”యాత్ర” సినిమా రివ్యూ

రివ్యూ:  యాత్ర
రేటింగ్‌:  3.5/5
తారాగణం:  మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని తదితరులు
సంగీతం:  కె
నిర్మాత: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
దర్శకత్వం:  మహి. వి. రాఘవ్

టాలీవుడ్ లో బయోపిక్ ల సీజన్ ఉదృతంగా ఉన్న తరుణంలో మొదటిసారి ఓ ముఖ్యమంత్రి జీవితం సినిమాగా తెరకెక్కడం వల్ల యాత్ర మీద ప్రేక్షకులలో మంచి ఆసక్తి నెలకొంది. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను నేపధ్యంగా తీసుకుని దర్శకుడు మహి. వి. రాఘవ చేసిన ప్రయత్నం ఈ రోజు ప్రజా తీర్పు కోసం థియేటర్లలో అడుగు పెట్టింది. పాజిటివ్ బజ్ తో పోటీ లేకుండా సోలో అడ్వాంటేజ్ తీసుకుని బరిలో దిగిన యాత్ర అందరిని మెప్పించేలా సాగింది.

కథ

ఇది వైఎస్ఆర్ పూర్తి జీవితాన్ని ఆవిష్కరించే చిత్రం కాదు. కేవలం రాజకీయ నేపధ్యాన్ని చూపించి ముఖ్యమంత్రిగా ఎదగడానికి దోహదపడిన పరిస్థితులను కాస్త ఎమోషన్స్ ను జోడించి ఆవిష్కరించే ప్రయత్నం. ముక్కుసూటిగా తాను అనుకున్నది చేయడానికి హై కమాండ్ నైనా ధిక్కరించేందుకు వెనుకాడని తత్వం రాజశేఖర్ రెడ్డి(మమ్ముట్టి)ది.

అనుకోకుండా అధికారంలో ఉన్న మనదేశం పార్టీ ఏడాది ముందే బై ఎలక్షన్ కు వెళ్లడంతో ఇలా పదవుల కోసం ఎదురుచూసి లాభం లేదని ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెల్లెమ్మగా భావించే సబితా(సుహాసినీ)నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలుపెడతాడు. క్షేత్ర స్థాయి లో రైతుల సమస్యలు తెలుసుకుని చలించిపోతాడు రాజశేఖర్ రెడ్డి.

ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇస్తాడు. సిఎం క్యాండిడేట్ ఎవరో అధిష్టానం ఖరారు చేయకముందే ఇలా చెప్పడం చూసి అందరూ విస్తుపోతారు. ఇక యాత్ర అక్కడి నుంచి కొత్త మలుపు తీసుకుంటుంది. అప్పటికే జనానికి చేరువైన రాజశేఖర్ రెడ్డి యాత్ర చివరికి ఏ మజిలీ చేరుకుందో వెండితెర మీద చూడాల్సిందే.

నటీనటులు

మళయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటన గురించి చెప్పడం మొదలుపెడితే పేజీలు పుస్తకాల దాకా సాగుతాయి. ఎవరికీ అందనంత ఎత్తులో ఇప్పటికీ వేగంగా సినిమాలు చేయడంలో తనకు మాత్రమే సాధ్యమయ్యే రికార్డులు సెట్ చేస్తున్న మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. హావభావాలను పలికించే విషయంలో పెద్దాయనను అనుకరించకుండా తన స్వంత స్టైల్ లో చేయడం చాలా ప్లస్ అయ్యింది. లేదంటే కృత్రిమత్వం తోడై తేడా కొట్టేది. చేయి ఊపడం తప్పించి మిగిలిన బాడీ లాంగ్వేజ్ లో మమ్ముట్టే కనిపిస్తాడు కానీ వైఎస్ఆర్ కాదు.

తెలుగు నటులను కాకుండా ఇలా ఇతర బాషా స్టార్ ని తీసుకుని మహి రాఘవ ఎంత తెలివైన పని చేసాడో తెరపై కనిపిస్తుంది. అనవసరమైన పోలిక, కామెంట్లకు అవకాశం ఇవ్వకుండా తను ఒదిగిపోయిన తీరు మెప్పిస్తుంది. యాత్ర మొదలుపెట్టాక ఎమోషనల్ సీన్స్ లో వాహ్ అనిపిస్తాడు మమ్ముట్టి. చాలా కష్టమైనప్పటికి స్వంత డబ్బింగ్ చెప్పుకోవడం మమ్ముట్టి కమిట్మెంట్ కి చిన్న ఉదాహరణ. ఆ పాత్రలో తనను తప్ప మరో నటుడిని ఊహించుకోలేనంత గొప్పగా పండించాడు యాత్రని.

