పొంగులేటి మొద‌టి నుంచే ట‌చ్‌లో ఉన్నాడా?

అనుకున్న‌ట్లే అయింది.. వైసీపీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, పిన‌పాక ఎమ్మెల్యే పాయం వెంక‌టేశ్వ‌ర్లు కారెక్కారు. అభివృద్ధి కోస‌మే తాము పార్టీని వీడి కారెక్కుతున్నామ‌ని గ‌తంలో టీఆర్ ఎస్‌లో చేరిన టీడీపీ నేత‌ల పాటే వీరు కూడా పాడారు. వీరి చేరిక‌తో తెలంగాణ‌లో వైసీపీకి ప్ర‌జాప్ర‌తినిధులు పూర్తిగా లేకుండా పోయారు. అయితే, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చేరిక‌పై ప్ర‌జ‌లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నా.. రాజ‌కీయ నేత‌లుమాత్రం ఇందులో ఆశ్చ‌ర్య‌మేమీ లేద‌ని, ఊహించిందే జ‌రిగింద‌ని చెబుతున్నారు. ఎందుకంటే…? ఎంపీగా విజ‌యం సాధించిన‌ప్ప‌టి నుంచి  పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో ట‌చ్‌లోనే ఉన్నార‌ని స‌మాచారం. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాక మండ‌లి ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ వైసీపీ మ‌ద్ద‌తు కోరింది. దీంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. ఇందులో భాగంగా టీఆర్ ఎస్ నుంచి కేటీఆర్ – వైసీపీ నుంచి పొంగులేటి ప‌ర‌స్ప‌రం ట‌చ్‌లో ఉన్నారు. ఇదే వారిద్ద‌రి మ‌ధ్య మైత్రికి దారి తీసింది.
గులాబీ పార్టీ వ్యూహాత్మ‌కంగానే చేసింది..!
జ‌రిగిణ ప‌రిణామాలు చూస్తోంటే పొంగులేటిని చేర్చుకునే క్ర‌మంలో… కారుపార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వహ‌రిస్తూ వ‌చ్చింద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. టీడీపీ త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నించింద‌న్న కార‌ణంతో టీడీపీ ఎమ్మెల్యేల‌ను చేరిక‌ను స‌మ‌ర్థించుకుంది. ఇప్పుడు వైసీపీలోనూ అదే రీతిన వ్య‌వ‌హ‌రించాల‌ని చూసింది. వైసీపీ నేత‌ల‌ను స‌రైన కార‌ణంతో చేర్చుకుంటే.. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని ముందుజాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించింది. పాల‌మూరు ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా క‌ర్నూల‌లో ఈనెల 16, 17, 18 ల‌లో ధ‌ర్నాకు వైసీపీ నేత పిలుపునిచ్చారు. ఇది తెలంగాణ ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా ఇచ్చిన పిలుపుకావ‌డంతో వెంట‌నే గులాబీ నేత‌లు ప్లాన్ అమ‌లు చేశారు. పొంగులేటి, పాయం చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.