సుధీర్ వర్మ వల్ల చీప్ స్టార్ అయ్యాడు

తాజాగా చీప్ స్టార్ అనే పదం ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. దర్శకుడు అజయ్ భూపతి చీప్ స్టార్ అంటూ ట్వీట్ చేశాడు. అప్పట్నుంచి ఇది ట్రెండ్ అయింది. అతడు ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, అది రవితేజను ఉద్దేశించి అన్నదేనని మీడియా ఫిక్స్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. అజయ్ భూపతితో చీప్ స్టార్ అనే ట్వీట్ పెట్టించడానికి కారణమైన వ్యక్తి పేరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అతడు మరెవరో కాదు, సుధీర్ వర్మ.

అవును.. ఆఖరి నిమిషంలో సుధీర్ వర్మ రంగప్రవేశం చేయడంతోనే అజయ్ భూపతి ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు రవితేజ. దీంతో ఆగ్రహించిన అజయ్ భూపతి, చీప్ స్టార్ అంటూ ట్వీట్ చేశాడు. అదన్నమాట సంగతి.

అయితే అజయ్ భూపతిని పక్కనపెట్టేలా, రవితేజకు సుధీర్ వర్మ ఎలాంటి కంటెంట్ వినిపించాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. అంతేకాదు.. ఆర్ఎక్స్100 లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడ్ని పక్కనపెట్టి, రణరంగం లాంటి ఫ్లాప్ ఇచ్చిన సుధీర్ వర్మకు రవితేజ అవకాశం ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఏదేతైనేం, రవితేజ-అజయ్ భూపతి సినిమా లేదనే విషయం స్పష్టమైంది. తను రాసుకున్న మహాసముద్రం ప్రాజెక్టు కోసం ఇప్పుడు మరో హీరోను వెదుక్కునే ప్రాసెస్ లో ఉన్నానని, స్వయంగా అజయ్ భూపతి స్పష్టంచేయడంతో.. మేటర్ ఏంటనేది అందరికీ క్లియర్ గా అర్థమైపోయింది. మొత్తానికి మహాసముద్రం సినిమా రవితేజ-అజయ్ మధ్య బాగానే చిచ్చుపెట్టింది.