పాలేరు ప్ర‌చార బాధ్య‌త‌ల్లో హ‌రీశ్‌కు ద‌క్క‌నిచోటు!

పాలేరు ఉప ఎన్నిక‌ను సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అందుకే, ఈ ఉప ఎన్నిక ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను త‌న కుమారుడు, మంత్రి కేటీఆర్‌కు అప్ప‌గించారు. విజ‌య‌మే ల‌క్ష్యంగా పాలేరు ప్ర‌చారంలో వినూత్నంగా ప్ర‌చారం సాగించాల‌ని వ్యూహం ర‌చిస్తోంది ప్ర‌భుత్వం. ఇందులో భాగంగా నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ఒక్కో మండ‌లంలో ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను ఒక్కో నేత‌కు అప్ప‌గించారు. ఇందులో తెలంగాణ భారీ నీటిపారుద‌ల శాఖామంత్రి హ‌రీశ్ రావుకు చోటు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన హ‌రీశ్‌ను పాలేరు ఉప ఎన్నిక ప్ర‌చార బాధ్య‌త‌ల్లోనూ భాగ‌స్వామ్యం చేయ‌క‌పోవ‌డంపై పార్టీలో అప్పుడే చ‌ర్చ మొద‌లైంది. పార్టీలో ఆయ‌న ప‌రిధిని క్ర‌మంగా త‌గ్గిస్తున్నార‌ని వాదించేవారు ఈ ప‌రిణామాన్ని తాజా ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లోనూ హ‌రీశ్‌కు పూర్తిస్థాయి బాధ్య‌త‌లు ఇవ్వ‌కుండా కేవ‌లం ఒక నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం చేశారు. త‌రువాత జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో హ‌రీశ్ కు ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించలేదు. దీనిపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక ప్ర‌చారం జ‌రిగింది. అదే స‌మ‌యంలో నారాయ‌ణ‌ఖేడ్ ఉప ఎన్నిక వ‌చ్చింది. హ‌రీశ్‌రావుకు ఆ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు కేసీఆర్‌. ప్ర‌త్య‌ర్థుల డిపాజిట్లు గ‌ల్లంతు చేసి పార్టీని గెలిపించుకుని వ‌చ్చాడు హ‌రీశ్‌రావు. పార్టీకి ఎప్పుడు సంక్లిష్ట‌మైన ప‌రిస్థితి వ‌చ్చినా హ‌రీశ్‌రావు ద‌గ్గ‌రుండి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాడ‌నే పేరును మ‌రోసారి నిల‌బెట్టుకున్నాడు. 
ప్ర‌తిప‌క్షాలు ఏక‌మైన వేళ హ‌రీశ్‌ను దూరం పెట్ట‌డ‌మా?
రాంరెడ్డి రామోద‌ర్ రెడ్డి అకాల‌మ‌ర‌ణంతో పాలేరులో ఉప ఎన్నిక వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే! గ‌తేడాది పీఏసీ చైర్మ‌న్‌గా ఉన్న‌ నారాయ‌ణ్ ఖేడ్ ఎమ్మెల్యే హ‌ఠాన్మ‌ర‌ణంతో అక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చింది. అక్క‌డ కూడా గులాబీ పార్టీనే విజయం సాధించింది. అయితే, అక్క‌డి ప‌రిస్థితుల‌కు ఇక్క‌డి ప‌రిస్థితుల‌కు చాలా తేడా ఉంది. నారాయ‌ణ్ ఖేడ్‌లో గెలిచినా.. గెల‌వ‌కున్నా.. ప్ర‌భుత్వానికి పెద్ద‌గా న‌ష్ట‌మేమీ ఉండేది కాదు. ఒక‌వేళ అక్క‌డ కారు పార్టీ ఓడిపోయి ఉంటే.. ప్ర‌జ‌లు సెంటిమెంటుకే ప‌ట్టం క‌ట్టార‌ని స‌రిపెట్టుకునేవారు గులాబీ నేత‌లు. కానీ, ఇక్క‌డ ప‌రిస్థితి భిన్నంగా ఉంది. పాలేరు బ‌రిలోకి దిగిన తుమ్మ‌ల‌ను ఎలాగైనా ఓడించాల‌ని ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మైన సంగ‌తి తెలిసిందే! ఇలాంటి క్లిష్ట‌మైన ప‌రిస్థితిలో హ‌రీశ్‌ను దూరంగా ఉంచ‌డ‌మేంట‌ని పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. ఆరేడేళ్లుగా గులాబీపార్టీ పోటి చేసిన ప్ర‌తి ఉప ఎన్నిక‌లోనూ కారును టాప్‌గేర్‌లో దూసుకుపోయేలా చేసిన హరీశ్ ను ప‌క్క‌న‌బెట్టడంలో ఆంత‌ర్యం ఎవ‌రికీ అర్థం కావ‌డంలేదు. తుమ్మ‌ల గెలుపుపై ధీమాతోనే కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని కేసీఆర్ వ‌ర్గంవారు చెబుతుంటే…కేటీఆర్‌ను ప్రమోట్ చేసేందుకే ఇలా చేస్తున్నార‌ని హ‌రీశ్ రావుఅభిమానులు వాదిస్తున్నారు.