ల‌క్ష్మ‌ణుడు

          అన్న‌ద‌మ్ములంటే క‌లిసి మెలిసి ఉండాలి. అలా అని చెప్ప‌డానికి ‘రామ‌ల‌క్ష్మ‌ణుల్లా ఉండాలి!’ అని పెద్ద‌లు చెప్ప‌డం వింటూ ఉంటాం. రాముడు-ల‌క్ష్మ‌ణుడు రెండు పేర్లూ విడిగాక‌న్నా ఏక‌నామంగా ‘రామ‌ల‌క్ష్మ‌ణులుగానే’ ప్ర‌సిద్ధం! ఒక త‌ల్లి క‌డుపున పుట్ట‌కపోయినా క‌వ‌ల పిల్ల‌ల్లా పిల్ల‌ల‌ప్పుడే కాదు, పెద్ద‌ప్పుడూ పెన‌వేసుకుపోయిన ర‌క్త‌సంబంధం వారిది!
             అన్న‌ను తండ్రిగా, గురువుగా, దైవంగా భావించాడు ల‌క్ష్మ‌ణుడు. అందుకే యాగ ర‌క్ష‌ణ‌కు విశ్వామిత్రుని వెంట రామునితోపాటు ల‌క్ష్మ‌ణుడూ వెళ్లాడు. విలువిద్య‌లు నేర్చుకున్నా- తాట‌కిని సుబాహుణ్ణి సంహ‌రించి య‌జ్ఞాన్ని కాపాడినా – అటు పిమ్మ‌ట మిథిల‌కు వెళ్లినా రామునితోనే ల‌క్ష్మ‌ణుడు. సీతారాముల పెళ్ల‌ప్పుడే ఊర్మిళా ల‌క్ష్మ‌ణుల పెళ్లి జ‌రిగింది. పెళ్లి జ‌రిగినా ల‌క్ష్మ‌ణునికి విడిగా జీవితం లేదు. ఊహించ‌లేం. తండ్రి మాట‌కై రాముడు అడ‌వుల‌కు వెళితే ల‌క్ష్మ‌ణుడు తండ్రితో త‌గువు ప‌డ్డ‌ది కాక – అన్న వెంట అడ‌వుల‌కు వెళ్లాడు. త‌న నిద్ర‌ను భార్య ఊర్మిళ‌కు ఇచ్చాడు గ‌నుక రాత్రీ ప‌గ‌లూ నిద్ర‌లేకుండా ప‌ద్నాలుగేళ్లు కాప‌లాకాసి సేవచేసి అన్న వెంటే ఉన్నాడు. వ‌దిన‌ను త‌ల్లిలా చూశాడు. 
శూర్ప‌ణ‌ఖ ముక్కూ చెవులూ కోసింది ల‌క్ష్మ‌ణుడే!
          సీత కోరిక మేర‌కు బంగారు లేడి వెంట ప‌డ్డాడు రాముడు. ‘ల‌క్ష్మ‌ణా’ అని ఆప‌ద గొంతుతో రాముని ఆర్త‌నాధం విన్న సీత ల‌క్ష్మ‌ణుని వెళ్ల‌మంది. నింద‌లేసింది. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్ల్లో సీత‌నొదిలి ల‌క్ష్మ‌ణుడు వెళుతూ సీత ఉన్న ప‌ర్ణ‌శాల చుట్టూ గీత గీశాడు. అదే ల‌క్ష్మ‌ణ రేఖ‌. ల‌క్ష్మ‌ణ రేఖ దాటిన సీత రావ‌ణుని మాయ‌లో ప‌డింది. అంత‌కుమించి ఆప‌ద‌కూ అప‌హ‌ర‌ణ‌కూ లోన‌యింది. 
         సీత‌ను కోల్పోయిన రాముడు ల‌క్ష్మ‌ణునికే త‌న బాధ‌నంతా చెప్పుకున్నాడు. సీత జాడ‌ను వెతుక్కుంటూ అన్న‌వెంటే అడుగులేశాడు ల‌క్ష్మ‌ణుడు. సీత ఆన‌వాళ్లుగా దొరికిన ఆభ‌ర‌ణాల‌ను ల‌క్ష్మ‌ణుడు పోల్చుకోలేక‌పోయాడు. పాదాల అందెల మ‌ట్టీల‌ను మాత్ర‌మే పోల్చాడు. వ‌దిన పాదాల‌కు న‌మ‌స్క‌రించ‌డం వ‌ల్ల‌నే ల‌క్ష్మ‌ణుడు సులువుగా గుర్తించ‌గ‌లిగాడు. వ‌దిన పాదాల్నే ల‌క్ష్మ‌ణుడు చూశాడు!
