ఆ పది శాతానికి ఉద్యోగాలెక్కడ?

వివిధ వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పశువుల నోటికి చిక్కం కట్టి ఎదుట మేత పెట్టడంలాంటిదే. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వివిధ వర్గాల వారికి విద్యారంగంలో పది శాతం సీట్లు రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సరిగ్గా ఇలాంటిదే.

ఈ నిర్ణయాన్ని ప్రచారంలో పెట్టడానికి చాలా అట్టహాసం చేశారు. ఇలాంటి వ్యూహాలు ఎన్నికలలో ఓట్లు రాబట్టడానికి ఉపకరిస్తాయనడంలో అనుమానం లేదు. అయితే దీని వల్ల ఉద్యోగావకాశాలు వస్తాయంటే నమ్మలేం. పశువు నోటికి చిక్కం కట్టి ఎదుట మేత పెట్టిన రీతిలో ఆకలి తీరనట్టే ఈ రిజర్వేషన్ విధానంవల్ల కలిగే మేలు ఏమీ లేదు. ఉద్యోగాల కల్పనకూ ఉపకరించదు.

అసలు అవకాశాలు ఎక్కడున్నాయి. భారత్ లో ఉద్యోగ కల్పన చాలా బలహీనంగా ఉందని ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలించే సి.ఎం.ఐ.ఇ. సంస్థ వెల్లడించింది. మొట్టమొదటిది 2018 డిసెంబర్ నాటికి నిరుద్యోగం 7.4 శాతం పెరిగింది. గత 15 నెలల కాలంలో నిరుద్యోగం ఇంత ఎక్కువగా ఎన్నడూ పెరగలేదు. రెండవది రిట్రెంచ్ చేసిన శ్రామికులు 2017, 2018 డిసెంబర్ నాటికి కోటీ పది లక్షల మంది ఉన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిలోనే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది.

గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగాలు కోల్పోవడం 82 శాతం దాకా ఉంది. ఇంకో వైపున వ్యవసాయ సంక్షోభం కొనసాగుతోంది. ఉపాధి కోల్పవడంవల్ల ఇబ్బందులు పడ్తున్న వారిలో 80 శాతం మంది మహిళలే. విచిత్రం ఏమిటంతే భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసమే కృషి చేస్తున్నామని చెబుతోంది.

ఈ అంచనాలు తాత్కాలికమైనవేనని సి.ఎం.ఐ.ఇ. చెప్పినప్పటికీ అసలు లెక్కలు విడుదల చేసినా పరిస్థితి అమాంతంగా మారిపోయేది ఏమీ ఉండదు. ప్రభుత్వోద్యోగాల నియామకం చాలా మందకోడిగా ఉంది. రిజర్వు చేసిన వర్గాల వారిని నియమించవలసిన చోట ఏర్పడిన ఖాళీలే మూడో వంతు ఉన్నాయి.

అదే సమయంలో అవ్యవస్థీకృత రంగం, లాంఛనప్రాయం కాని రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ రంగంలో పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను విధింపు లాంటి “దొంగ దెబ్బలతో” ఇప్పటికీ కోలుకోలేదు.

సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50 శాతానికే పరిమితం కావాలని విధించిన నిబంధనను ఉల్లంఘించడంవల్ల బీజేపీకి ఎన్నికలలో ప్రయోజనం కలిగితే కలగవచు. తమకు మద్దతిచ్చే రాజకీయ పక్షాలను చేరదీయడానికి ఉపయోగపడవచ్చు. హిందీ మాట్లాడే రాష్ట్రాలలోని “బలహీన” ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉపకరించవచ్చు.

2018 లో కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బీజేపీ ఈ వర్గాల మద్దతు కోల్పోయింది. కాని అంతిమంగా దీనివల్ల వంచనకు గురయ్యే ఓటర్లు మాత్రం పెరుగుతారు. ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారిలో ఎక్కువ మంది రిజర్వేషన్ల పరిధిలోకి రాని ఉద్యోగాలకోసమే పోటీ పడుతున్నారు. అందువల్ల రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందే వారికి ఒరిగేది ఎమీ ఉండదు.

