డిస్కోరాజా వచ్చేశాడు.. మాస్ రాజా బర్త్ డే గిఫ్ట్

మొత్తానికి రవితేజ కొత్త సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేశారు. దాదాపు 4 నెలలుగా నలుగుతున్న డిస్కో రాజా అనే టైటిల్ నే ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. రామ్ తళ్లూరి నిర్మాతగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న డిస్కో రాజా సినిమా టైటిల్ పోస్టర్ ను ఈరోజు లాంఛ్ చేశారు. సినిమా వివరాలు కూడా బయటపెట్టారు.

ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా ముగ్గురు భామలు నటించబోతున్నారు. వీళ్లలో ఒకమ్మాయిని ఇప్పటికే ఫిక్స్ చేశారు. ఆర్ఎక్స్100తో పాపులర్ అయిన పాయల్ రాజ్ పుత్ ను డిస్కోరాజాలో హీరోయిన్ గా తీసుకున్నారు. త్వరలోనే మిగతా ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లను బయటపెడతారు.

తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాను ఏకథాటిగా షూట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రవితేజ కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేశాడు. గతంలో రామ్ తళ్లూరి నిర్మాతగా ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నేలటిక్కెట్టు అనే సినిమా వచ్చింది. అలా ఫ్లాప్ తో ప్రారంభమైన వీళ్ల ప్రయాణం, ఈసారి సక్సెస్ తీరానికి చేరుతుందేమో చూడాలి.