కేఎఫ్‌సీ చికెన్ మీద ఇష్టంతో పెదాలపై పచ్చబొట్టు వేయించుకుంది..!

ప్రస్తుత జనరేషన్ ఫాస్ట్ ఫుడ్స్ మీద విపరీతమైన ఇష్టం పెంచుకుంటున్నారు. పిజ్జా, బర్గర్స్, ఫ్రైడ్ చికెన్‌ని లాగించేస్తూ కోక్ సిప్ చేస్తూ స్నేహితులతో ముచ్చట్లలో మునిగిపోతుంటారు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన తబథా ఆండ్రాడ్ అనే 20 ఏళ్ల యువతికి కేఎఫ్‌సీ చికెన్ అంటే విపరీతమైన ఇష్టం. వారానికి కనీసం ఒక్క సారైనా చికెన్ పీసెస్, చికెన్ నగ్గెట్స్ లాగించేస్తుంది. అయితే ఈ ఇష్టం ఎంత వరకు వెళ్లిందంటే కేఎఫ్‌సీ బ్రాండ్‌ను పచ్చబొట్టు వేయించుకునేంతగా.

అమెరికాకు చెందిన మోడల్ కిండెల్ జెన్నర్‌ను స్పూర్తిగా తీసుకొని ఏకంగా పెదవుల లోపలి వైపు ‘కేఎఫ్‌సీ’ అని బ్రాండ్ నేమ్ పచ్చబొట్టుగా పొడిపించుకుంది. మొదట తల్లిదండ్రులకు చూపించినప్పుడు ఫేక్ అని కొట్టిపడేశారంట.

కానీ ఇది నిజమే అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. మొదట్లో కోపగించుకున్నా…. ఇప్పుడు వాళ్లు నా ఇష్టం తెలుసుకున్నారని అంటోంది తబథా.

బయటకు వెళ్లినప్పుడు ఈ విషయం తెలుసుకొని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ప్రతీ సారి వాళ్లకు నా పెదాలు తెరిచి చూపించడం సరదాగా ఉంటుందని చెబుతోంది. ఇది చూసి జీవితాంతం కేఎఫ్‌సీ వాళ్లు చికెన్ ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అని నవ్వేసింది. తన పెంపుడు కుక్క పేరు నగ్గెట్స్ అని ముక్తాయింపు ఇచ్చింది.