11 ప్రపంచకప్ టోర్నీలు…ఆరుగురు కెప్టెన్లు….రెండు ట్రోఫీలు

  • ప్రపంచకప్ చరిత్రలో భారత్ కు ప్రత్యేక స్థానం
  • 1983 లో కపిల్, 2011లో ధోనీ కెప్టెన్సీలో విశ్వవిజేతగా భారత్
  1. 1975, 79- శ్రీనివాస వెంకట్రాఘవన్ 
  2. 1983, 1987- కపిల్ దేవ్ 
  3. 1992, 96, 99- మహ్మద్ అజరుద్దీన్ 
  4. 2003 – సౌరవ్ గంగూలీ
  5. 2007- రాహుల్ ద్రావిడ్ 
  6. 2011, 2015- మహేంద్ర సింగ్ ధోనీ

నాలుగుదశాబ్దాల ఐసీసీ వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్ కు రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన రికార్డు ఉంది. 1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి 2015లో ముగిసిన 11వ ప్రపంచకప్ టోర్నీ వరకూ… భారత్ కు ఆరుగురు క్రికెటర్లు నాయకత్వం వహించారు. అయితే…తమజట్టును విశ్వవిజేతగా నిలిపిన ఘనతను ఇద్దరు మాత్రమే దక్కించుకోగలిగారు.

భారత తొలి కెప్టెన్ వెంకట్రాఘవన్…

1975లో ప్రారంభమైన ప్రుడెన్షియల్ ప్రపంచకప్ లో భారత్ ఓ అనామక జట్టుగా పాల్గొంది. ఆఫ్ స్పిన్నర్ శ్రీనివాస వెంకట్రాఘవన్ నాయకత్వంలో పాల్గొన్న భారతజట్టుకు 60 ఓవర్ల వన్డే క్రికెట్లో ఏమాత్రం అనుభవం లేకపోడంతో తేలిపోయింది. గ్రూపుదశలోనే దారుణంగా విఫలమయ్యింది.

ఇంగ్లండ్ వేదికగానే ముగిసిన 1979 ప్రపంచకప్ లో సైతం భారత్ కు వెంకట్రాఘవనే కెప్టెన్ గా వ్యవహరించారు.
వరుసగా రెండో ప్రపంచకప్ లో సైతం భారత్ పోటీ మూడుమ్యాచ్ ల ముచ్చటగానే ముగిసింది.

మొదటి రెండు ప్రపంచకప్ టోర్నీల్లో మొత్తం ఆరుమ్యాచ్ లు ఆడిన భారత్ కేవలం ఓ గెలుపు, 5 పరాజయాలతో దారుణమైన రికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది.

1983లో కపిల్ డెవిల్స్ సంచలనం…

ఇంగ్లండ్ వేదికగానే 1983లో జరిగిన మూడో ప్రపంచకప్ టోర్నీలో …ఏమాత్రం అంచనాలు లేకుండా కపిల్ దేవ్ నాయకత్వంలో భారతజట్టు బరిలోకి దిగింది. భారత క్రికెటర్లకు దారిఖర్చులు సైతం దండగేనని అందరూ భావించారు.

అయితే… డాషింగ్ ఆల్ రౌండర్ ,హర్యానా హరికేన్ కపిల్ దేవ్ స్ఫూర్తిదాయక ఆటతీరుతో అసాధ్యం సుసాధ్యంగా మారిపోయింది.
జింబాబ్వేతో ముగిసిన గ్రూప్ లీగ్ మ్యాచ్ లో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్ ను కెప్టెన్ కపిల్ దేవ్ సుడిగాలి సెంచరీతో ఆదుకొన్నాడు. కపిల్ 175 పరుగుల నాటౌట్ స్కోరుతో ఓ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి భారత క్రికెట్ నే మలుపుతిప్పాడు.

వెస్టిండీస్ తో జరిగిన ఫైనల్లో కపిల్ కీలక వికెట్లు సాధించడంతో పాటు…వీవ్ రిచర్డ్స్ ఇచ్చిన ఓ క్యాచ్ ను అందుకొని…భారత్ ను
విశ్వవిజేతగా నిలిపాడు.

