బాహుబలి-2 ఆగిపోయింది…..

అవును… నిజంగానే బాహుబలి-2 ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఎలా సమచారం లేదు. రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్టింగులు బోసిపోతున్నాయి. ఇన్నాళ్లూ శరవేగంగా నడిచిన బాహుబలి-2 సినిమా సడెన్ గా ఆగిపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని చాలా మంది ఆరాలు తీశారు. నిర్మాతల దగ్గర డబ్బులు లేవా అనే ప్రశ్నే ఉత్పన్నంకాదు. ఎందుకంటే బాహుబలి-1తో బాగానే ఆర్జించారు. హీరో-హీరోయిన్లు, నటీనటుల కాల్షీట్లు కూడా సిద్ధంగానే ఉన్నాయి. అయినప్పటికీ బాహుబలి-2 ఆగిపోయింది. దీనికి కారణం మండిపోతున్న ఎండలే. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో కూడా ఎండలు మండిపోతున్నాయి. పోనీ మరో లొకేషన్ కు షిఫ్ట్ అయి సినిమా పూర్తిచేద్దామన్నా కూడా… దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చివరికి వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, సిమ్లా లాంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీంతో బాహుబలి షూటింగ్ ను ఆపేశారు. మే నెల అంతా ఈ సినిమా యూనిట్ కు రాజమౌళి సెలవులు ప్రకటించాడు. ఎండలో షూటింగ్ చేయడం ఏమాత్రం మంచిది కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో రాజమౌళి కూడా తన కుటుంబసభ్యులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. నెల రోజుల పాటు అక్కడే సేదతీరి తిరిగి హైదరాబాద్ వచ్చి, బాహుబలి-2ను పునఃప్రారంభిస్తాడు.