” వినయ విధేయ రామ” సినిమా రివ్యూ

రివ్యూ:   వినయ విధేయ రామ
రేటింగ్‌:  1.75/5
తారాగణం: రామ్ చరణ్, కియారా అద్వాని, ఇషా గుప్తా, స్నేహ, వివేక్‌ ఒబెరాయ్‌ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: డి.వి.వి. దానయ్య
దర్శకత్వం:  బోయపాటి శ్రీను

మెగా హీరో సినిమా అందులోనూ సుమారు ఎనిమిది నెలల తర్వాత వస్తున్న రామ్ చరణ్ మూవీ…. అంచనాలు పీక్స్ లో కాకుండా ఇంకెక్కడుంటాయి. అందుకే ‘వినయ విధేయ రామ’ ఈ రోజు గ్రాండ్ ఓపెనింగ్స్ తో థియేటర్లలోకి అడుగు పెట్టింది. అభిమానులు దీని మీదే బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

చరణ్ తో బోయపాటి మొదటి సినిమా కావడం, దేవిశ్రీప్రసాద్ లాంటి అగ్ర శ్రేణి సంగీత దర్శకుడు, దానయ్య లాంటి రాజీ పడని నిర్మాత తోడవ్వడంతో తొంభై కోట్లకు పైగా బిజినెస్ సాధ్యమయ్యింది. 

వీధుల్లో చెత్త ఏరుకుని బ్రతికే ఓ నలుగురు అనాథలకు ప్రాణాపాయంలో ఉన్న ఓ పసిగుడ్డు దొరుకుతాడు. ఓ డాక్టర్ చేరదీసి ఐదుగురికి ఆశ్రయమిస్తాడు. చివరి వాడే కొణిదెల రామ్ (రామ్ చరణ్). పెద్దవాడు భువన్ కుమార్ బీహార్ లో ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ రాజా భాయ్ అక్రమాలకు అడ్డం తిరుగుతాడు. అతన్ని చంపుతాడు రాజా భాయ్.

దాంతో రామ్ రివర్స్ లో విలన్ ను చంపేసి…. ఫ్యామిలీని దూరంగా తీసుకెళ్లి నలుగురు వదినలు ముగ్గురు అన్నయ్యలతో మాములు జీవితం గడుపుతూ ఉంటాడు. ఆ తర్వాత రాజా భాయ్ బ్రతికే ఉన్నాడన్న సంగతి తెలుస్తుంది. మళ్ళీ వేట స్టార్ట్. చివరికి ఏమైంది అనేదే వినయ విధేయ రామ కథ.

రామ్ చరణ్ రంగస్థలంలో పరిపూర్ణ నటుడిగా కనిపించాడు కానీ ఇంకా మెరుగు పడాల్సింది చాలా ఉందని వినయ విధేయ రామతో స్పష్టమయ్యింది. బరువైన ఎమోషనల్ సీన్స్ లో అందులో కనిపించినంత ఈజ్ తో ఇందులో ఏ కారణం చేతో చేయలేకపోయాడు. తిరిగి మళ్ళీ ఐదేళ్లు వెనక్కు వెళ్లినట్టు ఉంది రామ్ చరణ్ నటన.

అయితే యాక్షన్ సీన్స్ లో, డాన్స్ లో కొన్ని సీన్స్ లో మాత్రం చిరుని గుర్తు చేస్తాడు. హీరోయిన్ కియారా అద్వాని ఓ బుట్ట బొమ్మలా పాటల కోసం మాత్రమే వాడుకున్నారు.

జీన్స్ ప్రశాంత్…. కొంత ఓవర్, కొంత బెటర్ గా అలా లాగించేసాడు. స్నేహ రెండు మూడు సీన్లలో తన మార్కు చూపించింది. వివేక్ ఒబెరాయ్ రక్త చరిత్ర తర్వాత ఆ రేంజ్ విలన్ పాత్ర దక్కించుకున్నాడు కానీ కథే పూర్తిగా ఉపయోగించుకోలేకపోయింది.

ఇక మిగతా క్యారెక్టర్లు జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే బాపతే. అదే పనిగా చెప్పుకునే వాళ్లెవరు లేరు. పృథ్వి, హేమ కామెడీ వర్క్ అవుట్ కాలేదు.

తన నుంచి కొత్తదనం ఆశించకండి అని బోయపాటి శీను పదే పదే చెబుతున్నా…. రొటీన్ మాస్ నే కాస్త వైవిధ్యంగా ఏమైనా తీస్తాడేమో అన్న నమ్మకంతో వస్తుంటారు మాస్ ప్రేక్షకులు. వాళ్ళను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోతున్నట్టు జయ జానకి నాయక సినిమా రుజువు చేసింది.

అయినా దాన్నుంచి పాఠం నేర్చుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే మూసలోకి వెళ్తున్న బోయపాటికి వినయ విధేయ రామ రూపంలో మేలుకొలుపు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. లాజిక్ లేకపోయినా పర్వాలేదు… చెబుతున్న రొటీన్ కథను కాస్త చిన్న చిన్న మలుపులతో మంచి స్క్రీన్ ప్లే తో, యాక్షన్ ఎపిసోడ్స్ తో, ఎమోషన్స్ తో నడిపిస్తే పాస్ చేస్తామని ప్రేక్షకులు భద్ర, తులసి లాంటి హిట్స్ ఇచ్చినప్పుడే క్లియర్ గా చెప్పారు.

ఆ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయిన బోయపాటి వంటకంలో ఒక్క కారం మాత్రమే వేసి మిగిలిన సరుకులు వేయడం మిస్ చేయడంతో గొడ్డు కారాన్ని నీటిలో కలుపుకుని తాగిన ఫీలింగ్ కలుగుతుంది. హీరో ఫ్యామిలీతో మొదలుకుని విలన్ తో క్లాష్…. ఇలా ప్రతీది ఊహించినట్టే సాగడం వినయ విధేయ రామలో అసలు మైనస్.

యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే డిజైన్ చేసుకున్నప్పటికీ మిగిలిన విషయాల్లో నిర్లక్ష్యం వహించడంతో మొత్తంగా దెబ్బ పడింది. ఇకనైనా ఇలాంటి దర్శకుల ఆలోచనా ధోరణిలో మార్పు రాకపోతే వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి.

చివరిగా చెప్పాలంటే ఎంత కరుడు గట్టిన మాస్ ప్రేక్షకుడికైనా కన్నీరు తెప్పించే హింసాత్మక కళాఖండం ”వినయ విధేయ రామ”. సరైన కథ లేకుండా తోచిన రీతిలో యాక్షన్ ఎపిసోడ్లు మాత్రమే రాసుకుని తూతూ మంత్రంగా సినిమాలు తీస్తే ఇలానే ఉంటుంది.

రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రావాల్సిన మూవీ అయితే ఇది కాదు. చరణ్ ఫ్యాన్స్ కాస్త గుండె దిటువు చేసుకుని ఈ రొటీన్ కంటెంట్ ని భరించవచ్చేమో కానీ…. మిగిలినవాళ్లకు మాత్రం మర్చిపోదగ్గ ఆప్షన్ గా నిలుస్తుంది.

వినయ విధేయ రామ – ఇంత హింసేంటి మామా