మహాశ్వేతా దేవి అస్తమయం

ప్రసిద్ధ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతా దేవి కోల్ కతాలో గురువారం అస్తమించారు. ఆమెకు 90 ఏళ్లు. సాహిత్య రంగంలో మన దేశంలో ఉన్న బహుమానాలన్నింటినీ ఆమె అందుకున్నారు. జ్ఞాన పీఠ్, పద్మ విభూషణ్, రామన్ మగ్సెసే అవార్డు వంటి అవార్డులెన్నో ఆమెకు దక్కాయి. కొంత కాలంగా ఆమె వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలతో బాధపడుతుండే వారు. రెండు నెలల కింద ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

గిరిజనుల సమస్యలమీద, సమాజంలోని అణగారిన వర్గాల వారి కోసం ఆమె నిరంతరం పోరాడే వారు. ఆమె పోరటం కేవలం తన స్వరాష్ట్రమైన బెంగాల్ కే పరిమితం అయింది కాదు. బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ప్రాంతాలలోని గిరిజనుల హక్కుల కోసం కూడా ఆమె పోరాడారు. ఆమె నవలలు, కథలు అనేక భాషల్లోకి అనువదించారు. కొన్ని నవలలు సినిమాలుగా కూడా వచ్చాయి. హజార్ చురాషిర్ మా, అరణ్యేర్ అధికార్, అగ్నిగర్భ లాంటి రచనలు విశేషమైన ఆదరణ పొందాయి. అణగారిన వర్గాల వారి బతుకువెతలే ఆమె రచనల్లో ప్రధాన ఇతివృత్తాలు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆమె సుదీర్ఘ కాలం పాటు పోరాడారు.