“అ..ఆ” సినిమా రివ్యూ

టైటిల్ :  అ..ఆ మూవీ రివ్యూ
రేటింగ్: 3.25
తారాగణం :  నితిన్, సమంతా, అనుపమా పరమేశ్వరన్, నదియా, నరేష్, రావు రమేష్ తదితరులు
సంగీతం : మిక్కీ జే మేయర్, అనిరుద్ రవిచందర్
దర్శకత్వం : త్రివిక్రమ్
నిర్మాత :  ఎస్. రాధాక్రిష్ణ

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీగా వుంటాయి. అయితే మనం అనుకున్నట్టు కాకపోయినా, నిరాశపరిచేలా లేకపోవడమే అ..ఆ ప్రత్యేకత. ఈ సమ్మర్‌లో అన్ని సెగపుట్టించే సినిమాలే వరుసగా వచ్చాయి. ఈ సినిమా కాస్త చిరుజల్లులు కురిపించింది. కథలో ఏమీ కొత్తదనంలేదు. పాత చింతకాయపచ్చడి కంటే అధ్వాన్నం. ఇలాంటి కథలు కనీసం పాతిక వచ్చి వుంటాయి. కానీ త్రివిక్రమ్‌ మెరుపులు, సున్నితమైన హాస్యం సినిమాని గట్టెక్కించాయి.

దాదాపు నలభై ఏళ్ళక్రితం యద్దనపూడి సులోచనారాణి “మీనా” నవల రాశారు. ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల తన మొదటి సినిమాగా తీశారు. పట్నంలో పుట్టిపెరిగిన మీనా పల్లెటూళ్ళో మామయ్య ఇంటికి వెళుతుంది. అక్కడి అనుబంధాలు ప్రేమలకి ఆకర్షితురాలై బావని ప్రేమిస్తుంది. సహజంగానే ఇది మీనా ఇంట్లోనచ్చదు. ఇలాంటి కథలు ఆ తరువాత చాలా వచ్చాయి.

త్రివిక్రమ్‌ ఏమీ శ్రమ తీసుకోకుండా ఒక రకంగా మీనానే మళ్ళీ తీశారు. సమంతా ఆత్మహత్యాయత్నంతో సినిమా మొదలవుతుంది. తల్లి నదియా ఆంక్షల మధ్య పెరుగుతున్న సమంతా తనకు పెళ్ళి ఇష్టంలేక చెయ్యి కోసుకుంటుంది. ఆ తరువాత పది రోజులు నదియా కాన్ఫరెన్స్‌కని చెన్నై వెళుతుంది. ఆ పదిరోజులు హీరోయిన్‌ తన మేనత్త ఇంటికి వెళుతుంది. హీరో ఆమెని రైల్లో తన సొంతవూరు కలువపూడికి తీసుకెళుతాడు.

కలువపూడిలో వున్న పదిరోజులు ఆమెకి హాయిగా గడుస్తాయి. మెల్లిగా హీరో ప్రేమలో పడుతుంది. హీరోకి సినిమా కష్టాలుంటాయి. పెళ్ళీడుకొచ్చిన చెల్లి, అప్పులు వుంటాయి. చెల్లి పెళ్ళికోసం రావురమేష్‌ కూతుర్ని పెళ్ళిచేసుకుంటానని మాటిచ్చివుంటాడు. చెల్లి పెళ్ళిచూపులు, ఇంట్లో దొంగలుపడడం, ఇలాంటి ప్రహాసనాల మధ్య ఇంటర్వెలు వస్తుంది. నిరంతరం ఆంక్షలు విధించే తల్లి ఈ పదిరోజుల్లో ఒక్కసారి కూడా కూతురికి ఫోన్‌ చేయదు. ఇది సినిమా లిబర్టి అనుకోవచ్చు.

