క‌మ‌లం – గులాబీకి చెడిందా?

పాలేరు ఉప ఎన్నిక ఇచ్చిన విజ‌యంతో టీఆర్ ఎస్ పార్టీ మంచి జోరు మీద ఉంది. ఇంత‌కాలం బీజేపీపై కినుక వ‌హిస్తూ వ‌చ్చిన అధికార‌పార్టీ ప్ర‌స్తుతం మాట‌ల దాడి మొద‌లు పెట్టింది. మొన్న కేసీఆర్ పాలేరు విజ‌యోత్స‌వ వేడుక మీద నుంచి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ను కొత్త బిచ్చ‌గాడితో పోల్చాడు. చేత‌నైతే.. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాల‌ని స‌వాలు విసిరారు. దీనికి బీజేపీ రాష్ట్ర శాఖ గ‌ట్టిగానే స్పందించింది. అయినా, టీఆర్ ఎస్ పార్టీలో ఏమాత్రం మార్పులేదు. తాజాగా ఆర్థిక‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఐసీడీఎస్ నిధుల్లో కేంద్రం కోత విధించ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. చిన్నారుల సంక్షేమానికి ఉద్దేశించిన నిధుల్లో కోత విధించ‌డ‌మేంట‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కేంద్రం త‌న ప‌థ‌కాల‌ను చూసి మురిసిపోతూ.. గాల్లో తేలిపోతోంద‌ని విమ‌ర్శించారు. ఇది మంచి ప‌ద్ధ‌తి కాదంటూ చుర‌క‌లంటించారు.

బీజేపీ – టీఆర్ ఎస్ వైఖ‌రి!

బీజేపీ – టీఆర్ ఎస్ రాజ‌కీయ వైఖ‌రి అంతుబ‌ట్ట‌కుండా ఉంది. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు వెలువ‌డిన ప్ర‌తిసారీ రెండు పార్టీలు మౌనంగాఉంటాయి. స్నేహంగా క‌న‌బ‌డ‌తాయి. దీనికితోడు ఫలానా బీజేపీ నేత‌ల‌కు రాష్ట్రంలో, ప‌లానా గులాబీ నేత‌కు కేంద్రంలో మంత్రి ప‌దవులు ఖాయ‌మంటూ వార్త‌లు- విశ్లేష‌ణ‌లు వెల్లువెత్తుతాయి. వీటిని అటు అధికార పార్టీ గానీ,ఇటు క‌మ‌ల‌నాథులు గానీ ఖండించ‌రు.. అలాగ‌నీ వీటిపై స్పందించ‌రు. రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు గుప్పించుకుంటారు. అయితే, ఎప్పుడూ ఎన్నిక‌ల‌ప్పుడు ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు చేసుకునే ఈ ఇరుపార్టీలు తాజాగా పాలేరు ఉప ఎన్నిక అనంత‌రం విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం కొత్త అనుమానాల‌కు తావిస్తోంది. బీజేపీకి- టీఆర్ ఎస్‌ల స్నేహం పూర్తిగా చెడిపోయిందా? అన్న అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ఇంత‌కాలం తెలంగాణ‌కు నిధుల విష‌యంలో అన్యాయం జరుగుతున్నా.. ఎంపీలు క‌విత‌, జితేంద‌ర్‌ల కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌న్న కోణంలో కేసీఆర్ బీజేపీపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌లేదు. కేంద్రంలో పొత్తుకు ఎలాంటి ఆస్కారం లేద‌టి తెలిసినందునే ఇలా మాట‌ల దాడి చేస్తున్నార‌న్న సందేహాల‌ను రాజ‌కీయ విశ్లేష‌కులు లేవ‌నెత్తుతున్నారు. మ‌రోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు ల‌క్ష్మ‌ణ్‌, ప్ర‌భాక‌ర్ ల‌కు రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వుల అంశం కూడా అట‌కెక్కిన‌ట్లని అనుమానిస్తున్నారు.