మరోనేతను బీజేపీలోకి….

అనుకున్నంత అయ్యింది. ఊగిసలాటకు చెక్ చెబుతూ రాయలసీమ సీనియర్ నేత, టీడీపీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పచ్చ జెండాకు గుడ్ బై చెప్పడం ఖాయమైపోయింది. తాజాగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబును ఆది నారాయణ రెడ్డి కలిశారు. చర్చలు జరిపారు.

ఈ చర్చల తర్వాత టీడీపీలోనే ఆది కొనసాగుతారని టీడీపీ ప్రకటించింది. నాయకులు ఆది బీజేపీలోకి చేరడం లేదని వివరణ ఇచ్చారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆదినారాయణరెడ్డి తాను టీడీపీలోనే కొనసాగుతానని ఎప్పుడూ చెప్పలేదని బాంబు పేల్చారు. తాను బీజేపీలో చేరడం ఖాయమని స్పష్టం చేశారు. తనకు పార్టీ కంటే ప్రాంత అభివృద్ధి మాత్రమే ముఖ్యమని.. అందుకోసమే బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబుతో భేటి అయినంత మాత్రాన తాను టీడీపీలోనే ఉంటానని కాదని స్పష్టం చేశారు.

చంద్రబాబుతో భేటిలో తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పార్టీ మార్పు పై క్లారిటీ ఇస్తానని చెప్పానని.. తన వర్గం అభిప్రాయం ప్రకారం బీజేపీలో చేరుదామని డిసైడ్ అయినట్లు ఆది నారాయణరెడ్డి తెలిపారు. తనకు దేశభక్తి ఎక్కువ అని.. తన ప్రాంత అభివృద్ధి కోసమే బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్లు తెలిపారు.

కాగా 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు గురై వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఏకంగా మంత్రి అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆ టీడీపీని వీడి బీజేపీలో చేరుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే చంద్రబాబు సలహా మేరకే ఆది బీజేపీలోకి వెళుతున్నట్టు కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.