”పేట” సినిమా రివ్యూ

రివ్యూ:  పేట
రేటింగ్‌:  1.75/5
తారాగణం: రజనీకాంత్‌, త్రిష, విజయ్‌ సేతుపతి, సిమ్రన్‌ తదితరులు
సంగీతం:  అనిరుధ్‌
నిర్మాత: అశోక్‌ వల్లభనేని, కళానిథి మారన్‌
దర్శకత్వం:  కార్తీక్‌ సుబ్బరాజ్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే వెంటనే గుర్తొచ్చే పదం స్టైల్. అందుకే ఆయన సినిమా ఎప్పుడు వచ్చినా దీని గురించే ఎక్కువ ఆశిస్తారు అభిమానులు.

అయితే గత కొన్నేళ్ళుగా తన స్థాయి సినిమా లేక అభిమానులు బాగా ఫీలవుతున్నారు. 2.0 వసూళ్లు తెచ్చినా అదంతా విజువల్ ఎఫెక్ట్స్ ప్రభావం కాబట్టి తలైవాకు వచ్చింది ఏమి లేదు. అందుకే పేట మీద తమిళనాడులో ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి.

కాని తెలుగులో క్రేజీ స్ట్రెయిట్ సినిమాలు పోటీలో ఉండటంతో పేట గురించి హైప్ తక్కువగా ఉంది. అయితే కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు ధైర్యంగా రిలీజ్ చేశారు. 

విద్యార్థుల అల్లరితో రణరంగంని తలపించే సెయింట్ వుడ్స్ అనే కాలేజీకి వార్డెన్ గా వస్తాడు కాళీ (రజనీకాంత్). మైకేల్ (బాబీ సింహ)లాంటి రౌడీ స్టూడెంట్స్ వల్ల దారి తప్పిన సిస్టంని ఓ కొలిక్కి తెస్తాడు. ఆ సమయంలోనే ప్రాణిక్ హీలర్ మంగళ (సిమ్రాన్) ప్రేమలో పడతాడు. కాళీ మీద కక్ష కట్టిన మైకేల్ తన తండ్రి సహాయంతో కొట్టడానికి స్కెచ్ వేస్తాడు.

అయితే అనూహ్యంగా ఉత్తర్ ప్రదేశ్ గూండాలు వచ్చి నానా విధ్వంసం చేస్తారు. ఆ క్రమంలోనే వాళ్ళు వచ్చింది కాళీ కోసం కాదని అతని తమ్ముడు మాలిక్ (శశికుమార్) కొడుకు అన్వర్ కోసమని తెలుస్తుంది. దీని వెనుక సింహాచలం అలియాస్ సింగర్ సింగ్ (నవాజుద్దీన్ సిద్ధిక్), జీతూ (విజయ్ సేతుపతి)లు ఉన్నారని తెలుస్తుంది. అసలు పేట ఎక్కడి నుంచి వచ్చాడు అతని గతం ఏంటనేది మిగిలిన కథ.

రజనీకాంత్ యధావిధిగా చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఈ వయసులోనూ ఇంత ఎనర్జీ చూపడం అంటే మాటలు కాదు. రజనితో మళ్ళీ చేసే ఛాన్స్ రాదనీ తెలుసు కాబోలు ఇందులో స్టెప్స్ కూడా వేయించాడు దర్శకుడు. హాస్టల్ వార్డెన్ గా మాడరన్ అవతారంలో, పేట వీరగా మాస్ గా రెండు వేరియేషన్స్ బాగా చూపించినందు వల్ల రజని అభిమానులను నిరాశ పరచడు. పేట ఫలితం ఎలాగైనా ఉండొచ్చు కాని సరైన కథ పడితే బాషా టైంలో ఎనర్జీ తనలో ఇప్పుడూ ఉందని మాత్రం నిరూపించాడు.

ఇక హీరొయిన్లు సిమ్రాన్, త్రిష ఏదో ఉన్నారంటే ఉన్నారు. అంతే. ఇద్దరికీ కలిపి అరగంట కూడా స్పాన్ లేదు. బాబీ సింహది లిమిటెడ్ రోల్. విజయ్ సేతుపతి పాత్ర ఆశించిన రేంజ్ లో లేదు.

