బీజేపీ దుస్సాహస రాజకీయాలు

ప్రతిపక్షలు సంఘటితం కావడానికి ఉపకరించే ప్రతి పరిణామాన్ని బీజేపీ ఎన్నికలలో తన అవకాశాలకు విఘాతం కలిగిస్తుందని భావిస్తోంది. ప్రతిపక్షాల నుంచి సవాలు ఎదుర్కోవడానికి బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తోందన్నది అసలు ప్రశ్న.

ప్రతిపక్షాలను నిలవరించడానికి కొంత నర్మగర్భంగా పని చేస్తూ ఉంటే మరి కొంత నైతికంగా ఆమోదయోగ్యం కాని విధానాలు అనుసరిస్తోంది. ప్రజా జీవనంలో కీలక ప్రశ్నలు లేవనెత్తే వారికి వ్యతిరేకంగా నీతి బాహ్యమైన విధానాలు అనుసరిస్తోంది. బడ్జెట్ లో అనవసరంగా విపరీతమైన జనాకర్షక విధానాలు అనుసరించింది. ప్రత్యర్థుల వివరాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పోగు చేస్తోంది. అవసరమనుకున్నప్పుడు ఆ సమాచారాన్ని వినియోగిస్తోంది. అసాధారమైన సమయంలో ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సి.బి.ఐ.)ని ఉసిగొల్పుతోంది. కొన్ని సార్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

ఇలాంటి రాజకీయాలు బీజేపీ నిస్సహాయ్యతకు, దుస్సాహసానికి నిదర్శనం. ప్రత్యర్థుల కన్నా తాను బలపడడానికి మార్గం కనిపించనందువల్ల ఇలాంటి పని చేస్తోంది. గత నాలుగేళ్ల పైబడిన కాలంలో సాధించిన విజయాలు ఎక్కువగా లేనందువల్ల ఈ మార్గం అనుసరిస్తోంది. 2014లో సాధించిన విజయం ఫలితాలు, కనిపించిన ఉత్సాహం ఇటీవల అయిదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాలు నీరుగార్చాయి.

ఎన్నికలలో తమ అవకాశాలను పెంపొందింప చేసుకోవడానికి శ్రద్ధా తత్పరలతో పని చేయడం మానేసి అతి తెలివి ప్రదర్శిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. చెప్పుకోదగ్గ విజయాలు లేనందువల్ల ప్రతిపక్షాల మీద ఒక సారి నర్మ గర్భంగానూ, మరో సారి బాహాటంగానూ దాడి చేస్తోంది.

అధికారం నిలబెట్టుకోవడానికి రాజకీయ పద్ధతులను విచక్షణా రహితంగా వినియోగిస్తోంది. ఓటమి తప్పించుకోవడానికే ఇలా వ్యవహరిస్తోంది. దీనిలో మూడు పద్ధతులు అనుసరిస్తున్నారు. మొదటిది బ్యాంకులకు చెల్లించవలసిన రుణాలను ఎగ్గొట్టి దేశం వదిలి వెళ్లిన వ్యక్తి లండన్ నుంచి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుండడంతో ప్రభుత్వం ఇది తమ విజయమేనని చెప్పుకుంటోంది.

అయితే ఆయనను వెనక్కి రప్పించడంలో విజయానికి అవకాశం ఉన్నట్టే అపజాయానికి అంతే అవకాశం ఉంది. ఇది మొత్తం ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే తేలుతుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం కృషి చేయడం లేదు కాని ఒక వ్యక్తిని వెనక్కు తీసుకురాగలిగితే అది తమ ఘనతేనని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది.

మోసపూరిత చర్యలను ప్రోత్సహించడంలో తన బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. అలాగే మొదట రైతులను సంక్షోభంలోకి నెట్టి తర్వాత ఊరట కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతులకు అదో రూ. 6,000 సహాయం అందజేసినంత మాత్రాన వారు గౌరవప్రదమైన జీవనం గడపడానికి తోడ్పడలేదన్న ఆరోపణ నుంచి ఈ ప్రభుత్వం తప్పించుకోలేదు. అనేక మంది పారిశ్రామిక వేత్తలు ముందు పర్యావరణ కాలుష్యానికి కారకులై తర్వాత దానికీ పరిష్కారాల గురించి మాట్లాడుతున్నట్టుగానే ఉంది. నిరుద్యోగం, వ్యవసాయ రంగ సంక్షోభంవంటి నిర్మాణాత్మకమైన వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ అనేక ఎత్తులు ఎత్తుతోంది.

రెండవది తమ “సన్నిహిత” వ్యతిరేకుల మద్దతు సమకూర్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. “ప్రజల ఆత్మ చైతన్య పరిరక్ష కులం” అని చెప్పుకునే కొందరు నాయకులు నిరాహార దీక్షలు చేస్తారు. చివరకు వారు ప్రభుత్వం నుంచి మరి కొన్ని హామీలు రాబట్టుకోవడానికే పరిమితం అవుతారు. ఇది వాగ్దానాలు వెల్లువెత్తడానికే ఉపకరిస్తుంది. ఎన్నికల రాజకీయాలపై పట్టు సంపాదించడానికి ఇలాంటి పనులు చేస్తుంటారు. కానీ బీజేపీ కొంత మంది ప్రత్యర్థులను అపఖ్యాతి పాలు చేయడానికి కూడా నర్మ గర్భంగా ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ ముందు కొన్ని సంఘటనలను సృష్టించి తర్వాత ప్రభుత్వం అఖండ విజయం సాధిస్తోంది అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది.

మూడవది కొంతమంది బీజేపీ నాయకులు నైతికంగా చెల్లని విధానాలను అనుసరించకుండా ఉండరు. ఉదాహరణకు ప్రధానమంత్రి ప్రతిష్ఠ పరిరక్షించే నెపంతో ప్రత్యర్థులపై ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

అధికార పార్టీ, ప్రభుత్వం న్యాయబద్ధమైన విమర్శలను అణచి వేస్తూ ప్రతిపక్షం అసలు తమను ప్రశ్నించనే కూడదు, సమాధానం చెప్పవలసిన అగత్యం తమకు లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. వాగ్దానాల పరంపర కొనసాగుతున్నప్పుడు ప్రతిపక్షం సమాధానాలు కోరడం సహజం.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)