జగన్‌పై మాకు విశ్వాసం – బుద్దా, తీహార్‌ జైలు కంటే బీజేపీ బెటర్‌ కదా- వర్ల

నలుగురు ఎంపీలు పార్టీ మారడంపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న ఆసక్తికరంగా స్పందించారు. నలుగురు వ్యాపారవేత్తలు జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్న భయంతోనే బీజేపీలో చేరారని వర్ల రామయ్య ఆరోపించారు. భారీగా అక్రమాలకు పాల్పడిన సుజనాచౌదరి తీహార్‌ జైలుకు వెళ్లడం కంటే బీజేపీలోకి వెళ్లడం బెటర్ అన్న నిర్ణయంతోనే ఫిరాయించాడని వర్ల రామయ్య చెప్పారు.

చంద్రబాబును, టీడీపీని ఉపయోగించుకుని సుజనా, సీఎం రమేష్ లు ఎదిగారని చెప్పారు. అంటే అక్రమార్కులను ఇన్ని రోజులు టీడీపీ వెనుకేసుకొచ్చిందా అని ప్రశ్నించగా… పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పలేదు అని వర్లరామయ్య మొహమాటం లేకుండా చెప్పేశారు. రోమ్‌లో ఉన్నప్పుడు రోమ్‌ పౌరుడిగా గుర్తించాలి కదా అంటూ వ్యాఖ్యానించారు.

బుద్దా వెంకన్న మరో అడుగు ముందుకేసి… 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం తాము చేసిన తప్పేనని అంగీకరించాడు. ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల అటు పార్టీకి గానీ… ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలకు గానీ లాభం జరగలేదన్నారు.

ఒకవేళ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను కూడా బీజేపీ తీసుకుంటే తక్షణమే అనర్హత వేటు పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ ఒక్కరు ఫిరాయించినా తక్షణం అనర్హత వేటు వేస్తామని జగన్‌ చెప్పారు కాబట్టి ఒకవేళ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయించినా జగన్‌ ఆమాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం తమకు ఉందన్నారు బుద్దా వెంకన్న.