కెప్టెన్ ఎన్నిక‌ల ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డారా?

కెప్టెన్ నిజంగానే ఎన్నిక‌ల ఫిక్సింగ్ కి పాల్ప‌డ్డారా? త‌మిళ‌నాడులో రాజ‌కీయ పార్టీలు డీఎండీకే అధ్య‌క్షుడు విజ‌య్‌కాంత్‌పై  చేస్తోన్న తీవ్ర ఆరోప‌ణ ఇది. ఎన్నిక‌ల్లో జ‌య‌ల‌లిత‌కు స‌హ‌క‌రించార‌ని, దానికి ప్ర‌తిఫ‌లంగా ఆయ‌న‌కు శ‌శిక‌ళ ద్వారా రూ.750 కోట్లు ముట్టాయ‌ని ఆరోపిస్తున్నారు. దీనికితోడు డీఎండీకేలో ఇటీవ‌ల రూ.500 కోట్లు మాయ‌మ‌య్యాయంటూ కొత్త ఆరోప‌ణ‌ను తెర‌పైకి తీసుకువస్తున్నారు. విజ‌య్‌కాంత్ భారీగా డ‌బ్బులు తీసుకుని, ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌ని ఒంటికాలిపై లేస్తున్నారు.
అందుకే, ఈ విష‌యంలో విజ‌య్‌కాంత్ చాలా ముంద‌స్తు వ్యూహంతో వ్య‌వ‌హ‌రించి.. త‌మ‌కు ద్రోహం చేశార‌ని ఆయ‌న పార్టీలోని ప‌లువురు నేత‌లు ఆరోపిస్తున్నారు. తామంతా చెప్పినా..విన‌కుండా ఎలాంటి పొత్తుల లేకుండా ఎన్నిక‌ల‌కు వెళ్లార‌ని గుర్తు చేస్తున్నారు. పార్టీని కావాల‌ని ఓడించేందుకు ఆయ‌న ప‌లుమార్లు మీడియా ముందు విప‌రీత ధోర‌ణితో ప్ర‌వ‌ర్తించార‌న్న ఆరోప‌ణ‌లూ ఊపందుకున్నాయి. మీడియా ప్ర‌తినిధుల‌పై ఉమ్మేయడం, పార్టీ అభ్య‌ర్థుల‌పై బ‌హిరంగ స‌భ‌ల్లో చేయి చేసుకోవ‌డం ఇందులో భాగ‌మేన‌ని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. దాని వ‌ల్లనే పార్టీకి డిపాజిట్లు కూడా ద‌క్క‌లేద‌ని, క‌నీసం రాష్ట్రంలోపార్టీ లేకుండానే గుర్తింపుకోల్పోయి.. ఏకంగా తుడిచిపెట్టుకుపోయింద‌న్న‌ది వారి వాద‌న‌. 
అస‌లు ఎన్నిక‌ల‌కు ముందు విజ‌య్‌కాంత్ మితిమీరిన ఆత్మ‌విశ్వాసంతో ఒంట‌రిగాపోటీకి వెళ్ల‌డం ఇదంతా ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కారం.. జ‌రిగింద‌ని విజ‌య్‌కాంత్ వ్య‌తిరేకులు వాదిస్తున్నారు. మీడియా ఫోక‌స్ ఎక్కువ‌గా లేని శ‌శిక‌ళ ద్వారా విజ‌య్ కాంత్ రూ.750 కోట్లు తీసుకుని ఎన్నిక‌ల్లో కావాల‌ని ఓడిపోయి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. అస‌లే  పార్టీ గుర్తింపు ర‌ద్ద‌యి బాధ‌లో ఉన్న కెప్టెన్ మ‌రి వీటికి ఏం స‌మాధానం చెప్తారో?  మొత్తానికి మూలిగే న‌క్క మీద తాటిపండు పడ‌టం అంటే ఇదే!