కౌసల్య

అందరికీ ఆదర్శం రాముడు. అతని గుణమూ సుగుణమూ విలువలూ వ్యక్తిత్వమూ నడకా నడత అన్నీ – అతణ్ని కనిపెంచిన కౌలస్యవే. అందుకే కౌశల్య రాముడని కొలుచుకుంటాం. అమ్మ చెప్పిన బుద్దులే ఎవరికయినా వస్తాయి. మరి రాముని లాంటి ఆదర్శమూర్తికి జన్మనిచ్చిన కౌసల్య కథనూ తెలుసుకుందాం!

కౌసల్య కోసల దేశపు రాజకుమార్తె. ఈమె తండ్రి భాను మంతుడు. కూతురు మనసు తెలుసుకున్నవాడు. కూతురు సుఖం కోరుకున్నవాడు. దశరధ మహారాజుకు తనకుమార్తె కౌసల్యను యిచ్చి పెళ్ళి చేయాలనుకున్నాడు.

ఇవేవీ తెలియని కౌసల్య ఉద్యాన వనంలో విహరిస్తున్న దశరధుని చూసింది. అతని మీద ప్రేమ పెంచుకుంది. తను పెంచుకున్న చిలుక చేత ఉంగరాన్ని కూడా పంపింది. అదే సమయంలో భానువంతుడు దశరధునకు ఆహ్వానం పంపాడు. కౌసల్యను పెళ్ళాడడానికి దశరధుడు సపరివారంతో ప్రయాణ మయ్యాడు. కాని మార్గమద్యంలో నది ఉప్పొంగి దశరధుడు కొట్టుకుపోయాడు.

ఇటుచూస్తాేకౌసల్యకు పుట్టబోయే బిడ్డ చేతిలో తనకు మరణం వున్నదని తెలిసిన రావణుడు కౌసల్యను అంతం చేయాలను కుంటాడు. అనుకున్నదే తడవు కౌసల్యను ఎత్తుకు వచ్చి పెద్ద పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేస్తాడు.

నదిలో కొట్టుకు వచ్చిన దశరధుడు కౌసల్యవున్న చోటుకి ా అంటే పెట్టె దగ్గరకే చేరుతాడు. అలా కౌసల్య దశరధుడు ఒకరినొకరు కలుసుకొని కలబోసుకొని కళ్యాణం కూడా అక్కడే చేసుకుంటారు. కౌసల్యకు రావణునితో పొంచివున్న ముప్పును నారదుడు తీర్చుతాడు. ‘నీ చావుకు కారణమైన వాణ్ణి చంపాలిగాని, కన్న వాళ్ళని కాదు, అందునా ఆడ వాళ్ళని అసలే కాదు’ అని నారదుడు అంటాడు. దాంతో కౌసల్యను చంపే ప్రయత్నాన్ని మానుకుంటాడు రావణుడు. మొత్తానికి జటాయువు అనే పక్షినెక్కి అయోధ్యకు చేరుకుంటారు కౌసల్య దంపతులు.

కౌసల్య రాణి వాసాన్ని అనుభవించినా మాతృభావనకు చాలాకాలం దూరమవుతుంది. ఆమె మనోవిచారం తెలుసుకున్న దశరధుడు పుత్రకామేష్టియాగాన్ని చేస్తాడు. యజ్ఞ పురుషుడు యిచ్చిన పాయసాన్ని కౌసల్య కొంత తాగి మిగిలింది సవతి సుమిత్రకు ఇస్తుంది. కౌసల్యకు రాముడు పుట్టాడు. పుట్టింది విష్ణువని, కన్నది కౌసల్య అయినా ఆమె ముందు జన్మలో ‘అదితి’ అని చెప్తారు. అదితి గర్భాన జన్మించిన వాళ్ళు సత్ప్రవర్తనులు, దేవతలు అవుతారని అందుకనే విష్ణువు ఆమెకడుపున పుట్టాడని పెద్దలు చెపుతారు.

అయోధ్యరాముడు పట్టాభిషేకానికి దూరమై అడవులకు పోయినప్పుడు… పద్నాలుగేళ్ళు అరణ్య వాసం అనుభవిస్తున్నప్పుడు కౌసల్యది అరణ్యరోధనే అయింది. రాముడు వనవాసంలో వుండగా దశరధుడు చనిపోయాడు. పుత్ర వాత్సల్యంతో రామున్ని చూడాలనే ఆర్తితోనే కౌసల్య జీవించింది. శ్రీరామునికి పట్టాభిషేకం జరిగి, అశ్వమేధయాగం పూర్తి చేసిన తర్వాతనే-కన్నులరా పట్టాభి రాముణ్ని చూసిన తర్వాతనే-కన్ను మూసింది. కన్న మమకారానికి కౌసల్యజీవిత చరమాంకమే నిజమైన నిదర్శనం!..

– బమ్మిడి జగదీశ్వరరావు