ఢిల్లీకి ప్లాన్ చేస్తే…. తెలంగాణలో బొక్కబోర్లా….

(ఎస్‌.విశ్వేశ్వరరావు)

రాజకీయ వ్యూహంలో తనకు తానే దిట్ట అనుకునే చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే ఆయన ప్రయత్నాలకు తెలంగాణ ఎన్నికల ఫలితాలు గుదిబండగా మారాయి. రాష్ట్ర ఓటర్లు ఇచ్చిన తీర్పుకు ఆయన ఫ్రంట్‌ కకావికలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ సైతం ఇప్పుడు ఆయనతో పనిచేసే విషయంలో డోలాయమాన పరిస్థితికి వెళ్లిపోయింది. జాతీయ స్థాయిలో మినీ ఎన్నికలను తలపించే విధంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా ప్రధానమైన నాలుగింటిలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ స్వతంత్రంగా తన సత్తాను చాటగా తెలంగాణలో డీలా పడిపోయింది. ఇందుకు బాబుతో (టిడిపి) కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకోవడమే కారణమని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎటువంటి పొత్తులు ఎవరి సహకారం లేకుండా రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా మధ్యప్రదేశ్‌లో పోటాపోటీ పరిస్థితిని ఎదుర్కొంటు అధికారాన్ని దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎటొచ్చి తెలంగాణనే కాంగ్రెస్‌ ఆధిపత్యానికి బ్రేకులు వేసింది.

జాతీయ స్థాయిలో బిజెపికి మరీ ముఖ్యంగా మోడి, అమిత్‌షాకు వ్యతిరేకంగా ఫ్రంట్‌ను కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆయన లక్ష్యంగా చేసుకొని గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా తిరుగుతూ విపరీతమైన ప్రచార కీర్తికండూతి సంపాదించుకునే పనిలో మునిగిపోయారు. దీని వెనక అసలు లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే దూరమైన బిజెపి, పవన్‌కళ్యాణ్‌ వర్గాల ఓట్లలో కొంత శాతం కాంగ్రెస్‌ ద్వారా సంపాదించుకోవచ్చని భావించారు.

అందులో భాగంగా ఏపిలో ప్రత్యేక హోదా విషయమై మోడీకి ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి జాతీయ స్థాయిలో మోడి వ్యతిరేక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆర్థికంగా సహాయం అందించడంతోపాటు ఓట్ల పరంగా ప్రయోజనం చేకూర్చి టిఆర్‌ఎస్‌ను ఓడించాలనేది ఆయన లక్ష్యం. తద్వారా కాంగ్రెస్‌కు ఏపిలో మరింత దగ్గర కావాలని భావించారు.

ఇక జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నాలకు మాయావతి, మమతాబెనర్జీ, శరద్‌పవార్‌ తదితరులు పూర్తిస్థాయిలో సహకరించకపోగా పోటీగా అభ్యర్థులను రంగంలోకి దింపుతుండడంతో దిక్కుతోచని కాంగ్రెస్‌కు చంద్రబాబు చుక్కానిలా చిక్కాడు. ఫలితంగా ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణలో ఓ వర్గం మీడియా అండ కూడా టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపింది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తోందనే అభిప్రాయం బలంగా మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా, బోగస్‌ సర్వేల ద్వారా విస్తృతంగా తెలంగాణ సమాజంలోకి తీసుకువెళ్ళటంలో చంద్రబాబు విజయం సాధించారు. కానీ దీనివల్ల తెలుగుదేశంతోపాటు కాంగ్రెస్‌ తీవ్రంగా నష్టపోయింది. 2014 వరకు తెలంగాణలో టిడిపి బలమైన శక్తిగా ఉండేది. అప్పటి ఎన్నికల్లో మంచి ఓటింగ్‌నే బిజెపితో కలిసి సాధించుకోగలిగింది. అవే ఓట్లు కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపుతాయని అంచనాకు వచ్చారు. కానీ చివరకు వికటించింది. చంద్రబాబు వల్లనే టిఆర్‌ఎస్‌, కెసిఆర్‌కు దూరమైన వర్గాలన్నీ ఇష్టంలేకపోయినా మళ్లీ టిఆర్‌ఎస్‌వైపు రాజకీయంగా యూటర్న్‌ తీసుకున్నాయి.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌లో స్వతంత్రంగా తన ప్రభావం చూపించుకున్న కాంగ్రెస్‌ తెలంగాణకు వచ్చేసరికి దిగాలుపడడానికి చంద్రబాబు వ్యూహమే కారణంగా విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ పార్టీ నాయకులతో పాటు చంద్రబాబుతో చేతులు కలిపి ఉన్న ఓట్లను కాంగ్రెస్‌ పోగొట్టుకుంది. జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, టీజెఎస్‌ పొత్తుకు విపరీతమైన ప్రధాన్యత ప్రసార, ప్రచార మాధ్యమాల్లో లభించింది.

జాతీయ స్థాయి బిజెపి మరీ ముఖ్యంగా మోడి వ్యతిరేక ఉద్యమానికి తెలంగాణ అంకురార్పణగా చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారు.

పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభ దశలోనే 25 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఎంఐఎం ప్రధాన్యం ఉన్న స్థానాలను విడిచిపెడితే ఆఖరికి కూటమి 85 స్థానాల్లో పోటికి పరిమితం అయ్యింది. ఇక అందులో 60 స్థానాలు విజయం సాధించడం సాధ్యంకాదనే అభిప్రాయానికి కూటమి నేతలు రాలేకపోయారంటే వారు నేలవిడిచి సాము చేస్తున్నట్లు స్పష్టమైపోయింది.

చివరకు ఫలితాలు కాంగ్రెస్‌కు చుక్కలు చూపించడం అలా ఉంచితే జాతీయ స్థాయిలో ఫ్రంట్‌లు ఏర్పాటు చేయడంలో కీలకనేతగా మీడియాలో కీర్తింపబడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తారో? అదే సమయంలో తనకు కీలకమైన ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నుంచి కనీసం 2 లేదా 4 శాతం ఓట్లు సాధించుకోవాలనే లక్ష్యం ఏమవుతుందో? ఆయన తెలంగాణలో సాగించిన, సాధించిన మహాకూటమి ఫలితాలు జాతీయ స్థాయిలో ముందడుగు వేసేందుకు గుదిబండగా మారుతుందనడంలో సందేహం లేదు.