“హలో గురు ప్రేమ కోసమే” రివ్యూ

రివ్యూ: హలో గురు ప్రేమ కోసమే
రేటింగ్‌: 2.5/5
తారాగణం: రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, సితార, ఆమని, షియాజీ షిండే తదితరులు
కెమెరా: విజయ్ చక్రవర్తి
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: త్రినాధ రావు నక్కిన‌

తెలుగు సినిమాను ప్రేక్షకులు ఎక్కడికో తీసుకెళ్లాలి అనుకుంటారు కానీ మన దర్శకులు మాత్రం అబ్బే మాకలా ఇష్టం లేదంటూ ఒకే చట్రంలో ఉంటూ వాటి చుట్టే కథలను రాసుకుంటూ ఉంటారు. ఇది ఫలితం ఇవ్వదని తెలిసినా రచయితల ఆలోచనలో మార్పు రావడం లేదు. మొదలుపెట్టడమే నెగటివ్ గా ఉందని… ఇదే సినిమా గురించిన అభిప్రాయం అని కంక్లూజన్ కు రాకండి. అసలు విషయం ఇంకా ఉంది. ఎనర్జీనే ట్యాగ్ లైన్ గా పెట్టుకున్న రామ్ హీరోగా త్రినాధరావు దర్శకత్వంలో దిల్ రాజు కాంబో అన్నప్పుడు హలో గురు ప్రేమ కోసమే మీద చెప్పుకోదగ్గ హైప్ వచ్చింది. దానికి తగ్గట్టు పోస్టర్లు టీజర్లు ఉండటంతో యూత్ పుణ్యమా అని మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కాకినాడ నుంచి ఉద్యోగం చేయడానికి హైదరాబాద్ వచ్చిన సంజు(రామ్) అమ్మ స్నేహితుడు విశ్వనాధ్(ప్రకాష్ రాజ్)ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. అతని కూతురు అను(అనుపమ పరమేశ్వరన్)తో పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ ఇది తెలియని విశ్వనాధ్ అనుకి వేరే కుర్రాడికి ఇచ్చి చేస్తానని మాట ఇస్తాడు. కానీ సంజు తన ప్రేమను చంపుకోలేక ఇంట్లోనే ఉంటూ తండ్రి కూతుళ్ళను ఒక ప్లాన్ తో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇందులో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనేదే మీ మనసులో ఇప్పటికే మెదులుతున్న క్లైమాక్స్ దానికి సమాధానం

రామ్ తనలో ఎనర్జీతో సంజు పాత్రను నిలబెట్టాడు. డాన్స్ విషయంలో కాస్త రొటీన్ గా అనిపించినా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఎక్కడా అతి చేయకుండా చక్కని బాలన్స్ చూపించాడు. కానీ కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటి పాత్రలు చాలా చూసిన నేపధ్యంలో ఇది మరీ ప్రత్యేకంగా అనిపించదు. కాస్త రూటు మారిస్తే బెటర్. అనుపమ పరమేశ్వరన్ క్యూట్ గా ఉంది. యాక్టింగ్ కూడా ఓకే. కాస్త గ్లామర్ టచ్ ఇచ్చారు కానీ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు ఆ విషయంలో. ప్రణీతది డమ్మీ పాత్ర. సంజు ఫస్ట్ లవర్ గా చూపించారు కానీ అతకలేదు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాల్లో చేసిన పాత్రనే ఇందులోనూ చేసాడు. ప్రత్యేకత ఏమి లేదు. సితార, ఆమని, జయప్రకాష్, షియాజీ షిండే, ప్రవీణ్ అందరివీ క్యామియోల్లాంటి చిన్న రోల్స్.

దర్శకుడు త్రినాథరావు ఒకే కథను ఎన్ని రకాలుగా తిప్పి తీయవచ్చో ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేసేలా ఉన్నారు. మామ అల్లుళ్ళ డ్రామాతో గతంలో సినిమా చూపిస్తా మావా, నేను లోకల్ తీసిన ఈయన అందరు గుర్తిస్తారని చిన్న ట్విస్ట్ రాసుకున్నాడు కానీ మిగిలినదంతా కూడా  రొటీన్ వ్యవహారమే. సంజు అనుల మధ్య ప్రేమను సిన్సియర్ గా చూపించాల్సింది పోయి అనవసరమైన కామెడీని ఎమోషన్స్ ఇరికించే ప్రయత్నంలో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ మాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు. అందుకే వాళ్ళ ప్రేమలో నిజాయితీ కనిపించదు. ఇక్కడే కథలోని ఔచిత్యం దెబ్బ తింది. పైగా లాజిక్ కి వేల మైళ్ళ దూరంలో 30 రోజుల ఫ్రెండ్ షిప్ అంటూ ప్రకాష్ రాజ్ రామ్ ల మధ్య ఓ ట్రాక్ కాస్త ఎంటర్ టైనింగ్ గా పెట్టారు కానీ అది కాసేపు నవ్వించినా తర్వాత ఆలోచిస్తే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కూతురి జీవితం గురించి అంతగా ఆలోచించే తండ్రి ఒక చిన్న మాట కోసం హీరో ఏం చెప్తే అది గంగిరెద్దులా తలూపి చేయడం సింక్ అవ్వలేదు. ఇంత సిల్లీ కథను కూడా మరీ ఎక్కువ బోర్ కొట్టకుండా చేయడంలో మాత్రమే త్రినాథరావు సక్సెస్ అయ్యాడు.  అది మినహాయిస్తే అన్ని మైనస్సులే. ప్రసన్న కుమార్ డైలాగులు మాత్రం అక్కడక్కడా బాగున్నాయి. విజయ్ చక్రవర్తి కెమెరా పనితనం జస్ట్ యావరేజ్. ఎడిటింగ్ పూర్తి న్యాయం చేయలేదు. దిల్ రాజు చాలా చీప్ బడ్జెట్ లో చుట్టేశారు. పెద్ద ఖర్చయినట్టు ఎక్కడా కనిపించదు

హలో గురు ప్రేమ కోసమే ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం టైం పాస్ కోసం వెళ్తేనే ఓ మాదిరిగా జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది. అలా కాకుండా టైటిల్ చూసి మోసపోయి నిజమైన ప్రేమ… బలమైన ఎమోషన్స్ అంటూ ఏవేవో ఊహించుకుంటే మాత్రం నిరాశ తప్పదు. నీరసంగా అనిపించే పాటలతో ఈజీగా ఊహించగలిగే కథా కథనాలతో జస్ట్ కంపార్ట్మెంట్ లో పాస్ అయిన రచయిత దర్శకుడు ఇకనైనా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఆలోచిస్తే ఇంకా మంచి సినిమాలు తీయొచ్చు. లేదా ఇదే ఫార్ములా శాపంగా మారి హెచ్చరికగా చెప్పడానికే హలో గురు ప్రేమ కోసమే ఉదాహరణగా నిలిచింది