లగడపాటి సర్వేను ఖండించిన లగడపాటి భార్య

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కలవరు అనుకున్న వారు

కలుస్తున్నారు… ఒకేతాటిపై ఉండాల్సిన వారు వేరువేరు అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మహాకూటమికి సానుకూల వాతావరణం ఉందని చెప్పేందుకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అయితే ఆయన భార్య లగడపాటి పద్మ మాత్రం మరో లైన్ తీసుకున్నారు. ఆమె ఏకంగా టీఆర్‌ఎస్ తరపున ప్రచారం చేస్తున్నారు.

గులాబీ కండువా కప్పుకుని ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌కు అనుకూలంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె…. మరోసారి టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లలో అన్ని పనులు పూర్తి చేయలేదన్నారు.

కనీసం పదేళ్లు అవకాశం ఇస్తే పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయన్నారు. పనులు మధ్యలో ఉన్నప్పుడు మరో ప్రభుత్వం వస్తే ఆ పనులన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంటుందన్నారు పద్మ. టీఆర్ఎస్సే గెలుస్తుందని… తాను కూడా టీఆర్ఎస్సే గెలవాలని కోరుకుంటున్నానని లగడపాటి పద్మ వివరించారు. తనకు అన్నలాంటి టీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌ను గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.