కశ్మీర్ లో వినాశకరమైన రాజకీయ కుతంత్రాలు

పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ-భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పతనం తర్వాత అయిదు నెలలకు జమూ-కశ్మీర్ గవర్నర్ రాష్ట్ర శాసన సభను రద్దు చేయడం కశ్మీర్ రాజకీయాలలో గణనీయమైంది. ఈ నిర్ణయం ప్రభావం వివిధ రాజకీయ పార్టీల మీద ఉండడమే కాదు, ప్రజాస్వామ్యానికి అవకాశం తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజానీకంలో ఉన్న అభిప్రాయం ఏమిటో కూడా స్పష్టం అయింది.

నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పి.డి.పి. నాయకురాలు మహబూబా ముఫ్తీ సిద్ధమైన తర్వాత గవర్నర్ శాసన సభను రద్దు చేయాలని నిర్ణయించడంతో ఆ  నిర్ణయం మరింత వివాదాస్పదమైంది. ఈ లోగా జమ్మూ-కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ గనీ లోన్ బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.

వైపరీత్యం ఏమిటంటే పి.డి.పి., నేషనల్ కాన్ఫరెన్స్ శాసన సభను రద్దు చేయాలని గట్టిగా కోరాయి. పి.డి.పి.-బీజేపీ ప్రభుత్వ పతనం తర్వాత శాసన సభను సుప్త చేతనావస్థలో ఉంచారు. జమ్మూ-కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిసిన తర్వాత శాసన సభను రద్దు చేయాలన్న కోరిక గట్టిగా వినిపించింది.

పి.డి.పి. నుంచి, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. లోన్ మూడవ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించగానే పి.డి.పి. లోని కొంత మంది అందులో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.

మూడవ ఫ్రంట్-బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిరోధించడానికే పి.డి.పి, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడాలని ప్రయత్నించాయి. పి.డి.పి., నేషనల్ కాన్ఫరెన్స్ శాసన సభ రద్దును విమర్శించినప్పటికీ ఆ నిర్ణయం ఒక రకంగా ఆ పార్టీలకు సంతృప్తి కలిగించినట్టే. ముసురుకొస్తున్న అస్థిరత తొలగి పోవడం ఈ రెండు పార్టీలకు సంతోషకరమే. రెండు దశాబ్దాల కిందే ఏర్పడిన పి.డి.పి. లో చీలికల వల్ల ఆ పార్టీ తెరమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.

నేషనల్ కాన్ఫరెన్స్ కు  కూడా పరిస్థితి అంత సుముఖంగా ఏమీ లేదు. పి.డి.పి. అవతరణతో రాష్ట్ర రాజకీయాలలో నేషనల్ కాన్ఫరెన్స్ కు ఉన్న ఆధిపత్యం పోయింది. 2014 ఎన్నికల తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ అతి పెద్ద పార్టీగా కూడా అవతరించలేకపోయింది. పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకత్వంలో మూడవ ఫ్రంట్ ఏర్పడితే తమ పరిస్థితి మరింత దిగజారుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ భావించింది.

స్వల్ప కాలిక దృష్టితో చూస్తే శాసన సభ రద్దుతో పి.డి.పి.లో సంక్షోభం తప్పింది. అవసరమైన సమయంలో తమ బద్ధ శత్రువైన పి.డి.పి.కి అండగా నిలిచి బీజేపీని దూరంగా ఉంచి కశ్మీర్ ప్రయోజనాలను పరిరక్షించడానికి  పాటుపడ్డామన్న సంతృప్తి నేహనల్ కాన్ఫరెన్స్ కు దక్కింది. అయితే మొత్తం మీద ఈ ప్రయత్నాలన్నీ కశ్మీర్ లో ప్రజాస్వామ్య రాజకీయాలకు విఘాతం కలిగించాయి. ఈ రాజకీయాలు గత పదిహేనేళ్లుగా బలం పుంజుకున్నాయి. వేర్పాటు వాదం కొనసాగుతున్నా ప్రజాస్వ్యామ్యంపై ప్రజల విశ్వాసం అంతకంతకూ పెరుగుతోంది.

1989లో వేర్పాటువాదం, మిలిటెంటు కార్యకలాపాలు పెరిగిన తర్వాత ఇది చిన్న విజయం ఏమీ కాదు. అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ అనుసరించిన జోక్యందారీ రాజకీయాల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. రాష్ట్ర రాజకీయాలలో తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం 1984లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఫిరాయింపులను ప్రోత్సహించి ఫిరాయింపుదార్ల తోడ్పాటుతో జి.ఎం.షా నేతృత్వంలో ప్రజాదరణ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1986లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటిదే. 1987లో జరిగిన ఎన్నికలను మాయ చేశారు.

దీనితో కశ్మీరీ ప్రజలకు ప్రజాస్వామ్యంపై రోత పుట్టింది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజపేయి చాలా కష్టపడి, రాజకీయ వ్యూహాలు అనుసరించి ప్రజాస్వామ్య ప్రక్రియ మీద విశ్వాసం పాదుకొల్పాల్సి వచ్చింది. 2002లో వాజపేయి “స్వేచ్ఛగా, న్యాయంగా” ఎన్నికలు జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఆ రాష్ట్ర అధికార రాజకీయాలలో కేంద్రం జోక్యం చేసుకోకుండా చూశారు. దీని వల్ల ప్రజాస్వామ్యానికి అవకాశం పెరిగింది.

ఈ దృష్టితో చూస్తే ప్రస్తుతం ఉదంతం కశ్మీర్ లో ప్రజాస్వామ్యానికి ప్రయోజనకరం కాదు. స్థానిక పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నించడం “మాయ” చేయడానికే ఉపకరిస్తుంది. పైగా ఈ ప్రయత్నాలు 1984-87 మధ్య కాంగ్రెస్ కుటిల రాజకీయాలతో పోల్చి చూడడానికి వీలు కల్పిస్తున్నాయి. వేర్పాటు వాదం, మిలిటెంట్ కార్యకలాపాలు పెరుగుతున్న దశలో ఇది శుభవార్త కాదు.

స్థానిక రాజకీయాలు ఇంత అస్థిరంగా ఉన్నప్పుడు వాటిలో కేంద్రం జోక్యం చేసుకోవడం మరింత ప్రమాదకరం. ఇది ప్రధాన రాజకీయ స్రవంతికి విఘాతం కలిగిస్తుంది. వేర్పాటువాద రాజకీయాలకు ఊపిరులూదుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితినిబట్టి చూస్తే కశ్మీర్ లో ప్రజాస్వామ్య రాజకీయాలను బలోపేతం చేయాలి. రాజకీయ కుతంత్రాలకు అవకాశం ఉండకూడదు. ఒక రాజకీయ పార్టీ స్వార్థం కోసం రాజకీయ కుతంత్రాలకు పాల్పడకూడదు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)