అంబటి రాయుడిపై నిషేధం విధించిన ఐసీసీ

టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడికి ఐసీసీ షాక్ ఇచ్చింది. అంబటి రాయుడి బౌలింగ్‌పై నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడు రెండు ఓవర్ల బౌలింగ్ చేశారు. బౌలింగ్‌ యాక్షన్‌పై మ్యాచ్ రెఫరీ అనుమానం వ్యక్తం చేశారు. అంబటి రాయుడి బౌలింగ్‌ యాక్షన్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేశారు.

రెండు వారాల్లోగా బౌలింగ్ యాక్షన్ సరైనదేనని నిరూపించుకోవాలని గతంలో నోటీసులు జారీ చేసింది ఐసీసీ. అయితే అంబటి రాయుడు పరీక్షలకు హాజరుకాలేదు. దీంతో నిబంధనల మేరకు ఐసీసీ వేటు వేసింది. ఇకపై అంతర్జాతీయ మ్యాచ్‌లో అంబటి బౌలింగ్ చేయడానికి వీల్లేదు. దేశవాళి క్రికెట్‌లో మాత్రం బౌలింగ్ చేసుకోవచ్చు.

జనవరి 13లోగా బౌలింగ్ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉండగా న్యూజిల్యాండ్ పర్యటనలో బిజీగా ఉండడం వల్ల అంబటి హాజరుకాలేదని చెబుతున్నారు. పరీక్షకు హాజరై తన బౌలింగ్‌ యాక‌్షన్‌ సరైనదేనని నిరూపించుకునే వరకు అంబటి రాయుడిపై ఈ నిషేధం కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా సీరీస్‌లో భాగంగా సిడ్నీ మ్యాచ్‌లో 22, 24 ఓవర్లలో అంబటి బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చాడు.