ఎట్టకేలకు సెట్స్ పైకి హరీష్ శంకర్

అప్పుడెప్పుడో దువ్వాడ జగన్నాధమ్ సినిమా తీశాడు. ఆ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు దర్శకుడు హరీష్ శంకర్. ఈ గ్యాప్ లో ఎన్నో ప్రయత్నాలు చేసినా సినిమాను మాత్రం పట్టాలపైకి తీసుకురాలేకపోయాడు. ఎట్టకేలకు హరీష్ తన నెక్ట్స్ ప్రాజెక్టు ఫిక్స్ చేశారు. వరుణ్ తేజ్ హీరోగా సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈ మూవీని 27న లాంచ్ చేయబోతున్నారు.

తమిళ్ లో పెద్ద హిట్ అయిన జిగర్తాండ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు హరీష్. రీమేక్స్ ను నేటివిటీకి, హీరో ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేయడంలో ఈ దర్శకుడు దిట్ట. అందుకే ఈ ప్రాజెక్టు హరీష్ చేతికొచ్చింది. ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

నిజానికి హరీష్ చేయాల్సిన సినిమా ఇది కాదు. దాదాపు ఏడాదిగా దాగుడుమూతలు సినిమా ప్రాజెక్టు మీదున్నాడు ఈ డైరక్టర్. కానీ నిర్మాత దిల్ రాజు కారణంగా ఆ ప్రాజెక్టు నుంచి పక్కకెళ్లాల్సి వచ్చింది. బహుశా ఈ రీమేక్ పూర్తయిన తర్వాత దాగుడుమూతలు తెరపైకొస్తుందేమో చూడాలి.