దయచేసి సితారను వదిలేయండి ప్లీజ్

మీడియా మిత్రులకు మహేష్ చేస్తున్న తాజా విజ్ఞప్తి ఇది. మహర్షి ప్రమోషన్ లో భాగంగా మీడియాతో కొన్ని రోజులుగా దగ్గరగా ఉంటున్న మహేష్.. వరుసగా సితారపై వస్తున్న ప్రశ్నలను తట్టుకోలేకపోయాడు. అందుకే ఇలా విజ్ఞప్తి చేస్తున్నాడు. దయచేసి సితారకు సంబంధించిన ప్రశ్నలు మాత్రం అడగొద్దని అంటున్నాడు.

మహేష్ కొడుకు గౌతమ్ ఇప్పటికే వెండితెరపైకి వచ్చేశాడు. వన్-నేనొక్కడినే సినిమాలో జూనియర్ మహేష్ గా గౌతమ్ నటించాడు. ఇప్పుడు సితార వంతు. ఆమె ఎప్పుడు వెండితెరపైకి వస్తుందంటూ వరుసగా ప్రశ్నలు. మహేష్ ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ఈ ప్రశ్న కామన్ అయిపోయింది. దీంతో మహేష్ కాస్త గట్టిగానే ఈ అంశంపై రియాక్ట్ అయ్యాడు.

తన కూతురు సితార చాలా చిన్నదని, ప్రస్తుతం తనకు ఆటలే లోకం అని అంటున్న మహేష్.. ఆమె తెరపైకి రావడానికి చాలా టైమ్ ఉందని, ఈలోగా తన ప్రస్తావన తీసుకురావొద్దని మీడియాకు రిక్వెస్ట్ చేశాడు. అటు గౌతమ్ నెక్ట్స్ సినిమాపై కూడా రియాక్ట్ అయ్యాడు మహేష్. ప్రస్తుతం తన కొడుకు పూర్తిగా చదువుపైనే దృష్టిపెట్టాడని, మరికొన్నేళ్ల పాటు అతడు నటించే ఛాన్స్ లేదని స్పష్టంచేశాడు.