోసారి సిద్ధిపేట మున్సిప‌ల్ ఫ‌లితాల‌తో  నిరూపిత‌మైంది.. అంత‌కంటే.. తెలుగుదేశం పార్టీకి కేడ‌ర్ లేకుండా పోయింద‌ని చెప్ప‌డం ఉత్త‌మం అనేలా ఉంది ప‌రిస్థితి. ఇదంతా ఎందుకంటే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క‌స్థానానికే ప‌రిమిత‌మై టీడీపీ నాయ‌కుల్లో తీవ్ర ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ఇంత దారుణ‌మైన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని లోలోప‌ల ఆందోళ‌న చెందినా.. తెలంగాణ‌లో బ‌లంగానే ఉన్నామ‌ని డ‌బ్బాలు కొట్టుకున్నా రు టీడీపీ నేత‌లు. అయితే, మ‌రోసారి గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పోరేష‌న్ల‌లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. కానీ, ఈసారి ఎక్క‌డా క‌నీసం ఖాతా తెర‌వ‌క‌పోవ‌డంతో దిక్కుతోచ‌ని పార్టీలా మారింది టీడీపీ. అయినా అగ్ర‌నాయ‌క‌త్వం తీరు మార్చుకోకుండా మ‌ళ్లీ పాత పాటే పాడింది.
 
హ‌రీష్‌రావు చావు దెబ్బ తీశాడా?
2009 కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష త‌రువాత తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున‌ ఎగిసింది. ఆ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గులాబీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 2010లో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆస‌మ‌యంలో సిద్ధిపేట నుంచి హ‌రీశ్‌రావుపై టీడీపీ నేత, సినీన‌టుడు బాబుమోహ‌న్‌ను  పోటీకి దింపింది టీడీపీ. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీకి డిపాజిట్టు కూడా ద‌క్క‌లేదు. దాదాపు 3 ల‌క్ష‌ల ఓట్లు గులాబీ పార్టికి రాగా 1 ల‌క్షా 80వేల పైచిలుకు ఓట్లు కాంగ్రెస్‌కు వ‌చ్చాయి. అయితే, విచిత్రంగా టీడీపీకి కేవ‌లం 5, 258 ఓట్లు మాత్ర‌మే రావ‌డంతో డిపాజిట్టు గ‌ల్లంతైంది. ఆ విజ‌యం త‌రువాత హ‌రీశ్ టీడీపీని ఇలా విమ‌ర్శించాడు.
‘నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి 10 వేల మందికి పైగా క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. వీళ్లంతా బాబుమోహ‌న్‌ను గెల‌వాల‌ని ప్ర‌చారం చేసిన‌వారే.. వారి కుటుంబ స‌భ్యుల సంగ‌తి ప‌క్క‌న బెడితే.. క‌నీసం వీరంతా వేసినా 10 వేల ఓట్ల‌యినా రావాలి క‌దా! అంటే ప్ర‌చారం చేసిన కార్య‌క‌ర్త‌లు కూడా సైకిల్ గుర్తుకు ఓటేయ‌లేదంటే.. తెలంగాణ‌లో మీ గ‌తేంటో ఒక్కసారి ఆలోచించుకోండి’ అని విమ‌ర్శించారు. సరిగ్గా 6 ఏళ్ల త‌రువాత సిద్ధిపేట మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి సైకిల్ ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌డంతో ఇక దాదాపు తెలుగుదేశం పార్టీ సిద్ధిపేట‌లో తుడిచిపెట్టుకుపోయింద‌ని, మొత్తానికి త‌మ పార్టీని హ‌రీశ్ బొంద పెట్టాడ‌ని టీడీపీ నాయ‌కులే చెప్పుకుంటున్నారు.