పెద్ద నోట్ల రద్దుపై కుటిల రాజకీయాలు

అవసరమైనప్పుడు రాజకీయ నాయకులు కట్టు కథలల్లుతారు. గణాంకాలను, ఇతర వాస్తవ సమాచారాన్ని తృణీకరిస్తారు అన్నది అక్షర సత్యం. తాము చేసిన వాగ్దానాలు నెరవేర్చనప్పుడు రాజకీయ ప్రయోజనం కోసం, ముఖ్యంగా ఎన్నికల మొగదలో నిలబడి చావో రేవో తేల్చుకోవలసి వచ్చినప్పుడు కట్టుకథలకు అంతే ఉండదు.

2014లో అధికారంలోకి రాక ముందు నరేంద్ర మోదీ చేయని వాగ్దానం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మన అనుభవం ఏమిటంటే ఆయన అనేక వాగ్దానాలను నెరవేర్చకపోవడమే కాక అందుకోసం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.

అయినా ఈ మోసాన్ని సమర్థించే వారూ ఉన్నారు. మోదీ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక అంశాలలో వైఫల్యాలను అంగీకరించకపోగా ఇలాంటి వ్యత్యాసాలను “అతిశయోక్తిగా చెప్పిన సత్యాలు” అంటారు. ఇవి అసత్యాలు అని సమర్థించే వారు అంగీకరించరు. దీర్ఘ కాలికంగా ఆర్థిక విధానాల్లో జరిగిన లోపాలను సరిదిద్దే సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉందని నమ్మబలుకుతారు.

బీజేపీ సమర్థకులు ఎంత వంతపాడినా ఆర్థిక అంశాలలో ఇటీవల బీజేపీ చేసిన మోసాలు ఆర్థిక తార్కిక దృష్టితో చూసినప్పుడు విస్మరించదగినవి కాదు. అందులో ప్రధానమైంది పెద్ద నోట్ల రద్దులో ఎదురైన ఘోర వైఫల్యం. పెద్ద నోట్ల రద్దును బీజేపీ “నైతిక చర్య” అని సమర్థించుకుంది.

వాస్తవంగా కనిపించే సాక్ష్యాలను తోసిపుచ్చడం, తృణీకరించడంతో బీజేపీ ఆగదు. బాహాటంగా అబద్ధాలాడే బీజేపీ గుణం తీవ్రంగా కలత కలిగించే విషయం. పెద్దనోట్ల రద్దువల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది అని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదికలో అంగీకరించారు. వెంటనే నాలుక కరుచుకుని ఈ నివేదికను ఉపసంహరించి కొత్త నివేదిక విడుదల చేసి అందులో అధికారులు తప్పు దారి అనుసరించారని విరుచుకుపడ్డారు. ఇది ప్రభుత్వ సిగ్గుమాలిన తనానికి పరాకాష్ఠ. “అసత్యమే కావచ్చు కాని ఎవరు ఖాతరు చేస్తారు” అన్న మొండి వాదనకు నిదర్శనం.

అసలు ప్రశ్న ఏమిటంటే పట్టించుకోవలసింది ఎవరు? ప్రభుత్వం తాను తీసుకున్న చర్యలకు జవాబుదారుగా ఉండాలన్న వాస్తవాన్ని పక్కన పెడితే ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నించవలసిన తమ బాధ్యత నుంచి తప్పించుకోలేవు. దుష్పరిపాలనకు ప్రభుత్వం సమాధానం చెప్పి తీరవలసిందే. సంవేదనలు, భావోద్వేగాలు, సంచలనాల ఆధారంగా ప్రభుత్వం విపరీతమైన వాగడంబరం ప్రదర్శిస్తోంది.

రాజకీయ ప్రత్యర్థులపై సామాజిక మాధ్యమాల అండతో అసత్య ప్రచారానికి దిగుతోంది. భావోద్వేగాలను రెచ్చగొడ్తోంది. మొత్తం మీద భారత ప్రజాస్వామ్యంలో సంవాదానికే తావులేకుండా పోతున్నప్పుడు ఇక ఉన్నత స్థాయి చర్చలకు అవకాశం ఎక్కడిది?

అందుకే ప్రస్తుత రాజకీయ చర్చలో పెద్ద నోట్ల రద్దుపై మేధాపరమైన చర్చ కలికానికి కూడా కనిపించడం లేదు. ఈ సంవత్సరం పొడవునా వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా గత నవంబర్ 29,30న డిల్లీలో జరిగిన రైతు యాత్ర సందర్భంగా ప్రతిపక్షాలన్నీ కలిసి గిట్టుబాటు ధరలు, రుణభారం, రుణ మాఫీపై ప్రభుత్వాన్ని నిలదీసి ఉండవచ్చు. కానీ పెద్ద నోట్ల రద్దువల్ల జరిగిన అపారమైన నష్టంపై ప్రతిపక్షాలు తమ వాణి బలంగా వినిపించలేకపోయాయి.