ఇది పూర్తిగా వన్ మ్యాన్ షో కావడంతో మిగిలిన ఆర్టిస్టులకు అంతగా స్కోప్ దక్కలేదు. అయినా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం గట్టిగానే చేశారు. కేవలం రెండు గంటల లోపే ఉన్న నిడివి కావడంతో మహి రాఘవకు అందరిని వాడుకునే అవకాశం దక్కలేదు. రావు రమేష్ లాంటి సీనియర్లకు కూడా చాలా పరిమితులు వచ్చాయి. అనసూయ స్పేస్ తక్కువే అయినా గుర్తుండిపోయే పాత్రే. సుహాసిని, మణిరత్నం, పొసాని, పృథ్వి, జీవా, వినోద్ కుమార్, సచిన్ కెడ్కర్, కళ్యాణిలతో పాటు ఇంకా చిన్నా చితక ఆర్టిస్టులు చాలానే ఉన్నా అందరూ స్క్రిప్ట్ డిమాండ్ మేరకు బ్యాలన్స్ డ్ గా చేసుకుంటూ పోయారు

సాంకేతిక వర్గం

దర్శకుడు మహి రాఘవ ముందు నుంచి ఇది బయోపిక్ కాదని ఒక ఎమోషనల్ పొలిటికల్ జర్నీ అని చెబుతూనే ఉన్నాడు. అందుకు తగ్గట్టే ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. అయితే తెరమీద రెండూ కన్పిస్తాయి. ఎవరి కథనైనా సినిమాగా తీసేటప్పుడు కొన్ని సూత్రాలకు లోబడే తీయాలి. కేవలం పాజిటివ్ కోణంలో మాత్రమే వాళ్ళ వ్యక్తిత్వాలను ఆవిష్కరించాల్సి ఉంటుంది. లేదూ కాన్ఫిడెన్స్ ఉంటే సున్నితంగా కన్విన్స్ అయ్యేలాగా కొన్ని తప్పులను కూడా చూపిస్తే ప్రేక్షకుడిని మెప్పించవచ్చు.

మహానటి ఈ విషయంలో సక్సెస్ అయితే ఎన్టీఆర్ కథానాయకుడు ఈ సమతూల్యం దెబ్బ తినే డిజాస్టర్ అయింది. యాత్ర ఈ రెండింటి మధ్యలో నిలుస్తుంది. వైఎస్ఆర్ అభిమానులను విపరీతంగా కనెక్ట్ అయిపోయే యాత్రలో సగటు ప్రేక్షకుడికి మాత్రం ఎమోషన్ కంటే డ్రామానే ఎక్కువగా కనిపిస్తుంది.

అయితే ఇలాంటి సబ్జెక్ట్స్ లో డ్రామా ఎంత గొప్పగా పండితే అంత బాగా రెస్పాన్స్ వస్తుంది. మహి రాఘవ సాధ్యమైనంత గట్టి ప్రయత్నమే చేసాడు కానీ అతనిలోని వైఎస్ అభిమాని దర్శకుడిని డామినేట్ చేసినా ఎమోషన్స్ వల్ల గొప్ప ఫలితం కనపడింది.

మహి రాఘవ తను చూపాలనుకున్న ప్లాట్ కి కట్టుబడి ఎక్కడా డీవియేట్ కాకుండా నడిపించిన తీరు అభినందనీయం. రైతుల మీద సన్నివేశాలు యాత్ర మొత్తానికి ప్రాణంగా నిలిచాయి. ఎందుకు రాజశేఖర్ రెడ్డి రైతుల కోసం అంతగా పరితపిస్తారో కన్విన్సింగ్ గా ప్రెజెంట్ చేసిన తీరును మెచ్చుకోవాలి.

మహి రాఘవలో గొప్ప టెక్నీషియన్ ఎమోషనల్ సీన్స్ లో బయటపడ్డాడు. డైలాగ్స్ ప్రాణప్రదంగా కాపాడాయి. ట్రైలర్ లో చూపించిన వాటితో పాటు ”రైతుల కన్నీళ్లు చూసాను… ఆ కన్నీళ్లకూ తడవని పొలాలను చూసాను” లాంటి పదాలు ఎక్కడో హృదయాలను తాకి కళ్ళను తడి చేస్తాయి. బహుశా ఇంత గొప్పగా ఒక జననేత జీవితాన్ని ఆవిష్కరించిన సినిమాగా యాత్ర చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.

చివరిగా చెప్పాలంటే యాత్ర ఓ మహానేతకు ఇచ్చిన గొప్ప నివాళి. పార్టీలకు అతీతంగా అందరూ కొలిచే ఉన్నత వ్యక్తిత్వాన్ని నరనరాల్లో నింపున్న ఓ ఆదర్శ మూర్తి జీవితాన్ని వెండితెర మీద చూడాలి అంటే యాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇది వైఎస్ఆర్ కథ కాదు. జనం గుండె చప్పుడు తెలిసిన నిజమైన నాయకుడు వెండితెరపై చేసిన చెరిగిపోని సంతకం.

యాత్ర – జోహార్ యాత్ర నాయకా