‘అ!’, ‘కల్కి’…. ఇక బాలకృష్ణతో…!

అప్పుడప్పుడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఊహకందని దర్శకులతో సినిమాలు ఓకే చేస్తూ ఉంటారు. క్రిష్ తో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, పూరి జగన్నాథ్ తో ‘పైసా వసూల్’ వంటి సినిమాలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. తాజాగా ఇప్పుడు మళ్లీ అలాంటి షాకే ఇవ్వబోతున్నారు బాలకృష్ణ.

‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ‘కల్కి’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు ప్రశాంత్ వర్మ.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశాంత్ వర్మ స్వయంగా తాను బాలయ్య కోసం ఒక ప్రయోగాత్మక కథను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.

మరి బాలకృష్ణ ఈ కథను విన్నారా? విని ఓకే చేశారా? లేదా? అనే విషయాలపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో బాలకృష్ణ తో సినిమా అని చెప్పడంతో కచ్చితంగా ప్రశాంత్ వర్మ బాలకృష్ణ ను కలిసి ఉంటాడని, కథను కూడా వినిపించే ఉంటారని కొందరు అంటున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

మరోవైపు బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయాల్సి ఉంది. మరి ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే బాలకృష్ణ ప్రశాంత్ తో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.