ఉదాహరణకు కనీస మద్దతు ధర పెంచాలని అడగడం కన్నా ధాన్యం సేకరణకు బలమైన వ్యూహం రూపొందించాలని ప్రతిపక్షాలు గట్టిగా కోరి ఉండవలసింది. ఎందుకంటే మద్దతు ధరవల్ల రైతుకు కలుగుతున్న మేలు ఏమీ లేదు. ధాన్యం సేకరిస్తే తప్ప రైతుకు ఒరిగేదేమీ ఉండదు. పెద్ద నోట్ల రద్దువల్ల రైతు చేతిలో నగదు లేకుండా పోయింది.

నిరపేక్షమైన సత్యాలకన్నా భావోద్వేగాలు, వ్యక్తిగత నమ్మకాలే ప్రజాభిప్రాయాన్ని మలుస్తాయి అన్న అంశం ఆధారంగా బీజేపీ విధానాలు నిర్ణయిస్తోంది. దీన్నీ ఆధునిక కాలంలో “పోస్ట్ ట్రుత్” అంటున్నారు. అందుకే అందుబాటులో ఉన్న సమాచారంలో తమకు ఇష్టమైన దాన్ని మాత్రేం బీజేపీ స్వీకరిస్తుంది. ఉదాహరణకు 2018 డిసెంబర్ 3వ తేదీన హిందూ దిన పత్రికలో పార్లమెంటులో బీజేపీ సభ్యుడు వరుణ్ గాంధీ “రైతు ముంగిట ఉద్యోగాలు” అని రాసిన వ్యాసం గానీ, 2018 అక్టోబర్ 10వ తేదీన రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రసంగంలో ఉద్యోగకల్పనపై హామీలు గానీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే నిదర్శనం.

ఈ ఇద్దరిలో ఎవరూ మౌలికమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల అవ్యవస్థీకృత రంగంలో పని చేసే వారిపైన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అవ్యవస్థీకృత రంగంపైన విపరీతమైన ప్రతికూల ప్రభావం కలిగించినందువల్ల, వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) కోలుకోలేని దెబ్బ తీసినందువల్ల వ్యవసాయెతర రంగంలో భిన్న ధోరణి అనుసరించడం ఎలా సాధ్యం? అవ్యవస్థీకృత వస్తూత్పత్తిలో, నిర్మాణ రంగంలో, వాణిజ్య, రవాణా రంగాలలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్న సందర్భంలో ఉపాధి అవకాశాలు అమాంతం ఎలా పెరుగుతాయి?

ప్రభుత్వ అసత్యాలను ఎండగట్టడంలో నిరసనకారులు/ప్రతిపక్షాలు కూడా “నైతికత” అంశాన్నే ప్రస్తావిస్తున్నాయి. ఇది ఆర్థిక అంశాలపై కచ్చితమైన నిర్ధారణకు రావడానికి ఉపకరించదు. ఈ పద్ధతిలో కఠినమైన వాస్తవాలను విస్మరిస్తున్నాం. నిజానికి తమ పాలకులను/నాయకులను ఎన్నుకోవడంలో ప్రజలకు చాలా కీలకమైన అంశం ఇదే. పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యవస్థాపరమైన మార్పులు జరిగిన నేపథ్యంలో ప్రతిపక్షాలు/నిరసనకారులు వ్యవసాయ సంక్షోభాన్ని నిశితంగా పరిశీలించలేకపోతే బీజేపీ అతిశయోక్తులతో వెలువరించే నివేదికలే నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో తేల్చుకోలేరు.

అయితే ఆనందించదగ్గ అంశం ఏమిటంటే బీజేపీ అసత్య ప్రచారం జనం నైతిక స్థైర్యాన్ని ప్రతికూల దిశలో ప్రోది చేసింది. సభ్య సమాజంలోని కొందరైనా “మార్పు” వచ్చిందన్న వాదనలను నిశితంగా పరిశీలించకుండా వదలలేదు. వీరి దృష్టిలో పెద్ద నోట్ల రద్దు స్వార్థ రాజకీయాల కోసం పన్నిన వ్యూహం మాత్రమే. మార్పు కోసం బీజేపీ ఇస్తున్న “నైతిక” పిలుపులోని ఆంతర్యమూ ఇదే. 2019 ఎన్నికలు భారత ప్రజాస్వామ్య పటిష్ఠతకు పరీక్ష. సభ్య సమాజం ఈ కుటిల రాజకీయాలను ఏ మేరకు ఎండగట్ట గలుగుతుందన్న దానికి నిదర్శనంగా వచ్చే ఎన్నికలు నిలుస్తాయి.

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)