అప్పులు బారెడు…. ఆదాయం మూరెడు!?

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగున్నట్టు కనిపించడం లేదు. దీనికి ప్రభుత్వ గణాంకాలే సాక్ష్యాలుగా ఉన్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెలంగాణ రాష్ట్ర సమితి భారీగా హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నింటినీ నెరవేర్చాలంటే భారీగానే నిధులు కావాలని అంటున్నారు. ఈసారి రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఇందులో భారీ మొత్తంలో నీటిపారుదల శాఖకు, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దేవాదుల వంటి భారీ ప్రాజెక్టులకు లక్షల కోట్ల నిధులు కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కు కొత్తగా 8500 కోట్లు రుణం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన ప్రాజెక్టులకు కూడా ఇదే స్థాయిలో అప్పు చేయనున్నారు.ఇక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వేలాది కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.

రుణమాఫీ, రైతుబంధు, ఆసరా పెన్షన్ లో పెంపు వంటి సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. తెలంగాణలో ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చేది ఎక్సైజ్ శాఖ మాత్రమే. హైదరాబాద్ నుంచి భారీగా రాబడి వచ్చినా అది రాష్ట్ర అవసరాలకు సరిపోతుందని భావించలేమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం భారీగా అప్పులు చేసేందుకు సంసిద్ధమై ఉండాలని వారి అభిప్రాయం. అప్పులు ఇలాగే పెరిగిపోతే భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ సమస్యలు వస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అప్పులను తీర్చేందుకు, ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు వద్ద ఎలాంటి వ్యూహాలు ఉన్నాయో ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి మాత్రం అప్పులు బారెడు… ఆదాయం మూరెడు అన్న చందంగానే ఉందంటున్నారు.