అఖిల్ కొత్త సినిమాకు రంగం సిద్ధం

వరుసగా 3 ఫ్లాపులు కొట్టిన అఖిల్ ఇప్పుడు తన నాలుగో సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అతడి కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ చేయబోయే ఈ సినిమా ఈనెల 24న లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలున్నాయి.

నిజానికి అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఈపాటికే లాంఛ్ అవ్వాల్సింది. కానీ హీరోయిన్ సెట్ అవ్వక ఇన్నాళ్లూ లేట్ అయింది. ఇప్పుడు కూడా హీరోయిన్ లేకుండానే సెట్స్ పైకి వెళ్తోంది ఈ సినిమా. కథ ప్రకారం, కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్ కోసం మేకర్స్ వెదుకుతున్నారు. క్రేజ్ ఉన్న పూజా హెగ్డే, కియరా, రష్మిక లాంటి భామలు బిజీగా ఉన్నారు.

అందుకే ప్రస్తుతానికి హీరోయిన్ ఎంపిక విషయాన్ని పక్కనపెట్టి సెట్స్ పైకి వెళ్లిపోవాలని నిర్ణయించారు. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిగా అఖిల్ పైనే కానిచ్చేసి అప్పుడు హీరోయిన్ సెలక్షన్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

అజ్ఞాతవాసి లాంటి సినిమాకు వర్క్ చేసిన మణికన్నన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మాతగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.