యువత ఆకాంక్షలు బలంగా ఉన్నాయని రోజూ చెప్తూనే ఉంటారు. కాని ఈ ఆకాంక్షలను అర్థం చేసుకోవడం అర్థ మనస్కంగానే జరిగినట్టు కనిపిస్తోంది. వారికి మేలు చేసే చర్యలు తీసుకోకుండా రిజర్వేషన్ల పేరిట ఏవో తాయిలాలు ఇస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవం తీవ్రంగా ఉన్న నిరుద్యోగం అయితే ప్రభుత్వం ఆ విషయమే పట్టించుకోవడం లేదు.

భారత్ లో అయిదింట నాలుగువంతుల ఉద్యోగాలు నికరమైనవి కావని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధీనంలోని ప్రపంచ ఉద్యోగిత, సామాజిక దృక్పథం: 2018 ధోరణులు అన్న నివేదికలో తెలియజేశారు. ఇంకో అయిదింట రెండువంతుల మంది తమకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని అంటున్నారు.

అజీం ప్రేంజీ విశ్వవిద్యాలయం తయారు చేసిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2018లో కూడా తక్కువ వేతనంతో ఉద్యోగాలవల్ల సమస్య ఉందని పేర్కొన్నారు. వ్యవస్థీకృత రంగంలో కూడా తక్కువ వేతనాల సమస్య ఉంది. ఇక అవ్యవస్థీకృత రంగంలో ఈ సమస్య గురించి చెప్పక్కర్లేదు.

ద్రవ్యోల్బణం పెరుగుదలలో వేతనాల తీరును 2015లో మూడు శాతం సర్దుబాటు చేసినప్పటికీ ప్రభుత్వేతర రంగాలలో పని చేస్తున్న 82 శాతం పురుషులు, 92 శాతం మహిళలలు సంపాదించే నెలసరి ఆదాయం ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసిన కనీస వేతనం కన్న 40 శాతం తక్కువ.

దీనితో పాటు కార్మికుల ఉత్పాదకతకు, వేతనాలకు మధ్య అంతరం పెరుగుతోంది. ఉదాహరణకు వ్యవస్థీకృత రంగంలోని వస్తూత్పత్తి ఉత్పాదకత గత మూడు దశాబ్దాల కాలంగా ఆరు రెట్లు పెరిగితే వేతనాలు మాత్రం 1.5 రెట్లు మాత్రమే పెరిగాయి.

ఈ సమాచారం ఆధారంగా దేశంలో నిరుద్యోగం, ముఖ్యంగా యువతలో నిరుద్యోగం “నిజమైన” ఉద్యోగాల కల్పన కన్నా ఎక్కువగా ఉండవచ్చు. వేతనాలకు, తమ అర్హతలకు తగిన ఉద్యోగాలు లేనందువల్ల చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాన్వేషణే చేయడం లేదు. చాలా మంది యువకులు నెలసరి జీతాలొచ్చే ఉద్యోగాల కోసం చూస్తున్నారు. అదీ ప్రభుత్వోద్యోగాలు కావాలంటున్నారు.

అందువల్ల నిరుద్యోగ సమస్యకు కారణం నిరుద్యోగులే అని వాదించడానికి అవకాశం ఉంది. అది వాస్తవిక ఉపాధి అయినా, పూర్తి కాలం పని లేని ఉపాధి అయినా, ఉండవలసిన ఉద్యోగం అయినా ఉద్యోగాల కల్పన నామ మాత్రంగానే ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఆర్థికాభివృద్ధిని, ఉద్యోగ కల్పనను బలహీన పరిచే  అడ్డంకులను తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది.

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)