భారతీయుడు-2 మొదలైంది

శంకర్ డైరక్ట్ చేసిన  2.O సినిమా జస్ట్ ఇలా 50 రోజులు పూర్తిచేసుకుంది. సరిగ్గా ఇదే సందర్భంలో ఈ దర్శకుడు మరో సినిమా లాంఛ్ చేశాడు. రోబోకు సీక్వెల్ గా 2.O తీసిన శంకర్, ఇప్పుడు భారతీయుడుకు సీక్వెల్ గా ఇండియన్-2ను తెరపైకి తెచ్చాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈరోజు చెన్నైలో అట్టహాసంగా జరిగింది.

అన్నింటికంటే పెద్ద ఎట్రాక్షన్ ఏంటంటే.. కమల్ హాసన్ ఈ సినిమా ప్రారంభోత్సవానికి సేనాపతి గెటప్ లో రావడం. భారతీయుడు సినిమాలో పెద్ద కమల్ హాసన్ పాత్ర పేరు సేనాపతి. సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర ఇదే. అలాంటి పాత్రకు సంబంధించిన ముసలి గెటప్ లో కమల్ ఈవెంట్ కు రావడం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్న కాజల్ కూడా ఈ లాంఛింగ్ కు వచ్చింది.

రేపట్నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది ఇండియన్-2.