ఎన్నారైలు వస్తున్నారు… తమ్ముళ్లూ తప్పుకోండి తప్పుకోండి!

వాళ్లు దేశాన్ని వదిలి దశాబ్దాలు గడిచింది. సొంత దేశం లో… సొంత రాష్ట్రం లో… సొంత గ్రామాల్లో చదువుకుని అవకాశాలు రావడంతో విదేశాల్లో భవిష్యత్తు వెతుక్కుంటూ వెళ్లిన వారు. డాక్టర్లుగా…ఇంజనీర్లుగా… సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా… వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారిగా…. వ్యాపారవేత్తలుగా ఎంతో ఎదిగి ఎన్నారైలు గా పిలువబడుతున్న వారు. అలాంటి  వారిలో కొందరికి ప్రజా సేవ…. ముఖ్యంగా వారి సొంత  నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని తలంపు కలిగింది.

ఇదే అదనుగా అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు రెక్కలు కట్టుకుని వాలి పోతున్నారు. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా దేశం టికెట్ ని ఖరారు చేసుకున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేద్దామనుకున్న తెలుగు తమ్ముళ్లకు షబానా రాకతో ఆశ నిరాశ అయ్యింది.

అమెరికా లోని సుప్రసిద్ధ ఎన్నారైల సంఘం తానా అధ్యక్షుడు సతీష్ వేమన కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి తన వంతు కృషి తాను చేస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి తనకు టిక్కెట్ ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో  ఈ స్థానాన్ని తనకు కేటాయించాలని సతీష్ వేమన పట్టుపడుతున్నారు. ఇంతకు ముందు నుంచి ఇక్కడ టికెట్ ఆశిస్తున్న చెంగల్రాయుడు కి చెక్ పెట్టాలని సతీష్ వేమన కోరుతున్నారు.

అమెరికాలోని మ‌రో సంఘం నాట్స్ అధ్యక్షుడు మన్నవ మురళీకృష్ణ కూడా అధికార తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరుతున్నారు. చాలా కాలంగా పార్టీ ఇన్చార్జిగా రామానాయుడు ఉన్నారు. ఆయనను కాదని మురళీకృష్ణ కు టికెట్ కేటాయించడం అంటే పార్టీలో  చాలాకాలంగా ఉన్న వారిని విస్మరించడమే అని అంటున్నారు.

ఇక ఇదే జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి మరో ఎన్నారై మొక్కపాటి చంద్రశేఖర్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి సమీపంలో చంద్రశేఖర్ ఓ ఆసుపత్రి కూడా నిర్మించి ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఇన్చార్జిగా తెలుగుదేశం పార్టీ నాయకులు గంజి చిరంజీవి పని చేస్తున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేయాలని చిరంజీవి అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హఠాత్తుగా ఎన్నారైలు వచ్చి తమ సీట్లు కొట్టుకు పోతున్నారనే ఆగ్ర‌హం తెలుగుదేశం తమ్ముళ్లలో నానాటికీ పెరుగుతోంది. ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చిన ఎన్నారైలు గెలిస్తే ఇక్కడ కొన్నాళ్ళు ఉంటారని, ఓటమి చెందితే మాత్రం తిరిగి వెనక్కి వెళ్లిపోతారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించి ఎన్నాళ్లనుంచో పార్టీని నమ్ముకుని ఉన్న వారిని పక్కన పెట్టడం తమ్ముళ్లకు ద్రోహం చేసినట్లేనని పార్టీ నాయకులు చెబుతున్నారు.