భారత్ కు ప్రపంచకప్ అందించిన తొలికెప్టెన్ గా కపిల్ దేవ్…చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించాడు.

1987 ప్రపంచకప్ లో సెమీస్ తో సరి…

భారత ఉపఖండ దేశాలు వేదికగా జరిగిన 1987 రిలయన్స్ ప్రపంచకప్ లో సైతం కపిల్ దేవ్ నాయకత్వంలోనే భారతజట్టు టైటిల్ వేటకు దిగింది.

గ్రూపు లీగ్ దశలో పడుతూలేస్తూ సెమీస్ చేరిన భారత్ ను ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సెమీస్ సమరంలో చిచ్చరపిడుగు శ్రీలంక కంగుతినిపించింది.

అజరుద్దీన్ అరుదైన రికార్డు…

మూడు ప్రపంచకప్ టోర్నీలో భారత్ కు నాయకత్వం వహించిన అరుదైన ఘనతను, అసాధారణ రికార్డును మహ్మద్ అజరుద్దీన్ సొంతం చేసుకొన్నాడు. అయితే…జట్టును విజేతగా నిలపడంలో మాత్రం విఫలమయ్యాడు.

1992 బెన్సన్ -హెడ్జెస్ ప్రపంచకప్, 1996, 1999 ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయింది.

అజర్ నాయకత్వంలో 8 మ్యాచ్ లు ఆడిన భారత్ రెండే విజయాలు నమోదు చేసింది.

ఇక…1996 ప్రపంచకప్ లో భారత్ ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరినా…ఆ తర్వాత సఫలం కాలేకపోయింది.

1999 ప్రపంచకప్ లో భారత్ ఘోరవైఫల్యాన్ని చవిచూసింది. సూపర్ సిక్స్ దశను దాటలేక టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

2003లో చేజారిన ప్రపంచకప్…

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 ప్రపంచకప్ లో భారతజట్టుకు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించాడు. సచిన్ టెండుల్కర్ తో సహా పలువురు హేమాహేమీ ఆటగాళ్లతో పోటీకి దిగిన భారత్ ఏకంగా ఫైనల్స్ చేరి టైటిల్ ఆశలు రేపింది.

సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా, ఓపెనర్ గా అంచనాలకు మించి రాణించినా టైటిల్ సమరంలో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తప్పలేదు.

పాపం…రాహుల్ ద్రావిడ్…

కరీబియన్ ద్వీపాలు వేదికగా జరిగిన 2007 ప్రపంచకప్ లో భారతజట్టుకు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ లాంటి మేటి క్రికెటర్లున్న భారతజట్టు గ్రూప్ లీగ్ దశలోనే దారుణంగా విఫలమయ్యింది.

గొప్పగొప్ప ఆటగాళ్లున్నా కెప్టెన్ గా రాహుల్ ద్రావిడ్ సఫలం కాలేకపోయాడు.

మెరిసిన ధోనీ…మురిసిన భారత్ 

భారత ఉపఖండ దేశాలు వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ లో ఆతిథ్య భారత జట్టు… వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో టైటిల్ వేటకు దిగింది. గ్రూప్ లీగ్ నుంచి టైటిల్ ఫైట్ వరకూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.

ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా జరిగిన టైటిల్ సమరంలో శ్రీలంకపై ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటమే కాదు… 91 పరుగుల నాటౌట్ స్కోరుతో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్ గా నిలిచాడు. 27 సంవత్సరాల విరామం తర్వాత భారత్ కు ప్రపంచకప్ అందించాడు. 

2015లో జరిగిన 11వ ప్రపంచకప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్…సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో… టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే 2019 ప్రపంచకప్ లో…విరాట్ కొహ్లీ నాయకత్వంలో భారత్ హాట్ ఫేవరెట్ గా టైటిల్ వేటకు దిగుతోంది. మూడోసారి ప్రపంచకప్ అందుకోవాలని తహతహలాడుతోంది.