మ‌ళ్లీ అర్ధ‌రాత్రే వ‌స్తా.. జాగ్ర‌త్త‌!

మీరు ఇక మార‌రా? ప‌నులు చేయ‌మ‌ని ఆదేశాలు జారీ చేసి నెల‌రోజులు అవుతోంది. ప‌నులు ఇంకా న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంటే.. ఏమ‌నుకోవాలి? ప‌్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతోంటే.. మీకు క‌నిపించ‌డం లేదా? ఈ మాట‌ల‌న్న‌ది ఎవ‌రో కాదు మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్. న‌గ‌రంలో జ‌రుగుతున్న రోడ్లప‌నుల‌పై బుధ‌వారం అర్ద‌రాత్రి ఆయ‌న ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. మ‌ళ్లీ ఏదో రోజు రాత్రి వ‌స్తా! ప‌నుల్లో పురోగ‌తి లేక‌పోతే.. చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని హెచ్చ‌రించారు. 
ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. రాజ‌ధానిలో రోడ్ల ప‌రిస్థితి మ‌రీ అధ్వానంగా త‌యారైంది. అందుకే, దీనిపై వ‌ర్షాకాలం ప్రారంభంలోనే కేటీఆర్ స్పందించారు. పెండింగ్ ప‌నుల‌ను ఆఘ‌మేఘాల‌మీద పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఆ త‌రువాత ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఇటీవ‌లే తిరిగి వ‌చ్చారు. తీరా వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి. కానీ, ప‌నులు మాత్రం న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయి. ఏ పేప‌రు చూసినా.. ఏ చాన‌ల్ తిప్పినా రోడ్లు బాగాలేవ‌న్న వార్త‌లే! దీంతో చిర్రెత్తుకొచ్చిన కేటీఆర్ బుధ‌వారం అర్ద‌రాత్రి 11 గంట‌ల నుంచి గురువారం తెల్ల‌వారుజామున 2.50 నిమిషాల వ‌ర‌కు న‌గ‌రంలో ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. క‌నీసం మీడియాకు స‌మాచారం ఇవ్వ‌కుండా రావ‌డంతో అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్టారు. ప‌నులు జ‌రుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన కేటీఆర్‌.. మ‌ళ్లీ అర్ధ‌రాత్రే వ‌స్తా.. ప‌నుల్లో మార్పు రావాలి. లేదంటే చ‌ర్య‌లు తీసుకుంటా అని హెచ్చ‌రించి వెళ్లారు.