ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త నపుంసకుడు అన్నట్టు బాబు తీరు – ఉండవల్లి

ఎవరో జడ్జి తప్పు చేశారని కోర్టులను కూడా చంద్రబాబు నిషేధిస్తారా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్. సీబీఐ ఏపీలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ చంద్రబాబు ఇచ్చిన జీవోపై ఉండవల్లి స్పందించారు.

టీడీపీ తీరు చూస్తుంటే టీడీపీ ఎమ్మెల్యేలే న్యాయస్థానాలు… లోకేష్ అప్పీల్ కోర్టు…. చంద్రబాబే సుప్రీం కోర్టు అని అంటారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు తనకు తానే పరిటాల రవి, రింగ్‌ రోడ్లు వ్యవహారాలపై సీబీఐ విచారణ కోరారని గుర్తు చేశారు.

చంద్రబాబు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా సీబీఐ విచారణ కోరలేదన్నారు. అసలు చంద్రబాబు సీబీఐ, ఐటీ దాడులు అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అవినీతి చేస్తాం…. అయినా సరే తమపై విచారణలు, దాడులు జరగకూడదని చంద్రబాబు చెబుతున్నట్టుగా ఉందన్నారు.

ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం ఇప్పుడు తప్ప…. చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. మా ఊరిలో అందరూ మంచివాళ్లే కాబట్టి పోలీసులు రావడానికి వీల్లేదని ఏ గ్రామమైనా చెబితే చంద్రబాబు ఒప్పుకుంటారా? అని ఉండవల్లి ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు తప్పు చేయని పక్షంలో తొడకొట్టి విచారణకు సవాల్‌ చేయాల్సిందన్నారు. మేం చేసే అవినీతిని ఎవరూ ప్రశ్నించకూడదని చెప్పేందుకు ఈ తప్పుడు జీవో ఇచ్చినట్టు తాను భావిస్తున్నానన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో టిష్యూ పేపర్‌తో సమానమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని జీవోలు తెచ్చినా కోర్టులు ఆదేశిస్తే తప్పనిసరిగా సీబీఐ విచారణ జరగాల్సి ఉంటుందన్నారు. జీవో ఇవ్వడమే హాస్యాస్పదమని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారన్నారు.

ఇలాంటి జీవోలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ పరువు తీస్తున్నారని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాలన్నారు. వెంటనే జీవోను రద్దు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దాంతపరమైన అంశాలతో పనిలేదని ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు మాత్రమేనన్నారు. మోడీ అంతటి గొప్ప ప్రధాని దేశ చరిత్రలో లేరంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు.

మోడీ వచ్చాకే దేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని చెప్పిన వ్యక్తి చంద్రబాబేనన్నారు. భార్యా భర్తల మధ్య గొడవ వస్తే భర్త కొడుతున్నాడు, శాడిస్టు అంటూ విడాకుల పిటిషన్ వేస్తే అర్థముంటుంది గానీ.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త నపుంసకుడు అంటే అర్థం ఉందా? అని ప్రశ్నించారు. భర్త నపుంసకుడైతే పిల్లలు ఎలా పుట్టారు? అని ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉంటుందా అని నిలదీశారు. దేశం కోసం కాంగ్రెస్‌తో కలుస్తున్నట్టు చెబుతున్నచంద్రబాబు… రేపు ప్రపంచం కోసం పాకిస్తాన్‌తో కలుస్తానని కూడా చెప్పేలా ఉన్నారన్నారు. చంద్రబాబు తీరు పరాకాష్టకు చేరిందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.