           ఇంద్ర‌ణ్ణీ ఓడించి – ఇంద్ర‌జిత్తు అనిపించుకున్న మాయా యుద్ధ‌వీరుడైన మేఘ‌నాథుడిని ల‌క్ష్మ‌ణుడే ఆట‌క‌ట్టించి మ‌ట్టుబెట్టాడు. అన్న మ‌న్న‌ల్లి అందుకున్నాడు. 
           రామ రావ‌ణ యుద్ధంలో రావ‌ణుని ధాటికి రామ‌ల‌క్ష్మ‌ణుడు ఇద్ద‌రూ మూర్ఛ‌పోయారు. రాముడు ఆదిథ్య హృద‌యాన్నిధ్యానించి తేరుకున్నాడు. ల‌క్ష్మ‌ణుని స్థితికి ఎంతో ఏడ్చాడు రాముడు. రేపు సీత త‌న‌కు దొరికినా – త‌మ్ముడు లేని త‌న‌కు సంతోష‌మెక్క‌డిద‌ని ఆవేద‌న చెందాడు. ల‌క్ష్మ‌ణునికి రాముడు దైవం. రామునికి ల‌క్ష్మ‌ణుడు ప్రాణం. ఏదైతేనేం సంజీవ‌నీ ప‌ర్వ‌తాన్ని ఆంజ‌నేయుడు ఎత్తుకొచ్చాక రామునికి ప్రాణం లేచొచ్చింది. 
                రాముని ప‌ట్టాభిషేకం జ‌రుగుతుండ‌గా ల‌క్ష్మ‌ణుడు న‌వ్విన న‌వ్వు క‌ల‌క‌లానికి కార‌క‌మైంది. అదే కీల‌క‌మైంది కూడా. అన్న‌కు ద్రోహం చేసిన విభీష‌ణుడు, అన్న‌ను చంపిన సుగ్రీవుడు, జాల‌రిపిల్ల‌ను నెత్తి నెక్కించుకున్న శివుడు, ఆడ‌రాని మాట‌లాడిన సీత‌… ఇలా అంతా లోలోప‌ల ఉలిక్కిప‌డ‌తారు. ‘నీ నువ్వుకు కార‌ణ‌మేమిటి?’ అని రాముడు అడుగుతాడు. అప్పుడు తాము అడ‌విలో ఉన్న‌ప్పుడు నిద్ర స్త్రీ రూపంలో వ‌చ్చి ఆవ‌హించ‌బోతే, అన్న సేవ‌లో ఉన్నాన‌ని, అన్న ప‌ట్టాభిషేకం అయ్యాక ర‌మ్మ‌న్నాన‌ని – ఇప్పుడు చిన్న కునుకు ప‌ట్ట‌గా న‌వ్వొచ్చింద‌ని చెబుతాడు ల‌క్ష్మ‌ణుడు 
                     ఆ త‌ర్వాత అన్న ఆన‌తి మేర‌కే సీత‌మ్మ త‌ల్లిని అడ‌వుల్లో వ‌దిలిందీ ల‌క్ష్మ‌ణుడే!
          ఆఖ‌రుకు అన్న ఆన‌తి మీరాడు. రామునితో య‌ముడు ర‌హ‌స్యంగా మాట్లాడుతుండ‌గా వ‌చ్చిన దుర్వాస మ‌హాముని లోనికి దారివిడువ‌మ‌ని, లేదంటే నిర్‌వంశ‌మ‌వుతుంద‌ని శ‌పించ‌బోతే – దారి విడిచి – ప్ర‌తిఫ‌లంగా నిర‌వేధ శిక్ష‌కు స‌మాన‌మైన దేవ బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన ల‌క్ష్మ‌ణుడు స‌ర‌యూ న‌దీ తీరానికి పోయి జీవితం చాలించాడు !
                    రాముడు విష్ణుమూర్తి అవ‌తారం అయితే, ల‌క్ష్మ‌ణుడు విష్ణువు ప‌వ‌ళించే ఆదిశేషుని అవ‌తారం చెబుతారు!
  – బ‌మ్మిడి జ‌గ‌దీశ్వ‌ర‌రావు