సెకెండాఫ్‌లో హీరోయిన్‌కి నిశ్చితార్ధం ఏర్పాటుచేయడం, అత్తారింటికి దారేదిలోలాగా ఆ కుటుంబాల మధ్య గొడవలు ఎందుకొచ్చాయనే ప్లాష్‌బ్యాక్‌ వుంటాయి. చివరికి కథ సుఖాంతం. సినిమా మొత్తం మీద హీరో నితిన్‌కి ఒక వ్యక్తిత్వమున్నట్టు కనపడదు. రావురమేష్‌ కూతురిపై ఎలాంటి ప్రేమా లేకుండా ఆమెతో పెళ్ళికి కమిట్‌ అవుతాడు. ఆ తరువాత సమంతాతో ప్రేమ, మళ్ళీ ఆమె అంటే ఇష్టంలేనట్టు వుండడం. కథలో ఒక పాయింట్‌కానీ, డ్రయివ్‌కానీ వుండదు. సినిమా అక్కడక్కడ నత్తనడకనడిచినా మనకు బోర్‌ కొట్టకుండా వుండడానికి కారణం త్రివిక్రమ్‌ సరదా పంచ్‌లే. ఈ కథని ఇంకో డైరెక్టర్‌ డీల్‌ చేసివుంటే సమ్మర్‌ ఖాతాలో మరో ప్లాప్‌ చేరివుండేది.

నిజానికి ఈ సినిమాలో హీరో సమంతానే. ప్రతిఫ్రేమ్‌ ఆమె చుట్టూనే నడుస్తుంది. నదియా వున్నంతలో చాలా బాగా చేసింది కానీ అత్తారింటికి దారేదిలోలాగా నటించడానికి పెద్ద స్కోప్‌ లేదు. రావురమేష్ కాసేపు కనిపించినా డైలాగులతో అదరగొట్టాడు.

ఫొటోగ్రఫి అద్భుతం.

పల్లెటూరి అందాల్ని కనులవిందుగా చూపించారు. చాలారోజుల తరువాత స్క్రీన్‌లో పచ్చదనం కనిపించింది. ఒకటిరెండు ఫైట్స్‌ వున్నాయి కానీ అవి పూర్తిగా అనవసరం. అయితే కథలో బలం లేకుండా సన్నివేశాలతో సినిమానిలాగించే పద్ధతిని త్రివిక్రం మానుకోవాలి. బూమరాంగ్‌ అయ్యే ప్రమాదముంది.

ఎండాకాలంలో వరుస సుత్తి సినిమాలతో విసుగెత్తిపోయిన ప్రేక్షకుడు అ..ఆతో ఎంతో కొంత రిలీఫ్‌గా ఫీలవుతాడు. త్రివిక్రమ్‌ లాంటి దర్శకులు కూడా కొత్త కథలని తయారు చేసుకోలేక పోతున్నారనడానికి అ..ఆ ఒక ఉదాహరణ.

త్రివిక్రమ్‌ పంచ్‌ల్లో కొన్ని

1. వాచీ వున్న ప్రతివాడు టైం వస్తుందనుకుంటాడు.
2. మనింట్లో లైట్ల వెలుతురు చూడడానికి ఎదురింట్లో దీపాలు ఆర్పేయకూడదు.
3. మనం గాల్లోకి పువ్వు విసిరితే పువ్వు, రాయి విసిరితే రాయి రెట్టింపు వేగంతో కిందికి వస్తాయి.
4. నీ చెల్లెలు అత్తారింటికి ఏడుస్తూ వెళుతుంది… నా కూతురు ఏడువారాల నగలతో వెళుతుంది…

ప్లస్‌పాయింట్‌ – పాటలన్నీ బాగున్నాయి.
మైనస్‌ పాయింట్‌ – కథలో మలుపులు లేవు స్పీడ్‌ బ్రేకర్లు చాలా వున్నాయి.

-జి.ఆర్‌. మహర్షి

Click on Image to Read:
a..aa-movie-record
pawan
sai-dharam-tej-regina
kalyan-ram