గిది తెలంగాణ జాతి గిత్త‌

దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్ప‌టికే గుర్తింపు, ప్రాచుర్యం పొందిన ప‌శువుల‌కు పోటీకి వ‌స్తోంది తెలంగాణ ఎద్దు. ఆంధ్ర ప్రాంతానికి ఒంగోలు జాతి ఎలాగో తెలంగాణ ప్రాంతానికి ఈ తూర్పుజాతి గోవులు అలాగ‌న్న‌మాట‌. ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ నుంచి విడిపోయిన త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య మండ‌లి త‌మ జాతి గోసంత‌తిపై అధ్య‌య‌నాలు జ‌రిపింది. ఆరు నెల‌ల క్రితం మొద‌లైన ఆలోచ‌న వెనువెంట‌నే కార్య‌రూపం దాల్చ‌డంతో శాస్త్రవేత్త‌లు త‌మ జాతి గోవుల ప్ర‌త్యేక‌త‌లు, వైవిధ్యం, భౌగోళికంగా తెలంగాణ‌తో ఉన్న అనుబంధాన్ని వివ‌రిస్తూ కేంద్ర జీవ వైవిద్య మండ‌లి, ఎన్‌బీఏజీఆర్ ని  కోరుతోంది.
మ‌న్న‌నూరు (తూర్పు జాతి ఎద్దు)కు గుర్తింపు రావాలంటే ఎన్‌బీఏజీఆర్ జ‌న్యు ప‌రిశోధ‌న‌లు చేసి నిర్ధారించాల్సి ఉంది. ఈ ప‌రిశీల‌న పూర్త‌యితే తూర్పుజాతి ఎద్దు (మన్ననూరు ఎద్దు)కు తెలంగాణ గోజాతిగా గుర్తింపు ఖాయ‌మ‌ని తెలంగాణ జీవ వైవిధ్య మండ‌లి భావిస్తోంది. మ‌న్ననూరు గోవులు విశాల‌మైన ఎర్ర‌ని చార‌ల‌తో తెలుపు రంగులో ఉంటాయి. కొన్ని గోదుమ రంగులో ఉంటాయి. కొమ్ములు పొడ‌వు గా నిటారుగా (కొద్దిగా మైసూరు ఎడ్ల త‌ర‌హాలో) ఉంటాయి. వెనుక‌కు తిరిగి పొడ‌వుగా ఎదిగిన కొమ్ములు మొన‌దేలి ఉంటాయి. చెవులు నేల‌కు స‌మ‌త‌లంగా ఉంటాయి. రెండు క‌ళ్ల మ‌ద్య నుదురు కొద్దిగా లోప‌లికి ఉంటుంది. పొడ‌వైన తోక‌, దేహం ప‌రిమాణం మ‌రీ భారీగా ఉండ‌దు. వీటి జీవితకాలం 25 ఏండ్లు. నీటి వ‌న‌రులు, ప‌శుగ్రాసం ల‌భించే ప్రాంతాల‌ను బాగా గుర్తిస్తాయి. మ‌న్న‌నూరు ఆవులు రోజుకు 3 నుంచి ఏడు లీట‌ర్ల పాలిస్తాయి. ఈ జాతి ప‌శుసంత‌తి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని మ‌న్న‌నూరు, అమ్రాబాద్, అచ్చంపేట‌ ప్రాంతంలో ఎక్కువ‌గా ఉంటాయి. ఇటీవ‌లి కాలంలో వీటి సంత‌తి బాగా త‌గ్గిపోయింది.