కేసీఆర్ ముఖంలో మార్పు అందుకేనా?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేసీఆర్ ముఖంలో ఏదో మార్పు క‌నిపించింది. ఆయ‌న ఎప్ప‌టిలా లేరు. ముఖం పాలిపోయి.. దిగులుగా క‌నిపించారు. ఎప్ప‌టిలా హుషారుగా లేరు. కార‌ణం ఏంటంటే.. ఆయ‌న‌కు తీవ్ర జ్వ‌రం వ‌చ్చింది. ఈనెల 16న అంత‌రాష్ట్ర మండ‌లి స‌మావేశంలో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అక్క‌డ అక‌స్మాత్తుగా వాతావ‌ర‌ణం మారిపోయింది. వ‌ర్షాలు కుర‌వ‌డం, వాతావ‌ర‌ణ మార్పుతో కేసీఆర్‌కు జ్వ‌రం వ‌చ్చింది. అందుకే, అంత‌రాష్ర్టాల మండ‌లి స‌మావేశంలోనూ ఆయ‌న పూర్తిస‌మ‌యం పాల్గొన‌లేక‌పోయారు. మ‌రునాడు జ్వ‌రంతోనే మోదీని క‌లిశారు. మోదీ కూడా కేసీఆర్ ఆరోగ్యం గురించి వాక‌బు చేసిన‌ట్లు స‌మాచారం. అవ‌స‌ర‌మైతే.. ఎయిమ్స్ వైద్యుల‌ను పంపిస్తాను.. మ‌రో రెండు రోజులు ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుని వెళ్లండి అని సూచించారు.
దీనికి స్పందించిన కేసీఆర్ త‌న‌కు మామూలు జ్వ‌రం మాత్ర‌మే వ‌చ్చిందని, అంత‌కు మించి మ‌రేం లేద‌ని స‌మాధాన‌మిచ్చారు. కానీ, ఆయ‌న ముఖంలో మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింది. ఎప్పుడూ హుషారుగా క‌నిపించే ఆయ‌న కాస్త నెమ్మ‌దించారు. అయినా.. చాలాకాలం త‌రువాత దొరికిన అపాయింట్‌మెంట్లు కావ‌డంతో ప్ర‌ధాని, ఆర్థిక‌మంత్రి, కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిని క‌లిశారు. తెలంగాణ‌కు రావాల్సిన నిధులు, హైకోర్టు విభ‌జ‌న‌, న‌దీజ‌లాల వివాదం త‌దిత‌ర విష‌యాల‌పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మిష‌న్ భ‌గీర‌థ‌కు, మిష‌న్ కాక‌తీయ‌కు నీతి ఆయోగ్ కేటాయించిన నిధుల‌ను వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేసేలా చూడాల‌ని ప్ర‌ధానిని కోరారు. వెన‌క‌బ‌డిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధుల‌ను మ‌రింత పెంచాల‌ని విన్న‌వించారు. వాట‌ర్‌గ్రిడ్ ప‌నుల ప్రారంభోత్స‌వానికి రావాల‌ని ప్ర‌ధాని మోదీని కేసీఆర్ స్వ‌యంగా ఆహ్వానించారు.