కైక

	'కయ్యానికి కైకవయిపోతున్నావే' అనడం విన్నారు కదా? అసలు రావణ సంహారమే కాదు, రామాయణం జరగడానికే కారణం కైక కోరిన వరాలు! కోర కూడని వరాలు కనుకనే 'కైక వరాలు' అనే నానుడీ వచ్చింది.

	కైకేయిని వాడుకలో కైక అంటున్నాం. ఈ కైక కేకయ రాజు కుమార్తె. దశరథునికి భార్య. భరతుని కన్న తల్లి. రాముని పెంచిన ప్రేమ చూపించిన పినతల్లి.

	శంబాసురినితో ఇంద్రునికి వైర మొచ్చింది. అది యుద్ధానికి దారి తీసింది. ఇంద్రునికి తలపడే శక్తి చాలలేదు. దశరథుని సాయమడిగాడు. దశరథుడు అంగీకరించి యుద్ధ సాయానికి వెళ్ళాడు. కైక కూడా భర్త వెంట యుద్ధానికి వెళ్ళింది. యుద్ధంలో రాక్షస మాయలను చిత్తు చేసింది. ఆట కట్టించింది. ప్రతిమాయలు చేసింది. కైక లేనిదే గెలుపు లేదు. గెలిచింది. గెలిపించింది. రాక్షస మాయలకు ప్రతీకారం కలిగివుండే శక్తిని దవళాంగుడనే మునినుండి కైక వరము పొందివుంది. భార్య బల పరాక్రమాలకు దశరథుడు ఎంతో సంతోషించాడు. ఒకటి కాదు రెండు వరాలు కోరుకొమ్మన్నాడు. కైకకు ఏం వరం కోరాలో తోచలేదు. సరే అవసరమైనపుడు అడుగుతానంది. మర్చిపోయింది కూడా!

	మంథర వచ్చి మంట పెట్టే దాకా ఆ రెండు వరాలూ గుర్తు చేసేదాక కైకేయికి ఆ ఆలోచనే లేదు. శ్రీరాముడికి పట్టాభిషేకానికి పెద్ద కొడుకని మొదట సంబరపడింది. సొంత కొడుకు భరతుడు సంగతేంటనే దాక ఆలోచించలేదు. యువరాజుగా రాముడి పట్టాభిషేకం జరిగితే కౌసల్య పట్టపురాణి అవుతుంది. కైక దాసి అవుతుంది. భరతుడు ఎప్పటికీ సింహాసనం అధిష్టించలేడు. రాజుకాలేడు. భవిష్యత్తుని చూపించి భయపెట్టింది మంథర.

	మంథర కోరినట్టే కైక భర్త దశరథుని వరాలు రెండూ కోరింది. శ్రీరామునికి పద్నాలుగేళ్ళు అరణ్యవాసం ఒకటయితే భరతునికి యువరాజుగా పట్టాభిషేకం రెండోది. దశరథుడు నమ్మలేకపోయాడు. నమ్మి జీర్ణించుకోలేకపోయాడు. రాముడు సిద్ధపడినా - తరువాత వచ్చి భరతుడు కాదన్నా - దశరథుడు యిచ్చిన మాట నెరవేర్చక తప్పలేదు. పెద్దకొడుకును విడవలేక మనసొదిలి మనోవ్యాధికి లోనై దశరథుడు కన్ను మూసాడు.

	అంతా అయ్యాక కైక చాలా చింతించింది. కాని ప్రయోజనం లేదు. ఏమయినా రాముడి అరణ్యవాసం వల్ల - సీత అపహరణ జరిగి - రావణ సంహారం జరిగింది.

	అరణ్యవాసం పూర్తి చేసుకొని వచ్చిన రాముణ్ని చూసి కైక ఏడ్చింది. రాముని ప్రేమలో తేడా రాలేదు. రాముడు అశ్వమేధయాగం ముగించగానే, తనకీ భూమిమీద యింక పనిలేదని తనువుని ముగించింది కైక!

	కైక కోరిక వల్ల అప్పటికి కష్టం కలిగినా - అది రాముని జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. కష్టాలలో ఎలా నిలబడాలో నేర్పింది. అనేక పరీక్షలకు నిలిపింది. రావణ సంహారమూ సరే, పితృ వాక్య పరిపాలకుడిగా రాముణ్ని నిలబెట్టింది. అందుకు కైకను నిందితురాల్ని చేసింది!.