సల్మాన్ ఖాన్ ను మించిపోయిన హృతిక్ రోషన్

ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ లో సల్మాన్ ఖానే మొనగాడు. కోట్ల రూపాయలు కొల్లగొట్టాలన్నా… రికార్డుల మీద రికార్డులు సృష్టించాలన్నా అది సల్మాన్ కే సాధ్యం. ప్రస్తుతం సల్మాన్ దరిదాపుల్లో ఎవరూ లేరనే చెప్పాలి. మరీ ముఖ్యంగా తాజా చిత్రం సుల్తాన్ తో సల్మాన్ మరింత ఎత్తుకు చేరుకున్నాడు. కేవలం 7 రోజుల్లోనే 3వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అతిపెద్ద రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బాలీవుడ్ హీరోకు సాధ్యం కాలేదు ఈ రికార్డు. ఇదిలా ఉండగా… ఒక విషయంలో మాత్రం సల్మాన్ ను క్రాస్ చేశాడు హృతిక్ రోషన్. అదే శాటిలైట్ రైట్స్. 
శాటిలైట్ రైట్స్ విషయంలో మొన్నటివరకు సల్మాన్ ఖానే నంబర్ వన్. ఓ ప్రముఖ టీవీ ఛానెల్… ఏకంగా 5వందల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది సల్మాన్ తో. ఎగ్రిమెంట్ ప్రకారం… సల్మాన్ ప్రస్తుతం చేస్తున్న, చేయబోతున్న సినిమా శాటిలైట్ రెట్స్… ఆ టీవీ ఛానెల్ కే దక్కుతాయి. ఇప్పుడు ఆ రికార్డును హృతిక్ రోషన్ అధిగమించాడు. స్టార్ ఇండియా సంస్థ హృతిక్ తో ఏకంగా 550కోట్ల రూపాయల బిగ్ డీల్ కుదుర్చుకుంది. హృతిక్ త్వరలో చేయబోతున్న 6 సినిమాల శాటిలైట్ రైట్స్ ను ఈ మొత్తానికి దక్కించుకుంది.
రిలీజ్ కు రెడీ అయిన మొహాంజదారో చిత్రం మాత్రం ఈ ఒప్పందంలో లేదు. హృతిక్ నెక్ట్స్ చేయబోతున్న కాబిల్ సినిమా నుంచి వరుసగా 6 సినిమాలు ఈ ఒప్పందం కిందకు వస్తాయి. అలా శాటిలైట్ రైట్స్ విషయంలో సల్మాన్ ను క్రాస్ చేశాడు హృతిక్ రోషన్. బాక్సాఫీస్ వసూళ్లు, రికార్డుల్లో మాత్రం సల్మాన్ దే పైచేయి.