‘మిస్టర్.KK’ సినిమా రివ్యూ

రివ్యూ : మిస్టర్.KK
రేటింగ్ : 2/5
తారాగణం: విక్రమ్, అక్షర హాసన్, అబిహాసన్, లీనా, వికాస్, జాస్మిన్ తదితరులు
సంగీతం : జిబ్రాన్
నిర్మాత : నరేష్ కుమార్, శ్రీధర్
దర్శకత్వం : రాజేష్ సెల్వ

సినిమాలకు సంబంధించి ఓ చిన్న లాజిక్ ఉంది. కామెడీ సినిమా అన్నప్పుడు కామెడీ ఉండాలి. యాక్షన్ సినిమా తీస్తే యాక్షన్ ఉండాలి. అది లేనప్పుడు సినిమా రుచించదు. ఈ చిన్న లాజిక్ ను మిస్టర్ KK మిస్సయ్యాడు. యాక్షన్ సబ్జెక్ట్ తో తీసిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు లేవు. ఉన్నదంతా చిన్నపాటి సస్పెన్స్. హీరో తప్పించుకొని తిరగడం మాత్రమే.

కెకెకు (విక్రమ్) చాలా పేర్లు ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తప్పించుకోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి కెకె ఓసారి తప్పించుకోబోతూ యాక్సిడెంట్ కు గురవుతాడు. అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్ లో అతడ్ని హతమార్చాలని చూసిన దుండగులు డాక్టర్ వాసు (అబి హాసన్) వల్ల ఆ పని చేయలేకపోతారు. దీంతో వాసు భార్య గర్భవతి అదిర (అక్షర హాసన్)ను కిడ్నాప్ చేస్తారు. ఇదే టైమ్ లో జరిగిన కొన్ని హత్యల వల్ల కెకెతో పాటు వాసు కూడా నిందితుడిగా మారతాడు. ఫైనల్ గా ఈ కేసు నుంచి కెకె, వాసు ఎలా బయటపడ్డారు. వాసు-అదిర తిరిగి కలిశారా లేదా అనేది స్టోరీ.

మంచి స్టోరీ ఉంది. మలేషియా బ్యాక్ డ్రాప్ కూడా బాగానే సెట్ చేసుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన స్క్రీన్ ప్లే విషయంలో కూడా దర్శకుడు రాజేష్ నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నాడు. అంతా బాగానే ఉన్న ఈ సినిమాలో యాక్షన్ మిస్ అయింది. విక్రమ్ లాంటి నటుడ్ని పెట్టుకొని యాక్షన్ సీన్లు రాసుకోలేదు దర్శకుడు రాజేష్. సినిమా స్టార్ట్ అయినప్పట్నుంచి హీరో తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు తప్ప, ఎక్కడా ఫైట్ చేయడు. చివరికి ఫైట్ చేయాల్సిన 2-3 సందర్భాల్లో కూడా తప్పించుకోవడమే పనిగా పెట్టుకుంటాడు హీరో. సరిగ్గా ఇక్కడే మిస్టర్ KK బోల్తాకొట్టాడు.

యాక్షన్ లేని ఈ సినిమాలో ఓ చిన్నపాటి ఛేజింగ్ తోనే సంతృప్తిపడమన్నారు మేకర్స్. అది మినహా సినిమాలో ఎలాంటి యాక్షన్ ఎలిమెంట్స్ కనిపించవు. అలా అని దర్శకుడు పూర్తిస్థాయిలో సస్పెన్స్ కూడా మెయింటైన్ చేయలేకపోయాడు. ఉన్నంతలో థ్రిల్లింగ్ స్కీన్ ప్లే, 2 గంటల్లో సినిమా ముగిసిపోవడం లాంటి అంశాలు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతాయి. ఈ సినిమాను ఆసాంతం చూసేలా చేసిన ఎలిమెంట్స్ లో స్క్రీన్ ప్లే తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒకటి. ఈ విషయంలో జిబ్రాన్ కు ఫస్ట్ క్లాస్ మార్కులు పడతాయి.

బలాలు:

కథ, కథనం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నటీనటుల ప్రదర్శన

బలహీనతలు:

యాక్షన్ ఎలిమెంట్స్ లేకపోవడం, క్లయిమాక్స్ సాదాసీదాగా ముగియడం

నటీనటుల విషయానికొస్తే విక్రమ్ ఎప్పట్లానే బాగా నటించాడు. అతడి లుక్, గెటప్ కూడా బాగుంది. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు విక్రమ్ లాంటి నటుడితో మంచి యాక్షన్ సీన్లు ప్లాన్ చేయలేకపోయారు. అదే పెద్ద వెలితి. అక్షర హాసన్ యాక్టింగ్ బాగుంది. కానీ ఆమెకు గర్భవతి రోల్ ఇవ్వడాన్ని చాలామంది జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఆమె ముఖానికి, ఆమె గర్భవతి గెటప్ కు అస్సలు సింక్ అవ్వదు. అబిహాసన్, లీనా, వికాస్, జాస్మిన్ తమ పాత్రల మేరకు మెప్పించారు.

టెక్నికల్ గా మాత్రం సినిమా అవుట్ స్టాండింగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సెట్స్.. అన్నీ బాగా సెట్ అయ్యాయి. కానీ అసలైన యాక్షన్ ఎలిమెంట్స్ లేనప్పుడు ఎన్ని హంగులున్నా ఎలాంటి లాభం ఉండదు. కేవలం స్టయిలిష్ గా మాత్రమే కనిపించిన మిస్టర్ కెకె.. యాక్షన్ దగ్గరకొచ్చేసరికి తప్పించుకోవడం ప్రేక్షకుల్ని నిరాశకు గురిచేస్తుంది. చివరికి యాక్షన్ సినిమా కాబట్టి, భారీ యాక్షన్ ఎపిసోడ్ తో క్లయిమాక్స్ ముగుస్తుందనుకుంటే అక్కడ కూడా నిరాశే. అలా మిస్టర్ కెకె సినిమా ఏ జానర్ కు చెందని చిత్రంగా మిగిలిపోయింది.