నవజుద్దిన్ సిద్దిక్ విలక్షణ నటుడు కాబట్టి ఆ కోణంలో కొత్తగా అనిపిస్తుందే తప్ప ఇంకో యాంగిల్ లో చూస్తే ఇదో మాములు విలన్ పాత్రే. ఇంకా చెప్పాలంటే కాలాలో నానా పటేకర్ ను బ్లాక్ అండ్ వైట్ లో జిరాక్స్ చేసినట్టు ఉంది. శశికుమార్ ది చిన్న రోల్. మేఘా ఆకాష్ ని ఒక్క రోజు కాల్ షీట్ తో పూర్తి చేసినట్టు ఉన్నారు. సెకండ్ హాఫ్ మొత్తం మాయం అయిపోయింది. మూడు పాత్రలే హై లైట్ అయ్యాయి కాబట్టి ఎవరూ గుర్తుండరు

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నుంచి వైవిధ్యం ఆశిస్తే తాను మాత్రం పాత ఫార్ములాకే కట్టుబడ్డాడు. ఏనాడో అరిగిపోయిన హీరో అండర్ డాగ్ కథనే మళ్ళీ తీసుకున్నాడు. హీరోకు సెకండ్ హాఫ్ లో ఓ పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండటం, దాన్ని వదిలేసి ఓ కొత్త చోటుకి వచ్చి ఎవరికి తెలియకుండా జీవితాన్ని గడపడం కొన్ని వందల సినిమాల్లో వచ్చిందే. విలన్ హీరోకు ఓ రివెంజ్ థ్రెడ్ ఉండటం కొన్ని వేల సినిమాల్లో చూసిందే.

అయినా కూడా కార్తీక్ సుబ్బరాజ్ కేవలం రజని ఇమేజ్ ని, స్టైల్ ని నమ్ముకుని రొటీన్ కథతోనే రిస్క్ చేసాడు. తనలో బెస్ట్ టెక్నీషియన్ సాధ్యమైనంత కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫైనల్ గా ఇదో రొటీన్ మసాలా సినిమాగానే మిగిలిపోయింది. హీరో విలన్ కు మధ్య శత్రుత్వాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయిన కార్తీక్ ఒకరి ఉనికిని మరొకరు తెలుసుకునే క్రమాన్ని ఆసక్తికరంగా మలచలేకపోవడంతో సెకండ్ హాఫ్ మొత్తం బాగా డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ అభిమానులు కాలాతో పోల్చుకుని సంతృప్తి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అనిరుద్ సంగీతం…. బీజీఎమ్ తో మేజిక్ చేశాడు. చాలా బాగా ఇచ్చాడు. పాటలు జస్ట్ ఓకే. తిరునావుక్కరాసు కెమెరాలో రజని స్టైల్ గానే కాదు అందంగానూ ఉన్నాడు. వివేక్ ఎడిటింగ్ మాత్రం లెన్త్ ని పట్టించుకోలేదు. అదే మైనస్ అయ్యింది. సన్ నిర్మాణం బాగానే ఉంది. అంతా లిమిటెడ్ లొకేషన్స్ కాబట్టి తక్కువ ఖర్చుతోనే తలైవా సినిమా పూర్తి చేసారు.

చివరిగా చెప్పాలంటే రజని అభిమానులకు పుష్కలంగా నచ్చే మూవీ పేట. అయితే సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రం ఇది రొటీన్ అనే పెదవి విరుపు తప్పదు. మంచి మసాలా బిర్యానీలో ఉన్నట్టుండి పప్పు కలిపేస్తే ఎలాగైతే రుచి మారుతుందో మాస్ మసాలాలు బాగా దట్టించిన కార్తీక్ రిస్క్ చేయకుండా మరీ పాత ఫార్ములాలో వెళ్లిపోవడంతో రజని స్టైల్ తప్ప ఇంకే ప్రత్యేకత లేని మాములు సినిమాగా పేట మిగిలిపోయింది.

పేట – పాత పాటే