ఎన్.డి.ఎ. వ్యవసాయ ధరల రాజకీయం

కేంద్ర గణాంకాల కార్యాలయం వ్యవసాయాభివృద్ధిపై 2011-2012 లోని విలువ చేర్చిన స్థూల ఉత్పత్తిని 2018 అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంతో పోలిస్తే వ్యవసాయాభివృద్ధి 14 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా 2.04 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది వ్యవసాయోత్పత్తి 2017 అక్టోబర్-డిసెంబర్ కాలంతో పోలిస్తే 3 శాతం ఎక్కువగా ఉంది.

ప్రస్తుత విలువను చూస్తే వ్యవసాయాభివృద్ధి హీన స్థాయిలో ఉంది. వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గిపోతున్నాయి. ఇది ఎన్.డి.ఎ. ప్రభుత్వ వ్యవసాయ విధానాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. కనీస మద్దతు ధర గణనీయంగా పెంచామని చెప్తున్న దశలో ఈ పరిస్థితి ఉంది.

కనీస మద్దతు ధర ప్రకటించిన అనేక వ్యవసాయోత్పత్తులు దానికన్నా 20 నుంచి 30 శాతం తక్కువకు అమ్ముకోవలసి వస్తుంది. ప్రభుత్వం పప్పులు, నూనె గింజలు కొంటున్నా కనీస మద్దతు ధరవల్ల లబ్ధి పొందుతున్నది మొత్తం రైతుల్లో అయిదింట ఒక శాతం మాత్రమే.

వ్యవసాయ ఉత్పత్తులకు, ఆహార పదార్థాలకు ధర నిర్ణయించడం వర్ధమాన దేశాలలో చాలా కష్టం అని ఎన్.డి.ఎ.ను సమర్థించేవారు అంటుంటారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగితె ఉత్పత్తి పెరుగుతుంది కాని అధిక ధర వినియోగదార్లకు అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా పేదలు ఇబ్బంది పడ్తారు. విపత్కరమైన పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఇలాంటి స్థితిలో అందుబాటు ధరలు, స్థిరమైన ఆదాయాలు ఉండేటట్టు చూడడం చల్లా కష్టం. ఇది అంత సులభమైన వ్యవహారం కాదు. ఇటీవల ప్రకటించిన అనేక వరాలనుబట్టి, సమతూకం సాధించడానికి చేసిన ప్రయత్నాన్నిబట్టి  చూస్తే ప్రభుత్వం ఎంత ఆత్రుత పడ్తోందో అంచనా వేయవచ్చు. కానీ వీటిని అమలు చేసే విషయంలో గతానుభవాన్నిబట్టి నిరాశే మిగులుతుంది. తగిన ధర చెల్లించడం, ధర తగ్గినప్పుడు ఆ లోటు పూడ్చడం, ప్రైవేటు ధాన్యం సేకరణ మొదలైన వాటికోసం ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్ పథకాన్ని మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అమలు చేయలేదు. ఈ పథకం అమలుకు కావలసిన నిధులు బడ్జెట్లో కేటాయించనందువల్ల మహోత్సాహంతో ప్రకటించిన ఈ పథకం కేవలం ఎన్నికల తాయిలంగానే మిగిలిపోయింది.

మన దేశంలో 70 శాతం మంది రైతులు ఇచ్చిన ధర పుచ్చుకోవలసిందే. సరైన ధర చెల్లించే యంత్రాంగమే లేదు. రైతు అయిన కాడికి అమ్ముకోవలసిన పరిస్థితి చారిత్రకంగా కొనసాగుతోంది. ధర పలకనప్పుడు రైతులు తాము పండించిన పంటను తామే నాశనం చేస్తున్నారు. మార్కెట్లో చిల్లర ధరలు ఆకాశాన్నంటిన సందర్భంలోనూ రైతుకు దక్కే ధర అదే స్థాయిలో పెరగడం లేదు. మార్కెట్ సంస్కరణ కోసం శ్రద్ధ చూపనందువల్ల ఇలా జరుగుతోంది.

మన దేశంలో అమలులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల్లో దళారులే ఎక్కువ లాభం సంపాదిస్తున్నారు. పెరిగిన ధర రైతుకు దక్కనివ్వరు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు రేట్లు ప్రకటిస్తాయి కాని ఆ ధర రైతులకు అందదు. ఇవి అన్ని రాష్ట్రాలలో ఒకే రీతిలో లేవు. పంజాబ్ లో 4 శాతం అధికంగా ఉంటే దిల్లీలో 6 శాతం ఎక్కువగా ఉన్నాయి. వసాయోత్పత్తులను వేలం వేసినప్పుడు ఈ ధరలు పెరుగుతూ ఉంటాయి. కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో ఈ ధరలు 12 శాతం దాకా అధికంగా ఉన్నాయి. మద్దతు ధర ప్రకటించినంత మాత్రాన అసలు ఉద్దేశం నెరవేరదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎన్.డి.ఎ. ప్రభుత్వం తీసుకొచ్చిన 2017 నాటి ఆదర్శ వ్యవసాయోత్పత్తుల, పశువుల అమ్మకం (ప్రోత్సాహం, సదుపాయాల కల్పన) చట్టం దోపిడీ చేసే మధ్య దళారులను ముట్టుకోకుండానే వదిలేసింది. ఎందుకంటే కేంద్ర ఏజెంట్లను అలాగే కొనసాగిస్తున్నారు.

రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఊదరగొడ్తున్నప్పటికీ మార్కెటింగ్ నిబంధనలు అంతర్నిహితంగా ఉన్నందువల్ల రైతులు ఇబ్బంది పడవలసి వస్తూనే ఉందని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఒ.ఇ.సి.డి), అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధన భారతీయ మండలి కలిసి రూపొంచించిన నివేదికలో తెలియజేశారు.

పి.ఎస్.ఇ. విధానాన్ని అనుసరించి ఒ.ఇ.సి.డి. ప్రమాణాల ప్రకారం 2000 నుంచి 2016-17 మధ్య రైతులకు మద్దతు ప్రకటించినా వారికి అందిన వార్షిక ఆదాయం మైనస్ 14 శాతం ఉంది. అంటే ప్రతి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రైతుకు సాలీన 14 శాతం తక్కువ ధర లభించింది.

2014-15, 2016-17లో ప్రధానమైన 70 శాతం వ్యవసాయ ఉత్పత్తులకు అందవలసిన ధరకన్నా తక్కువ ధరే లభించింది. విధానాలే అపసవ్యంగా ఉన్నందువల్ల ప్రకటించే ఏ రకమైన మద్దతువల్లా రైతుకు మేలు కలగడం లేదు. రైతుల ఓట్లు అవసరం కనక ఎన్నికల సమయంలో వారికి ఏవో తాయిలాలు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు.

వినియోగ దారుల వర్గం” బీజేపీని సమర్థించే “మధ్యతరగతి వర్గానికి” భిన్నం కాదుగనక ఎన్.డి.ఎ. ప్రభుత్వం వినియోగదార్లకు అనుకూల విధానాలే అనుసరిస్తోంది. అందువల్ల వినియోగదార్లకు వర్తించే ధరలను అదుపులో ఉంచడం రాజకీయ ప్రయోజనాలకు అనువుగా ఉంది. “సామాన్యుడికి అనుకూలం” అన్న నినాదాన్ని ఉపయోగించి పట్టణ ప్రాంతాల ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఆ రకంగా ఇబ్బందుల్లో ఉన్న గ్రామీణ ప్రాంత వాసులను మరింత దూరం చేసుకుంటున్నారు.

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)