ప్రణబ్ మాట పట్టించుకునే వారున్నారా!

విచ్ఛిన్నకర ధోరణులు, విద్వేషం, దురభిమానంతో ఇతరులు అంటే భయపడడంవంటివి ప్రస్తుతం సర్వ వ్యాప్తమైనాయని, ఇలాంటి పోకడలపట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెచ్చరించారు.

క్రిస్మస్ సందర్భంగా భారత కాథలిక్ బిషప్పుల సభలో మాట్లాడుతూ తాజాగా ప్రణబ్ ఇలా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణబ్ ఇలా హెచ్చరించడం ఇది మొదటి సారు కాదు. గతంలో మూడు నాలుగు సందర్భాలలో ఆయన ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

2015 సెప్టెంబర్ 28న ఉత్తరప్రదేశ్ లోని దాద్రీలో అఖ్లాఖ్ అనే వ్యక్తి ఇంట్లో గొడ్డు మాంసం ఉందన్న ఆరోపణతో ఒక మూక దాడి చేసి హతమార్చింది. అక్కడి నుంచి ఇలాంటి మూక దాడులు అనేక సార్లు జరిగాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత 2015 అక్టోబర్ 8వ తేదీన “మన నాగరికతలోని మౌలిక విలువలు వృధా కాకూడదు. వైవిధ్యం మన నాగరికతలో కీలకాంశం. వైవిధ్యాన్ని గౌరవించడం మన నాగరికతలోని విశిష్టత. మనం సహనాన్ని పెంపొందించేవాళ్లం. బహుళత్వం మన ప్రత్యేకత” అని ప్రణబ్ అన్నారు.

గో మాంస భక్షణ పేరుతో మూకలు దాడికి దిగి హత్యలకు పాల్పడడం దాద్రీ సంఘటనతోనే మొదలై ఉండకపోవచ్చు. కానీ ఈ సంఘటన మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ప్రణబ్ విద్వేషాన్ని రెచ్చగొట్టే ధోరణులను ఎండగట్టారు. ఇలాంటి సంఘటనలు మనం సరైన దారిలోనే వెళ్తున్నామా అనే అనుమానం కలుగుతోందని ప్రణబ్ తీవ్ర స్వరంతోనే ఆందోళన వ్యక్తం చేశారు.

2015 అక్టోబర్ లో దసరా పండగకు ముందు పశ్చిమ బెంగాల్ లోని బీర్భంలో మాట్లాడుతూ “అసురులను, విద్వేషం రెచ్చగొట్టే వారిని నిర్మూలించాలి” అని ట్విట్టర్ సందేశం ద్వారా ప్రణబ్ పిలుపు ఇచ్చారు. “ఎట్టి పరిస్థితిలోనూ మానవతా వాదాన్ని, బహుళత్వాన్ని విడనాడకూడదు” అని ఆయన ఈ సందేశంలో పేర్కొన్నారు.

2014 మే 26వ తేదీన నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూకదాడులు, విద్వేషం పెచ్చరిల్లిపోయాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ నేరుగా బీజేపీ పేరెత్తకపోయినా విద్వేషాన్ని రెచ్చగొట్టడాన్ని దుయ్యబట్టారు.

ఆ తర్వాత 2016 ఆగస్టు 14వ తేదీన అంటే 70వ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకునే ఒక రోజు ముందు రాష్ట్రపతి ఆనవాయితీగా జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో కూడా ప్రణబ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. “విచ్ఛిన్నకర శక్తులను, విద్వేషాన్ని రెచ్చగొట్టే శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి” అని ఆయన పరోక్షంగా మోదీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. దీన్ని మోదీ ప్రభుత్వం ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నది వాస్తవం. “గత నాలుగు సంవత్సరాలుగా విచ్ఛిన్న కర శక్తులు, అసహనం, విద్వేషం పెరిగిపోతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

బలహీన వర్గాలపై దాడులు గత నాలుగు సంవత్సరాలుగా పెరిగిపోవడం మన జాతీయ స్ఫూర్తికి తగదని హితవు చెప్పారు. “ఇలాంటి శక్తులను పారదోలే శక్తి, వివేకం మన సమాజానికి, మన రాజకీయ వ్యవస్థకు ఉంది” అన్న ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం కాదని కూడా అన్నారు.

