”ఎన్టీఆర్-మహానాయకుడు” సినిమా రివ్యూ

రివ్యూ:  ఎన్టీఆర్-మహానాయకుడు
రేటింగ్‌:  2.25/5
తారాగణం: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్‌, దగ్గుబాటి రానా, సచిన్‌ కేద్కర్‌ తదితరులు
సంగీతం:  ఎం.ఎం.కీరవాణి
నిర్మాత:  బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి
దర్శకత్వం:  క్రిష్ జాగర్లమూడి

వంద సినిమాల అనుభవం ఉన్న స్టార్ హీరో బాలకృష్ణ కొత్త మూవీ అంటే హంగామా, హడావిడి సహజం. అయితే ఆ ట్రెండ్ కి భిన్నంగా ఎలాంటి చప్పుడు లేకుండా చాలా సైలెంట్ గా వచ్చిన మహానాయకుడు మీద పెద్దగా అంచనాలు లేవు కానీ ఏదైనా షాక్ ఇస్తుందేమో అన్న నమ్మకంతో అభిమానులు కొద్దో గొప్పో ఆశలు పెట్టుకున్నారు. మరి కథానాయకుడు రేపిన గాయాలను మానేలా ఈ మహానాయకుడు ఉన్నాడో లేదో చూడాలి.

టిడిపి పార్టీని ప్రకటించాక ప్రచారం కోసం జన జీవితంలోకి వెళ్తాడు ఎన్టీఆర్(బాలకృష్ణ). తక్కువ సమయంలోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తాడు. పక్కనే ఉండే నాదెండ్ల భాస్కర్ రావు(సచిన్ కెడ్కర్) అధికారం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అదే సమయంలో మామ పిలుపు మేరకు పార్టీలో చేరతాడు చంద్రబాబునాయుడు(రానా). బసవతారకం (విద్యాబాలన్) అనారోగ్యం కారణంగా చికిత్స కోసం ఎన్టీఆర్ యుఎస్ వెళ్ళినప్పుడు కుట్రలు పన్ని నాదెండ్ల కుర్చీ దక్కించుకుంటాడు. తిరిగి వచ్చిన ఎన్టీఆర్ అల్లుడు బాబు సహాయంతో క్యాంపు రాజకీయాలు నడిపి తిరిగి చైతన్య రథం మీద ప్రచారం సాగించి పదవిలోకి తిరిగి వస్తాడు. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవడమే మహానాయకుడు.

ఎన్టీఆర్ గా వయసు మళ్ళిన పాత్రలో బాలకృష్ణ సరిపోయాడు. ఆయన్ను అనుకరించడం అసాధ్యమనే వాస్తవాన్ని గుర్తించే స్వంత బాడీ లాంగ్వేజ్ లోనే నటిస్తూ పోయాడు బాలకృష్ణ. కథానాయకుడులో లుక్ పరంగా వచ్చిన విమర్శలు మహానాయకుడు పాత్ర వయసు దృష్ట్యా వచ్చే ఛాన్స్ లేదు.

చంద్రబాబు నాయుడుగా రానా జస్ట్ బాగున్నాడు అంతే. ఇమిటేట్ చేయడానికి ట్రై చేసి చాలా సీన్స్ లో ఇబ్బందిగా కదిలాడు. విద్యా బాలన్ ఫస్ట్ పార్ట్ లాగే చేసుకుంటూ పోయింది. సెంటిమెంట్ సీన్స్ లో తనే బలం. సచిన్ కెడ్కర్ కన్నింగ్ విలన్ గా అద్భుతమైన ఔట్ ఫుట్ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ బాగున్నాడు. వెన్నెల కిషోర్, సమీర్, దగ్గుబాటి రాజా అందరూ ఎవరి పరిధి మేరకు వాళ్ళు బాగానే చేశారు. కథ మొత్తం నాలుగు పాత్రల చుట్టే తిరుగుతుంది కాబట్టి ఎవరికీ ఎక్కువ స్కోప్ దొరకలేదు.

దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ను చిరస్మరణీయంగా తీయాలన్న ఆలోచన మంచిదే కానీ స్క్రిప్ట్ లోనే ఉన్న బోలెడు పరిమితులు అతనిలోని సృజనాత్మకతకు సంకెళ్లు వేశాయి. ఫలితంగా చంద్రబాబు నాయుడు ఇమేజ్ కు ఏ మాత్రం భంగం కలగకూడదు అనే పరిమితి మధ్య చాలా చోట్ల రాజీ పడటంతో వాస్తవాలకు దూరంగా మహానాయకుడు అయోమయానికి గురి చేస్తాడు.

అప్పుడు జరిగిన పరిణామాలు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎందరో ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయ నేపధ్యం వాళ్లకు బాగా గుర్తే. అయితే మహానాయకుడు కేవలం అనుకూలంగా ఉండే అంశాలు మాత్రమే తీసుకోవడంతో ఒకదశలో ఇది చంద్రబాబు బయోపిక్కా అనే అనుమానం కూడా వస్తుంది .

ఇంటర్వెల్ తర్వాత రెండు మూడు పొలిటికల్ ఎపిసోడ్స్ బాగానే వచ్చినప్పటికీ కీలకమైన ఉద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి. అక్కడక్కడా మినహాయించి ఏ దశలోనూ టెంపో ఉండదు. బోర్ కొట్టకపోయినా సన్నివేశాలు అలా వస్తూ పోతు ఉంటాయి తప్ప బిగి సడలని కథనం లేకపోవడం అసలు మైనస్.

మరీ తీసికట్టుగా లేదు కాని ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడంలో మహానాయకుడు సక్సెస్ కాలేకపోయాడు. కీరవాణి సంగీతం చాలా యావరేజ్ గా అనిపిస్తుంది. జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణం చాలా ఉన్నతంగా ఉంది. సాయి మాధవ్ బుర్రా ఒక్కరే ఆకట్టుకునే విధంగా సంభాషణలు రాసారు. నిర్మాణం ఓకే. రాజీ పడిన దాఖలాలు లేవు.

చివరిగా చెప్పాలంటే మహానాయకుడు సాధారణ పొలిటికల్ డ్రామాగా మిగిలిపోయిందే తప్ప ఓ గొప్ప నటుడి రాజకీయ విశ్వరూపాన్ని చూసే అనుభూతిని కలిగించలేకపోయింది. నందమూరి అభిమానులను తన పెర్ఫార్మన్స్ తో బాలయ్య ఓకే అనిపించినా మిగిలిన విషయాలు వీక్ గా ఉండటంతో సంపూర్ణంగా మెప్పించలేక యావరేజ్ కన్నా ఒక మెట్టు కిందే నిలిచిపోయేలా ఉంది. అప్పటి రాజకీయ పరిణామాలు చూచాయగా అవగాహన తెచ్చుకోవడానికి మించి మహానాయకుడులో విశేషం ఏమి లేదు

మహానాయకుడు…. ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు బయోపిక్