మిస్టర్ మజ్ను చుట్టూ నెగెటివ్ కామెంట్స్

మంచి టైమ్ లో రిలీజ్ అవుతోంది మిస్టర్ మజ్ను సినిమా. ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి కాంపిటిషన్ లేదు. మిస్టర్ మజ్నుతో పాటు మరో పెద్ద సినిమా రావట్లేదు. ఎఫ్2 మినహా మరో సినిమా లేదు. సో.. ఎన్ని కావాలంటే అన్ని థియేటర్లు దొరుకుతాయి. ప్లాన్డ్ గా ప్రచారం చేసుకుంటే అఖిల్ కు ఓ హిట్ గ్యారెంటీ. కానీ దీనికి విరుద్ధంగా మిస్టర్ మజ్ను చుట్టూ నెగెటివ్ వైబ్రేషన్స్ నడుస్తున్నాయి. దీనికి కారణం సినిమా ట్రయిలర్.

మిస్టర్ మజ్ను ట్రయిలర్ లో హీరో ఓ షార్ట్ టర్మ్ ప్రేమికుడు. ఇంగ్లిష్ లో చెప్పాలంటే క్యాసనోవా. తెలుగులో చెప్పాలంటే మన్మధుడు. ఎంతమందినైనా ప్రేమిస్తాడు కానీ పెళ్లి మాత్రం చేసుకోడు. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేశాయి. అదే ఇప్పుడు మిస్టర్ మజ్నుకు తలనొప్పిగా మారింది.

తమ సినిమా, వాటి కంటే ఎంతో భిన్నమైనది అనే విషయాన్ని మేకర్స్ గట్టిగా చెప్పలేకపోతున్నారు. పైగా ఆ రొటీన్ పాయింటే తమ సినిమాలో పెద్ద ట్విస్ట్ అన్నట్టు ట్రయిలర్ చివర్లో ఘనంగా చూపించారు. దీంతో మిస్టర్ మజ్ను చుట్టూ బజ్ తగ్గిపోయింది. అఖిల్ మరో రొటీన్ సినిమా చేశాడంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి. మరోవైపు సినిమా విడుదల దగ్గరపడింది. శుక్రవారమే సినిమా మార్కెట్లోకి వస్తోంది. ఈ షార్ట్ గ్యాప్ లో తమ సినిమాకు అఖిల్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తాడో చూడాలి.