సమాజంలో శాంతికి భంగం కలిగించడం, ప్రతిబంధకాలు కల్పించడం వ్యక్తులు చేసినా, కొన్ని బృందాలో వర్గాలో చేసినా అది రాజ్యాంగానికి విఘాతం కలిగించడమేనని ప్రణబ్ నిశ్చితాభిప్రాయం. జనాన్ని మతాలవారీగా చీల్చడం లేదా సమీకరించడం వల్ల విభేదాలు పెరగడం తప్ప ఒరిగేదేమీ ఉండదని ఆయన భావన.

దళితుల మీద దాడులను, మతోద్రిక్తతలను, కశ్మీర్ లో అల్లర్లను స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రణబ్ నేరుగా ప్రస్తావించి ఉండకపోవచ్చు. కాని ఎదుటి వారి సంస్కృతిని, విలువలను, విశ్వాలను గౌరవించడం మన విధి అని అరమరికలకు తావు లేకుండానే గుర్తు చేశారు. మరో అడుగు ముందుకేసి ఆధునిక విజ్ఞానం, మతం మధ్య సామరస్యత సాధించవలసిన అవసరం ఉందని భవిష్యత్ మార్గ  నిర్దేశం కూడా ఆయన చేశారు. ప్రజలందరూ అభివృద్ధి చెందితే తప్ప దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం లేదని తెగేసి చెప్పారు.

“ఏ మతాన్ని అయినా అనుసరించడం, ప్రచారం చేయడం, విద్యా సంస్థలు నెలకొల్పుకోవడం, ఏ వృత్తినైనా ఎంపిక చేసుకోవడం మొదలైనవన్నీ చాలా ప్రధానమైనవని, వీటిని పరిరక్షించవలసిన అగత్యం ఉందని ప్రణబ్ హితబోధ కూడా చేశారు.

గో మాంస భక్షణ ఆరోపణతో దాద్రీలో, జమ్ము-కశ్మీర్ లోని ఉద్ధంపూర్, హిమాచల్ ప్రదేశ్ లోని నహాన్ మొదలైన చోట్ల మూక దాడులు జరిగినా ప్రధాన మంత్రి చాలా కాలం పెదవి విప్పలేదు. ఇలాంటి దాడులను ఖండించలేదు. ఈ దాడులకు పాల్పడ్డ వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకున్న ఉదంతాలు ఒక్కటి కూడా లేవు.

కాని విడ్డూరంగా మోదీ వాళ్లను ఎందుకు చంపుతారు నన్ను చంపండి అని ప్రకటించడంలో నాటకీయత ఉండొచ్చు. కానీ ప్రధానమంత్రి నుంచి ఇలాంటి నాటకీయతను దేశవాసులు ఆశించడం లేదు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టే పనిని ప్రధాని నేరుగా చేస్తూ ఉండకపోవచ్చు. కాని కేంద్రంలోని కొందరు బీజేపీ మంత్రులు, రెండవ, మూడవ శ్రేణి మంత్రులు నిరంతరంగా మతోద్రిక్తతలను రెచ్చగొడ్తూనే ఉన్నారు. విద్వేషాన్ని నింపే శక్తులకు ఏలిన వారి మద్దతు ఉన్నప్పుడు, దీనికి కారకులైన వారిపై తీసుకునే చర్యలు మృగ్యమైనప్పుడు ప్రణబ్ ముఖర్జీ హితబోధలు పట్టించుకునే వారు ఉంటారా అన్నదే అసలు ప్రశ్న.

-ఆర్వీ రామారావ్