”వీర భోగ వసంత రాయలు” సినిమా రివ్యూ

రివ్యూ:  వీర భోగ వసంత రాయలు
రేటింగ్‌: 1/5
తారాగణం: శ్రీవిష్ణు, నారా రోహిత్, శ్రేయ, సుధీర్ బాబు, శ్రీనివాసరెడ్డి  తదితరులు
సంగీతం: మార్క్ కే రాబిన్
నిర్మాత: అప్పారావ్ బెల్లన
దర్శకత్వం: ఇంద్రసేన ఆర్

మాములుగా టాలీవుడ్ లో ఒకరు కన్నా ఎక్కువ హీరోలు ఉన్న సినిమా వస్తోంది అంటే ప్రత్యేకమైన ఆసక్తి కలగడం సహజం. కానీ విచిత్రంగా వీర భోగ వసంత రాయలు విషయంలో మాత్రం రివర్స్ లో దీన్నెవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. దానికి పబ్లిసిటీ లోపం ఒక కారణం అయినప్పటికీ… విడుదల అయ్యాక కంటెంట్ వుంటే అదే నిలుస్తుంది కదా అన్న నమ్మకంతో జనాలు కొందరు థియేటర్ దాకా వెళ్లే ధైర్యం చేశారు. 

సంఘంలో నేరస్థులు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న వీర భోగ వసంత రాయలు(శ్రీవిష్ణు) 300 ప్రయాణికులు ఉన్న ఫ్లైట్ ని హై జాక్ చేస్తాడు. దాని కోసం ప్రభుత్వానికి ఓ వింతైన షరతు పెడతాడు. ఆ క్రమంలో అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దీపక్ రెడ్డి (నారా రోహిత్), నీలిమ (శ్రేయ)లు. ఈ లోపు నగరంలో ఓ మాయమైన ఇల్లు వెతికే పనిలో ఉంటాడు ఇన్స్ పెక్టర్ వినయ్ (సుధీర్ బాబు). ఒకరికి తెలియకుండా ఒకరికి కనెక్షన్ ఉంటుంది. మరోవైపు చిన్నపిల్లల కిడ్నాపులు, వరుసగా కేసులో సంబంధం ఉన్న వాళ్ళ హత్యలు జరుగుతాయి. చివరికి ఏమైంది అనేదే కథ.

నారా రోహిత్ పెద్దగా నటించే అవకాశం దక్కలేదు. బిగదీసుకుని ఏదో కానిచ్చేశాడు. డబ్బింగ్ చెప్పడానికి కూడా ఇష్టపడని సుధీర్ బాబు ముభావంగానే ఉన్నాడు. కొడుకుతో నటించిన సీన్స్ లో మాత్రం కాస్త హుషారు చూపించాడు. పాపం అనిపిస్తుంది ఇందులో శ్రేయ పాత్ర హెయిర్ స్టైల్ చూశాక. రెండూ అతకలేదు. శ్రీవిష్ణు కొంత నయం. టైటిల్ రోల్ కాబట్టి బాగానే చేసాడు. ఏడిద శ్రీరామ్, రవిప్రకాష్, శ్రీనివాసరెడ్డి కాస్త గుర్తుండే మొహాలు. ఇంకెవరి గురించి ప్రత్యేకంగా అవసరం లేదు.

దర్శకుడు ఇంద్రసేన రాసుకున్న పాయింట్ లో క్లారిటీ ఉంది కానీ స్క్రీన్ ప్లే లో అది మిస్ కావడంతో సినిమా మొత్తం ఖంగాళీలా తయారయ్యింది. ఏ పాత్ర ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎక్కడ ఏ మలుపు వస్తుందో అర్థం కాక విపరీతమైన గందరగోళం నెలకొంటుంది. పైగా డైలాగ్స్ టీవీ సీరియల్ కంటే తీసికట్టు స్థాయిలో ఉండటంతో టెంపో పూర్తిగా దిగజారిపోయింది. అసలు వీర భోగ వసంత రాయలు అంటూ అంత బిల్డప్ ఇచ్చే పేరు పెట్టుకున్న శ్రీవిష్ణు ఏకంగా ప్రధాన మంత్రి సైతం బెదిరిపోయే స్థాయిలో ప్రవర్తించడం లాజిక్ పూర్తిగా మిస్ అయ్యేలా చేసింది.

ఫ్లైట్ హై జాక్ మొదలుకుని ఇల్లు మాయం అయ్యే విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు అన్నీ సిల్లీగా ఇంకా చెప్పాలంటే కామెడీగా అనిపిస్తాయి. ప్రేక్షకులను మరీ అమాయకంగా జమ కడితేనే ఇలాంటి కళాఖండాలు వస్తాయి. ఏ దశలో కథ బావుందే అనే అవకాశం దర్శకుడు ఇవ్వలేదు. పైగా పూర్ మేకింగ్ తో క్వాలిటీ లేకుండా చుట్టేశారు. చాలా సన్నివేశాల్లో లిప్ సింక్ తో సహా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మార్క్ సంగీతం చూపించే ప్రభావం శూన్యం. వెంకట్ కెమెరా పర్వాలేదు. శశాంక్ ఎడిటింగ్ మాత్రం కోత వేయడం మర్చిపోయింది. నిర్మాణ విలువలు మరీ రాజీ పడిపోయి జీరో స్థాయిలో ఉన్నాయి.

చివరిగా చెప్పాలంటే వీర భోగ వసంత రాయులు థ్రిల్లర్ పేరుతో వచ్చిన ఒక వృధా ప్రయాస. స్కోప్ ఉన్నా దర్శకుడి అనుభవ రాహిత్యానికి మితిమీరిన ఆత్మవిశ్వాసం తోడయితే ఎలా ఉంటుందో చెప్పడానికి తప్ప దీని వల్ల ఏ ఉపయోగమూ లేదు. ట్రైలర్ లాంచ్ లో దర్శకుడు ఇంద్రసేన సుకుమార్ కు పోటీగా వస్తాం అని చెప్పాడు కానీ ఇది చూసాక అది ఎంత పెద్ద జోకో అర్థమవుతుంది. కనీసం టైం పాస్ స్థాయిలో కూడా లేని వీర భోగ వసంత రాయలుని ట్రై చేయడం అంటే సాహసమే.

వీరభోగవసంతరాయలు – థ్రిల్లర్ కాదు టార్చర్