కాంగ్రెస్ నేతలు క‌ర్ణాట‌క వెళ్లి ఏం సాధించారు?

అంతన్నారు.. ఇంత‌న్నారు.. ఉత్త‌చేతుల‌తో తిరిగి వ‌చ్చారు కాంగ్రెస్ నేత‌లు! తెలంగాణ‌లో ఆర్డీఎస్ విష‌యంలో కేసీఆర్‌ని నానా మాట‌లు అన్నారు. విమ‌ర్శ‌ల‌తో దుమ్మెత్తిపోశారు. క‌ర్ణాట‌కు వెళ‌తాం.. అక్క‌డ మా స‌ర్కారే ఉంది.. ఏదో సాధిస్తాం.. అంటూ గొప్ప‌లు చెప్పుకున్నారు. కానీ, మంత్రి హ‌రీశ్ రావు వెళ్లిన దానికంటే ఏదైనా అద‌నంగా సాధించారా? అలాంటిదేమీ లేదు. ఆ రాష్ర్ట‌పు నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌రావుకు ఇచ్చిన‌ట్లుగా అదే హామీ సీఎం సిద్ధ‌రామ‌య్య ఇవ్వ‌డం విశేషం. తెలంగాణ‌కు ఒక టీఎంసీ నీళ్లు ఇవ్వ‌డానికి సిద్ధంగా సానుకూలంగా స్పందించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు డీలాప‌డ్డ‌ట్లు స‌మాచారం. ఇత‌ర పార్టీకిచెందిన హ‌రీశ్‌, ఒకే పార్టీకి చెందిన మ‌నం చేసిన విన‌తిని ఒకేలా చూడ‌ట‌మేంట‌ని మ‌ధ‌న‌ప‌డుతున్నార‌ట‌. అంతేనా.. ఈ ప‌ర్య‌ట‌న వ‌ల్ల కాంగ్రెస్ కొత్త‌గా సాధించేదేమీ లేదు, దారి ఖ‌ర్చులు త‌ప్ప‌. ఎందుకంటే ఆర్డీఎస్‌కు ఒక టీఎంసీ నీరు ఇస్తామ‌ని క‌ర్ణాట‌క మంత్రి పాటిల్ ప‌త్రికాముఖంగా హామీ ఇచ్చారు.
ఆర్డీస్ ధ‌ర్నా వ‌ల్ల ఒరిగిందేమిటి?
తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌పై గులాబీ నేత‌లు అప్పుడే విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ప్ర‌గ‌ల్బాలు ప‌లికిన కాంగ్రెస్ నేత‌లు ఈ ప‌ర్య‌ట‌నతో ఏం సాధించార‌ని ప్ర‌శ్నించారు. క‌నీసం మరో టీఎంసీనైనా అద‌నంగా తేగ‌లిగారా? అని నిలదీస్తున్నారు. ఇంత‌కాలం అధికారంలో ఉన్న‌పుడు గుర్తుకురాని ఆర్డీఎస్ ప్రాజెక్టు, అధికారం కోల్పోగానే గుర్తుకువ‌చ్చిందా? అని విమ‌ర్శిస్తున్నారు. ఆర్డీఎస్‌పై కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న‌దంతా దొంగ జ‌పం.. కొంగ‌జ‌పం అని మంత్రి హ‌రీశ్‌రావు సైతం మండిప‌డుతున్నారు.