సంక్రాంతి బరిలో మరో సినిమా

ఇప్పటికే 2 పెద్ద సినిమాలు సంక్రాంతి బెర్త్ ను ఆక్రమించాయి. మహేష్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు, బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురం సినిమాలు సంక్రాంతి బరిలో పోటీపడుతున్నాయి. ఈ రెండు సినిమాలకు పోటీగా మరో సినిమాను సంక్రాంతికి రెడీ చేయడానికి మిగతా మేకర్స్ అంతా భయపడుతున్నారు. చివరికి బాలయ్య కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఈ రెండు సినిమాలు తప్ప మూడో సినిమా బరిలో నిలవదని అంతా భావిస్తున్న టైమ్ లో నేనున్నానంటూ ముందుకొస్తున్నాడు కల్యాణ్ రామ్.

అవును.. కల్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. నిజానికి మహేష్, బన్నీ సినిమాలతో తలపడేంత సీన్ కల్యాణ్ రామ్ కు లేదు. కాకపోతే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా పూర్తిగా ఫ్యామిలీ మూవీ. సంక్రాంతి లాంటి పండగ టైమ్ లో అలాంటి సినిమాను రిలీజ్ చేస్తే బావుంటుందని మేకర్స్ భావించారు. పైగా సంక్రాంతి సీజన్ లో కనీసం 3 పెద్ద సినిమాలకు చోటు ఉంటుంది. గడిచిన సంక్రాంతులెన్నో ఈ విషయాన్ని నిరూపించాయి. ఆ ధైర్యం కూడా తోడవ్వడంతో కల్యాణ్ రామ్ సినిమాను రెడీ చేశారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశారు. ఈనెల 26 నుంచి వచ్చేనెల 22 వరకు సెకెండ్ షెడ్యూల్ ను తణుకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ లో హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను, నవంబర్ లో చిక్ మంగుళూరులో ఇంకో షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇలా పక్కా ప్లానింగ్ తో సినిమాను పూర్తిచేసి, సంక్రాంతికి వచ్చేయాలనేది ప్లాన్. సతీష్ వేగేశ్న డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.