పోలీస్ కస్టడీకి జయరాం కేసు నిందితులు…. రేపు కీలక విచారణ

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస రెడ్డిలను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 31న జయరాంను రాకేష్ రెడ్డి తన ఇంటిలో హత్య చేసినట్లు ఏపీ పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నాడు.

కేసును ఏపీ ప్రభుత్వం తెలంగాణ పోలీసులకు బదిలీ చేయడంతో గత శనివారం అక్కడకు వెళ్లిన హైదరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై ఇక్కడకు తీసుకొని వచ్చి కోర్టులో హాజరు పరిచారు. వారిద్దరినీ నిన్న రిమాండుకు పంపడంతో చంచల్‌గూడ జైల్లో ఉంచారు.

ఇవాళ నాంపల్లి కోర్టులో వారిని కస్టడీకి కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నిందితులిద్దరినీ మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రేపు ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి, అతడికి సహకరించిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిలను సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించే అవకాశం ఉంది. రాకేష్ రెడ్డి ఇంటిలో ఎలా ఘటన జరిగిందనే విషయాన్ని తెలుసుకోనున్నారు. ఆ తర్వాత ఇప్పటికే సేకరించిన సాక్షుల వాంగ్మూలం ఆధారంగా ఇరువురిని ప్రశ్నించే వీలుంది.

అలాగే జయరాంకు రాకేష్ రెడ్డి అప్పుగా ఇచ్చిన 4.50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం కూడా దర్యాప్తు చేయనున్నారు.

జయరాం హత్య అనుకోకుండా జరిగిందా..? డబ్బు కోసం జరిగిందా..? లేదా ఆస్తుల గొడవ కారణమా? అనే విషయం విచారణలో తేలనుంది.