”Mr. మజ్ను” సినిమా రివ్యూ

రివ్యూ:  Mr. మజ్ను
రేటింగ్‌:  2/5
తారాగణం: అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్‌, ప్రియదర్శి, సుబ్బరాజు, నాగబాబు తదితరులు
సంగీతం:  ఎస్‌ తమన్‌
నిర్మాత: బీ.వీ.యస్‌.ఎన్‌. ప్రసాద్‌
దర్శకత్వం:   వెంకీ అట్లూరి

అక్కినేని ఫ్యామిలిలో మూడో జనరేషన్ లో రెండో హీరోగా మూడేళ్ళ క్రితమే అడుగు పెట్టిన అఖిల్ కు సక్సెస్ ఇప్పటిదాకా అందని ద్రాక్ష పండే అయ్యింది. అందుకే మిస్టర్ మజ్ను సెట్స్ మీదకు రావడానికి మూడు నాలుగు నెలలు టైం తీసుకున్నాడు. డెబ్యుతో ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ కాబట్టి దీని మీద అంచనాలు ఓ మోస్తారుగానే ఉన్నాయి. 

లండన్ లో చదివే విక్రం కృష్ణ(అఖిల్)కు అమ్మాయిల పిచ్చి. ప్రేమ పేరుతో చాలామందిని లోబరుచుకుంటుంటాడు. ఎయిర్ పోర్ట్ లో పరిచయమైన నిక్కి(నిధి అగర్వాల్)ని ట్రై చేసి ఫెయిల్ అవుతాడు. కట్ చేస్తే ఇండియాకు వచ్చాక తన చెల్లికి కాబోయే భర్త నిక్కీ అన్నయ్యే అనే వార్త తెలుస్తుంది. గతం గతః అనేసి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. మెల్లగా నిక్కీ విక్కి ప్రేమలో పడుతుంది. కానీ ముద్దు లేకుండా ప్రేమేంటి అనుకున్న విక్కి తనను రిజెక్ట్ చేస్తాడు. హర్ట్ అయిన నిక్కి తిరిగి లండన్ వెళ్ళిపోతుంది. తన ప్రేమను గెలుచుకోవడం కోసం విక్కి లండన్ బయలుదేరతాడు. కథ కంచికి ఎలా వెళ్తుందో మీరు ఈజీగా గెస్ చేయొచ్చు.

అఖిల్ నటన పరంగా మొదటి సినిమాకు ఇప్పటికి చాలా మెరుగు పడ్డాడు. కావాల్సిందల్లా సరైన కథే. తన బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటున్న అఖిల్ ఇందులో కూడా విక్కీగా న్యాయం చేసాడు. అమ్మనాన్నల అందం పుణికి పుచ్చుకున్న ఇతగాడికి కాస్త బ్రేక్ ఇచ్చే సబ్జెక్టు దొరకాలి కానీ స్టార్ గా ఎదిగే మార్గం చూపేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

డాన్స్ లో కూడా అక్కినేని హీరోల్లో బెస్ట్ అనిపిస్తున్న అఖిల్…. ఎమోషన్స్ మీద ఇంకాస్త హోమ్ వర్క్ చేయాలి. హీరోయిన్ నిధి అగర్వాల్ మొహంలో ఏ ఎక్స్ ప్రెషన్స్ సరిగా పలకలేదు. యాక్టింగ్ తో పాటు అందం కూడా అంతంత మాత్రంగా ఉండటంతో ఏ దశలోనూ మెప్పించలేకపోయింది.

కథలో అధిక శాతం ఈ ఇద్దరే కనిపిస్తారు కాబట్టి హీరోయిన్ సెలక్షన్ విషయంలో టీమ్ కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ప్రియదర్శి, హైపర్ ఆది, నాగబాబు, సితార, పవిత్ర లోకేష్, రావు రమేష్, విద్యుల్లేఖ రామన్ అందరివీ రొటీన్ పాత్రలే. ఏదో అలవాటైన రీతిలో చేసుకుంటూ పోయారు.

దర్శకుడు వెంకీ అట్లూరి కథ మొక్కుబడిగా రాసుకుని ప్రేమ ఉంటే చాలు యూత్ ఎగబడి చూస్తారు అని ఎలా అనుకున్నాడో కానీ అదే అసలుకి మోసం తెచ్చింది. ఇప్పటికే ఎన్నో సార్లు అరిగిపోయిన ఓ మాములు ప్రేమకథను చాలా పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ లాంటి హీరో మీద ప్రయోగించడం ముమ్మాటికీ తప్పే.

హీరో మీద హీరోయిన్ కు ముందు ఇష్టం లేకపోవడం, తర్వాత ప్రేమ కలగడం, తర్వాత బ్రేకప్, హీరోయిన్ ని ఇంప్రెస్స్ చేయడం కోసం హీరో విదేశాలకు వెళ్లి తన ఇంటి ఎదురుగానే మకాం పెట్టడం ఈ ఫార్ములా చూసి చూసి ప్రేక్షకులకు ఏనాడో విసుగు వచ్చేసింది. అయినా కూడా దాన్నే తీసుకోవడం బాగాలేదు.

హీరోని అమ్మాయిల వెంటపడే జులాయిగా చూపించి హీరోయిన్ ని వ్యక్తిత్వం ఉన్న దానిలా ప్రాజెక్ట్ చేసిన దర్శకుడు కేవలం తన సౌలభ్యం కోసం నిధి పాత్రను మరీ దిగజార్చేసాడు. అసలు విక్కీ అంటే నిక్కీ ఎందుకు అంత పిచ్చి పట్టేలా ప్రేమిస్తుందో ఎంత ఆలోచించినా అర్థం కాదు. కాస్త కథ మీద శ్రద్ధ పెడితే వెంకీ అట్లూరి మంచి సినిమాలు తీయగలడు. కాకపోతే లండన్ హ్యాంగ్ ఓవర్ నుంచి ఫస్ట్ సినిమా సక్సెస్ కిక్ నుంచి బయటికి రావాలి అంతే.

తమన్ సంగీతం బాగుంది. విలియమ్స్ కెమెరా పనితనం వంకలు పెట్టేలా లేదు. నవీన్ నూలి ఎడిటింగ్ లో అనవసరమైన సన్నివేశాలు కూడా అలాగే ఉండిపోయాయి. ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా చెప్పాలంటే విజయం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న అఖిల్ కు మిస్టర్ మజ్ను ఆకోరికను తీర్చడం కష్టమే. బుడిబుడి అడుగులతో ఇప్పుడిప్పుడే తనకంటూ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న అఖిల్ ఇలా పసలేని రొటీన్ ప్రేమ కథలు కాకుండా కొంత వర్క్ అవుట్ అయ్యేవాటి మీద దృష్టి పెడితే బెటర్. అంతే తప్ప కథ లేకపోయినా పరవాలేదు ప్రేమ ఉంటే చాలు అనుకుని విక్రమ్ కుమార్ లాంటి దర్శకుడే ‘హలో’ తో మెప్పించలేకపోయాడు. అలాంటిది ఒక్క సినిమా అనుభవం ఉన్న వెంకీ అట్లూరి నుంచి ఎక్కువ ఆశించడం అత్యాశే.

మిస్టర్ మజ్ను – కథే లేని ప్రేమ